ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ ఇప్పుడు దేశాన్ని ఊపేస్తున్న పేరు. గతమెలా ఉన్నా వర్తమాన రాజకీయాల్లో మచ్చలేని ప్రజా నాయకుడిగా ఆయన అందరి ప్రశంసలు పొందుతున్నారు. సమస్య ఎక్కడుంటే అక్కడ వాలిపోతున్న తమిళనాడు సీఎం క్షణాల వ్యవధిలో పరిష్కారం చూపి మన బంగారం అని అందరితో అనిపించుకుంటున్నారు. పథకాలను అమలు జరపడంతో సరిపెట్టకుండా వాటి వల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనాన్ని అర్థం చేసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు జరుపుతున్న ముఖ్యమంత్రి కూడా స్టాలినే కావచ్చు. ఇంతవరకు కలిగిన ప్రయోజనమేంటీ మీకు ఇంకా ఏం కావాలని జనం నుంచి సమాచారం రాబట్టి దానికి తగ్గట్టుగా అధికారులకు ఆయన ఉత్తర్వులిస్తున్నారు. అందుకే ఇప్పుడు సౌత్ అయినా నార్త్ అయినా అత్యంత పాపులర్ సీఎం ఎవరంటే ఠక్కున స్టాలిన్ పేరు చెబుతున్నారు.
2021 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత స్టాలిన్ తిరుగులేని నాయకుడన్న ఫీలింగ్ వచ్చేసింది. ఏడు పదుల వయసులో 55 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న నాయకుడు కూడా స్టాలన్ ఒక్కడే కావచ్చు. ఆయన 70వ జన్మదినం సందర్భంగా దేశ రాజకీయ ముఖచిత్రంతో పాటు స్టాలిన్ భవిష్యత్తుపై కూడా చర్చ జరుగుతోంది. ఆయన ఎందుకు ప్రధాన మంత్రి కాకూడదని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ప్రస్తావిస్తున్నారు. స్టాలిన్ జన్మదిన వేడుకల కోసం కశ్మీర్ నుంచి చెన్నై వచ్చిన ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికరమైన కామెంట్స్ కూడా చేశారు. దేశం భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి డీఎంకే చేసిన కృషి మరువలేనిదని అందులో స్టాలిన్ పాత్రను ఎవరూ మరిచిపోకూడదని అబ్దుల్లా ఆన్నారు. అందుకే స్టాలిన్ కు ప్రధానమంత్రి అయ్యే అన్ని అర్హతలూ ఉన్నాయన్నారు.
తండ్రి కరుణానిధి నాయకత్వంలో స్టాలిన్ చిన్నప్పుడే ఉద్యమ బాటపట్టారు. ఎమర్జెన్సీలో మీసా చట్టం కింద జైలుకు వెళ్లారు. పోలీసు దెబ్బలకు ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన తట్టుకుని నిలబడ్డారు. డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా పార్టీ నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. పార్టీలో కీలక పదవులతో పాటు చెన్నై మేయర్ గా కూడా సేవలందించారు. కరుణానిధి తర్వాత స్టాలిన్ మాత్రమే పార్టీని నడిపించగలరన్న విశ్వాసం పొందగలిగారు. ఈ క్రమంలో సోదరుడు అళగిరిని కూడా పక్కకు నెట్టారు.
దేశ రాజకీయాలు కీలక దశలో ఉన్న తరుణంలో స్టాలిన్ తమిళనాడు సీఎం పదవిని చేపట్టారు. 2024 ఎన్నికల్లో మోదీని దించాలంటే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్న చర్చ ఊపందుకుంది. బీఆర్ఎస్ ను స్థాపించడం ద్వారా కేసీఆర్ ముందే తన పేరును ప్రస్తావించుకున్నట్లు అనిపించినా గులాబీ బాస్ ను వ్యతిరేకించే వారే ఎక్కువగా ఉంటారు. విపక్షాల్లో ఎక్కువ మంది ఆశావహులు ఉండటం ఒకవంతయితే కేసీఆర్ నాయకత్వం పట్ల విశ్వాసం లేకపోవడం మరో వంతు. జాతీయ స్థాయి రాజకీయాల్లో కేసీఆర్ కంటే స్టాలిన్ చాలా సీనియర్. డీఎంకే నేత ఆలోచనా విధానం ద్రవిడ భావజాలముూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు అందరికీ తెలుసు. పైగా భిన్నత్వంతోనే ఏకత్వం సాధించాలనుకునే ప్రాంతీయ పార్టీలు, శక్తులకు స్టాలిన్ ఓ ఐకాన్ గా కనిపిస్తారు.
బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసి ఏ ఒక్క పార్టీ అధికారాన్ని చేపట్టే అవకాశం లేదు. కనీసం ఎన్నికల అనంతర సర్దుబాటులు ఉంటేనే మోదీని అధికారానికి దూరంగా ఉంచే వీలుంటుంది. మరో పక్క కాంగ్రెస్ ను కలుపుకోకూడదని కేసీఆర్ అంటుంటే కాంగ్రెస్ తో జతగా తమిళనాడు రాజకీయాలు చేస్తున్న స్టాలిన్ మాత్రం హస్తం పార్టీని అక్కున చేర్చుకునేందుకు వెనుకాడటం లేదు. ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు సోనియా కుటుంబం సుముఖంగా లేకపోవడం స్టాలిన్ పట్ల వారికి గౌరవం ఉండటంతో ద్రవిడ నేత పీఎం పదవికి పోటీ పడితే హస్తం పార్టీ మద్దతివ్వడానికి సిద్ధంగానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాలుగైదు బలమైన పార్టీలు కలిస్తే మోదీని ఓడించడంతో పాటు స్టాలిన్ ను ప్రధానమంత్రిని చేయడం కష్టమేమీ కాదన్న వాదన బలపడుతోంది. ఏ ప్రయోగమైనా ఈ ఏడాదే మొదలు పెట్టాలన్నది మాత్రం నిజం. అప్పుడే వచ్చే ఏడాది ఎన్నికల నాటికి కూటమికి ఒక స్వరూపం వస్తుంది. మరి జయహో స్టాలిన్ అందామా వద్దా.