వైసీపీ పాలనలో అతిపెద్ద ఈవెంట్‌.. గ్లోబల్‌ సమ్మిట్‌

By KTV Telugu On 3 March, 2023
image

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అతిపెద్ద సమ్మిట్‌. టార్గెట్‌ రెండు లక్షల కోట్ల పెట్టుబడులు. విశాఖలో రెండ్రోజులు జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023పై ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. దేశ‌విదేశాల నుంచి భారీగా పెట్టుబ‌డులు రాబ‌ట్టాల‌ని లక్ష్యంగా పెట్టుకుంది. తొలిరోజు సమ్మిట్‌ ఆశాజనకంగా మొదలైంది. టార్గెట్ పెట్టుకుంది. విశాఖపట్టణంలో మొదలైన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కి పారిశ్రామిక దిగ్గజాలు, 45కు పైగా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలపై మంత్రులు కీలక ప్రసంగం చేశారు.

విభజన తర్వాత ఆర్థికలోటు ఉన్నా ఏపీలో ప్రకృతి ప్రసాదిత స‌హ‌జ‌వ‌న‌రులు అనేకం ఉన్నాయి. సుదీర్ఘ తీర‌ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కున్న వరం. దీనికితోడు పెట్టుబడిదారులకు రెడ్‌ కార్పెట్ వేసేలా వారు నిస్సంకోచంగా పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేలా అనువైన పాల‌సీలను వైసీపీ ప్రభుత్వం రూపొందించింది. ప‌రిశ్రమ‌ల‌కు ఇచ్చే రాయితీలతో పాటు అనుమ‌తుల విష‌యంలో సింగిల్ డెస్క్ విధానం ఏపీ వైపు పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తోంది. ఇప్పటికే దేశ‌వ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో రోడ్ షోలతో ఏపీ అధికారులు ఇక్కడి పారిశ్రామిక విధానాన్ని ప్రచారం చేశారు. హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, బెంగ‌ళూరు, చెన్నై న‌గ‌రాల్లో రోడ్ షోలతో గ్లోబల్‌ స‌మ్మిట్‌కి ప్రభుత్వం ఆహ్వానాలు ప‌లికింది. ఢిల్లీలోనూ వివిధ దేశాల దౌత్యవేత్తలతో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించి ఈ సమ్మిట్‌కి విదేశీ ప్రతినిధులను ఆహ్వానించారు సీఎం వైఎస్‌ జ‌గ‌న్మోహన్‌రెడ్డి.

గ్లోబ‌ల్ ఇన్వెస్టర్స్‌ స‌మ్మిట్‌తో కీల‌క‌మైన 15 రంగాల్లో పెట్టుబ‌డులు సాధించాల‌నుకుంటుంది ఏపీ ప్రభుత్వం. ఏరో స్పేస్-డిఫెన్స్, అగ్రి-ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్-ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్, ఎల‌క్ట్రానిక్స్-ఐటీ, హెల్త్ కేర్-మెడిక‌ల్ ఎక్విప్ మెంట్, ఇండ‌స్ట్రీస్-లాజిస్టిక్ ఇన్‌ఫ్రాస్టక్చర్‌, MSME-స్టార్టప్స్, పెట్రోలియం-పెట్రో కెమిక‌ల్స్, ఫార్మాస్యూటిక‌ల్స్-లైఫ్ సైన్సెస్, రెన్యువ‌బుల్ ఎన‌ర్జీ, స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్-ఎడ్యుకేష‌న్, టెక్స్ టైల్స్-అప్పరెల్స్, టూరిజం-హాస్పిటాలిటీ రంగాల‌పై ప్రధానంగా ఫోకస్‌ పెట్టింది. ఆయా రంగాల్లో పెట్టుబ‌డులకు ఇప్పటికే చాలా కంపెనీలు ముందుకొచ్చాయి. రెండు రోజుల స‌మ్మిట్‌తో తన లక్ష్యం నెరవేరుతుందన్న నమ్మకంతో ఏపీ సర్కారు ఉంది. ఎంవోయూలతో బోణీ బాగుంది. ముఖేష్ అంబాని, గౌత‌మ్ అదాని, ఆదిత్య మిట్టల్, కుమార మంగ‌ళం బిర్లాలాంటి ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాల రాకతో సమ్మిట్‌ లక్ష్యం నెరవేరబోతోంది.