ఈశాన్యం. అక్కడి సంస్కృతి వేరు. ఆచార వ్యవహారాలు వేరు. హిందూ సెంటిమెంట్ పెద్దగా పనిచేయదు. అయినా ఆ రాష్ట్రాల్లోనూ కాషాయం రెపరెపలాడింది. కమ్యూనిస్టుల కంచుకోట త్రిపురని ఇదివరకే బద్దలు కొట్టిన బీజేపీ మిగిలిన ఈశాన్య రాష్ట్రాల్లోనూ పట్టు బిగిస్తోంది. అస్సాం, త్రిపుర సాంకేతికంగా హిందూ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు. కాబట్టే బీజేపీకి కలిసొచ్చిందని అనుకోవచ్చు. కానీ క్రిస్టియన్లు, గిరిజనులు ఎక్కువగా ఉండే మేఘాలయ, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఎలా పాగావేయగలుగుతోందన్నదే రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యంలో పడేస్తున్న విషయం.
ఈశాన్య రాష్ట్రాల్లో కమలం పార్టీ వికాసం తమ వ్యూహరచన ఫలితమేనని మోడీషా అనుకోవచ్చుగానీ అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలోనే దీనికి బీజం పడింది. అప్పట్లో వాజ్‌పేయి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. బీజేపీపై ఆ రాష్ట్రాల్లో సానుకూలత అప్పటినుంచే మొదలైంది. ఇప్పుడు ప్రధాని మోడీ హయాంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కళ్లెదుట కనిపిస్తున్నాయి. పాత ప్రాజెక్టులను పరుగులు పెట్టించడమే కాకుండా కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తుండటంతో బీజేపీవైపు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆకర్షితులవుతున్నారు.
రాజకీయ ప్రయోజనాలకోసమో వేర్పాటువాదం పెరగకుండా చూసేందుకో ఈశాన్య రాష్ట్రాలకు ఉదారంగా నిధులిస్తోంది కేంద్రప్రభుత్వం. గతంలో ఈశాన్యరాష్ట్రాల్లో తీవ్రవాదం ఎక్కువగా ఉండేది. ప్రజల్లో అసంతృప్తితోనే అతివాద సంస్థలు పుట్టుకొస్తున్నాయని గ్రహించిన కేంద్రం అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో ఏర్పాటైన నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్ ద్వారా స్థానిక నేతలతో సంబంధాలు మెరుగుపరుచకోవడం కూడా కమలం పార్టీకి కలిసొచ్చింది.
త్రిపురలో బీజేపీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. రెండోసారి విజయం అంత తేలిగ్గా ఏమీ రాలేదు. ఐదేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచాక బిప్లవ్ దేవ్ సీఎం అయ్యారు. అయితే తర్వాత ఆయన ప్రజాదరణ కోల్పోతున్నారని తెలిసి బీజేపీ నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బిప్లవ్‌దేవ్ స్థానంలో డాక్టర్ మాణిక్ సాహాను సీఎంని చేసింది. ఆయన పాలనలో తనదైన ముద్రవేయటంతో త్రిపుర ప్రజలు మరోసారి అధికారం కట్టబెట్టారు.
ఇతరరాష్ట్రాల్లో అనుసరించిన ఫార్ములానే ఈశాన్యరాష్ట్రాల్లోనూ అనుసరిస్తోంది బీజేపీ. ప్రజల్లో ఆదరణ కోల్పోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీఎంలను మార్చేస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ తరచూ సీఎంలను మారుస్తుందని విమర్శించిన బీజేపీకి తప్పని పరిస్థితుల్లో అదెంత ముఖ్యమో తెలిసొచ్చింది. ఉత్తరాఖండ్‌లో త్రివేంద్ర సింగ్ రావత్‌ను తొలగించి తిరత్ సింగ్ రావత్‌ను తెరపైకి తెచ్చింది. తర్వాత ఆయన్ని కూడా తప్పించి పుష్కర్ ధామిని సీఎంని చేసింది. గుజరాత్‌లో కూడా విజయ్ రూపానీని తప్పించి భూపేంద్రభాయ్ పటేల్‌కు బాధ్యతలు అప్పగించి మళ్లీ అధికారం దక్కించుకుంది బీజేపీ. కర్నాటకలోనూ యడ్యూరప్పని తప్పించి బస్వరాజ్ బొమైని సీఎంని చేసింది. ఎన్నికల వ్యూహాల్లో బీజేపీ బాగా తలపండిపోయింది.