తమలపాకుతో నువ్వొకటంటే తలుపుచెక్కతో నేనొకటంటా అనే సామెత అప్పుడప్పుడూ రాజకీయాలకు కూడా సెట్ అవుతుంది తెలంగాణ రాజకీయాలకు ఇప్పుడది బాగా నప్పుతుందనే చెప్పాలి. కేసీఆర్ వర్సెస్ ఈటల బండి సంజయ్ అనుకున్నా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అనుకున్నా ఇంకెవరితోనైనా పోటీ పెట్టుకున్నా ఆ సామెతను చెప్పుకోకతప్పదు. తాజాగా ఇద్దరు మహిళామణులు ఇప్పుడు సై అంటే సై అంటున్నారు. ఒకరికొకరు చేసుకునే ఆరోపణలను రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.
కల్వకుంట్ల కవిత, వైఎస్ షర్మిల ఇద్దరూ ఫైర్ బ్రాండ్లే. ఒకరు ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ. మరోకరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు. సహజంగానే వారి రక్తంలోనే వాగ్ధాటి ఉందని చెప్పక తప్పదు. వాళ్లు మామాలుగా మాట్లాడినా అది పవర్ ఫుల్ డైలాగ్ గా మారిపోతోంది. పైగా ఇద్దరూ రిధమిక్ డైలాగ్స్ వినిపించేందుకు కూడా వెనుకాడని రాజకీయ నాయికామణులుగా మారారు.
కవిత, షర్మిల ఇటీవలి కాలంలో ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అని అనరాని అనకూడని మాటలను కూడా వాడేస్తున్నారు. ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీగా కనిపించినా అది హద్దులు మీరుతోందన్న అనుమానమూ కలుగుతోంది. డైలాగులు ఎవరు రాసిచ్చినా ఎగ్జిక్యూషన్ మాత్రం అమోఘమనే చెప్పాలి. ఒకప్పుడు కేసీఆర్ అభ్యర్థన మేరకు జగనన్న వదిలిన బాణమే షర్మిల అన్న అనధికార టాక్ నడిచింది. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగానే వ్యవహారం కనిపిస్తోంది. వదులుతున్న డైలాగులు ఎన్నికలు దగ్గర పడుతున్న వాస్తవానికి దర్పణం పడుతున్నాయి.
దాదాపు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన వైఎస్సార్టీపీ నేత షర్మిలకు అనుకున్న మైలేజీ రాలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఆమె వేర్వేరు పార్టీల నేతలను టార్గెట్ చేస్తున్నారు. జనబాహుళ్యంలో తన పేరు మారిమోగిపోయేందుకు ఆరోపణల వ్యూహాన్ని ఎంచుకున్నారు. అందులో భాగంగానే కవితను ఆమె టార్గెట్ చేస్తే భారత జాగృతి నిర్వాహకురాలైన ఎమ్మెల్సీ కవిత అంత కంటే రెట్టింపు ఫోర్స్ తో సమాధానం చెబుతున్నారు. ఇద్దరూ ఎవరికి ఎవరూ తీసుపోరన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.
బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అందరినీ షర్మిల తిట్టిపోశారు. వారందరినీ కడిగి పారేశానని ఆమె అనుకుంటున్నారు. ఆ క్రమంలో సరైన స్పందన రాకపోవడంతో కవితపై ఆమె విసుర్లు మొదలుపెట్టారు. దానితో మాటల యుద్ధం మొదలైందనే చెప్పాలి. పాదయాత్రలు చేసింది లేదు ప్రజల సమస్యలు చూసింది లేదు. ఇచ్చిన హామీల అమలు లేదు పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు అని వైఎస్ షర్మిల ట్వీట్ తో అసలు యుద్ధం మొదలైంది. అప్పటి వరకు యథాలాపంగా జరిగిన ఆరోపణల పర్వం అప్పటి నుంచి పర్సనల్ అటాక్ గా మారిపోయింది. ఎవరి సత్తా ఎంత ఎవరికి ప్రజల్లో పరపతి ఉందని అనుచరులు రాజకీయ విశ్లేషకులు చర్చించుకునే దాకా కథ కొనసాగింది. ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఆమె కేసీఆర్ తనయ కదా అందుకే కవిత డైలాగులైనా సరే సమాధానాలైనా సరే పవర్ ఫుల్ గానే ఉంటాయి. ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి కవితను నేను అని ఆమె సమాధానం ఇవ్వగానే అభిమానుల ఆనందానికి అవధులు లేవు తాను పొలిటికల్ టూరిస్ట్‌ను కానని తెలంగాణ ఉద్యమ బిడ్డను అని ఆమె తేల్చిచెప్పారు షర్మిల బయట నుంచి దిగుమతి అయిన నాయకురాలని డైరెక్టుగానే క్షిపణి దాడి చేశారు. పైగా కొందరు బీజేపీ నేతలు షర్మిలను సపోర్టు చేస్తున్నట్లుగా మాట్లాడటంతో కవితకు చిర్రెత్తుకొచ్చింది. తాము వదిలిన బాణం తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు అంటూ భారీ డైలాగ్ వదలడంతో కమలనాథులకు కూడా చురుకు ముట్టినట్లయ్యింది. తెలంగాణవాదులు కూడా కవితకే సపోర్టు చేశారు. ఉద్యమంలో కనిపించిన షర్మిల ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం వస్తున్నారని ఆరోపణలు వినిపించారు.
ప్రస్తుత కవిత కొత్త రూటు వెదుక్కుంటున్నారు. లిక్కర్ స్కాం తన మెడకు చుట్టుకుంటున్న వేళ సింపధీ కోసం జాతీయ స్థాయిలో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో దశలో మహిళా బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ మార్చి 10న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయబోతున్నారు. దానితో కవితపై ఆరోపణలకు షర్మిల ఒక అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. మహిళ రిజర్వేషన్లు అని కొత్త పాట పాడటం వెనక ఉన్న కారణం ఏంటో అందరికీ తెలుసున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కొత్త వాదన ఎంచుకున్నారని ఫైరయ్యారు. రెండు సార్లు అధికారం చేపట్టి మహిళలకు 33 శాతం సీట్లు ఎందుకు కేటాయించలేదని షర్మిల అడిగారు.
2014 ఎన్నికల్లో మహిళలకు ఇచ్చింది 6 సీట్లు అంటే 5.88 శాతం అని గుర్తుచేశారు. 2018లో మహిళలకు 4 సీట్లు అంటే 3.36 శాతం కేటాయించారని శాసనమండలిలో 34 మంది సభ్యుల ఉంటే మహిళలకు ఇచ్చింది మూడు సీట్లేనని షర్మిల గుర్తు చేశారు. దీక్ష చేయాల్సిందీ ఢిల్లీలో కాదని, ప్రగతి భవన్ ముందేనని షర్మిల అంటున్నారు. షర్మిల వ్యాఖ్యలతో ఇద్దరు ఫైర్ బ్రాండ్ లేడీస్ మధ్య మళ్లీ మాటలమంటలు ఖాయమని తేలిపోయింది. ఇద్దరిలో ఒక్కరూ చూసిచూడనట్లుగా ఊరుకునే వాళ్లు కూడా కాదని అందరికీ తెలుసు. అంతకు మించి ఇద్దరిలోనూ రాజకీయ కసి ఉంది. లిక్కర్ స్కాంలో తనను ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆగ్రహం కవితలో కనిపిస్తోంది. ఏడాదిపైగా ఎంత తిరుగుతున్నా జనం పట్టించుకోవడం లేదన్న ఆందోళన షర్మిలలో ఉంది. అదే వారిచేత మాట్లాడిస్తోంది