తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ సాగుతున్నాయ్. కాంగ్రెస్, బీజేపీ నేతలు….టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు బీజేపీ ఫాలో అవుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని సీమాంధ్ర ఓట్లు…రేవంత్ రెడ్డి లాగేసుకుంటాడన్న భయం బీజేపీ నేతలకు పట్టుకుంది.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారం…తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి…పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. బ్లాక్ మెయిలర్, మోసగాడు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అదే సమయంలో…టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైనా విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి నోరు మూయించడానికి…చంద్రబాబును టార్గెట్ చేసుకుంటున్నారు. మాజీ మంత్రులు డీకే అరుణ, ఈటల రాజేందర్….చంద్రబాబుకు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందంటూ…కార్నర్ చేస్తున్నారు. అంతకుముందు పలు సందర్భాల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సైతం…చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేతను టార్గెట్ చేస్తే…తెలంగాణ ప్రజలంతా తమకే ఓటు వేస్తారన్న ఆలోచనలో ఉన్నారు బీజేపీ నేతలు. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు యాక్టివ్ గా లేకపోయినా…ఆయన్ను విమర్శించడం ఓట్లు రాబట్టుకోవాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో…కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేశాయ్. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 19, తెలుగుదేశం పార్టీ 2 సీట్లకే పరిమితం అయ్యాయ్. టీఆర్ఎస్ పార్టీ 88 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సీఎం కేసీఆర్…చంద్రబాబు తెలంగాణ ద్రోహి అంటూ ప్రజల్లోకి తీసుకెళ్లారు. తెలంగాణకు మొదటి శత్రువని…ఇక్కడి వనరులను ఆంధ్రా ప్రజలకు దోచిపెట్టాడంటూ పదే పదే చంద్రబాబు తూలనాడారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆంధ్రా నేతల పెత్తనం ఏంటంటూ ప్రజలకు ప్రశ్నలు సంధించారు ముఖ్యమంత్రి కేసీఆర్. గులాబీ బాస్ కేసీఆర్ వేసిన ప్లాన్…ఆ ఎన్నికల్లో సక్సెస్ అయింది. టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని విజయం సాధించింది. 2014లో 15 సీట్లు గెలిచిన టీడీపీ…2018 నాటికి 2 సీట్లకు పడిపోయింది. కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేసినా…21 సీట్లకే పరిమితమయ్యాయ్.
తెలంగాణని దోచుకోవడానికే…రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో పక్కా ప్లాన్ ప్రకారం తెలుగుదేశం పార్టీని అంతం చేశారన్న ఆయన…డబ్బులిచ్చి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కొనుగోలు చేశాడంటూ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి…రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరారని…స్పీకర్ ఫార్మాట్ లో ఇవ్వకుండా…చంద్రబాబుకు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ వెనుక చంద్రబాబు ఉన్నారని…ఇప్పటికీ తెలంగాణలో ఆయన సపోర్ట్ తోనే రేవంత్ పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికని దృష్టిలో పెట్టుకునే కోమటిరెడ్డి…చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడంలో…కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. అయితే 2018లో టీడీపీతో పొత్తు ఉండగానే…కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మరి అప్పుడే టీడీపీతో పొత్తు వద్దని, లేదా కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడలేదని ప్రశ్నించే వారు హస్తం పార్టీలో కరువయ్యారు. రాజగోపాల్ రెడ్డి విషయంలో…మెజార్టీ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వకుండా నిశబ్దం పాటిస్తున్నారు.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి…టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై విజయం సాధించాడు. టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి….అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోవడంతో…మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందాడు. ఈ పార్లమెంట్ స్థానంలో మెజార్టీ ఓటర్లు…సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలే ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి సులువుగా గెలుపొందారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో…మెజార్టీ నియోజకవర్గాల్లో సీమాంధ్రులే…అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేస్తారు. అందుకే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు…రేవంత్ రెడ్డిని అభిమానించే సీమాంధ్రులను దూరం చేయడం…ఆయనకు వ్యతిరేకంగా ఉన్న సీమాంధ్ర వర్గాలను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ నేతలు చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారు. 2018లో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే అమలు చేసి…లబ్ధి పొందాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారు.