రేణుకా చౌదరి కొత్త సవాల్

By KTV Telugu On 4 March, 2023
image

జనం తమని మర్చిపోయారని అనుకున్నప్పుడు రాజకీయ నాయకులు ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లోకి రావాలనుకుంటారు. అది ఏదైనా సరే. ఆచరణ సాధ్యం కాకపోయినా ఫర్వాలేదు. జనం దృష్టిని ఆకర్షిస్తే అదే చాలు అనుకుంటారు. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ప్రస్తుతం ఆ పనిలోనే బిజీగా ఉన్నారని రాజకీయ పండితులు అంటున్నారు. ఫలానా నియోజకవర్గం నుంచి కచ్చితంగా గెలవగలనని ఒక్క నియోజకవర్గాన్ని కూడా చూపించలేని రేణుకా చౌదరి ఇపుడు నాలుగైదు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని సవాళ్లు విసురుతూ కామెడీ పంచుతున్నారు. కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు తనను మాట మాత్రంగానైనా తలచుకోకపోవడం చూసి మాజీ మంత్రి రేణుకా చౌదరి బాగా నొచ్చుకున్నారు.

జనంలో ఉండాలంటే ఎన్నికల్లో గెలిచి తీరాల్సిన అవసరమే లేదన్నది ఆమె ఫిలాసఫీ. జనం దృష్టిని ఆకర్షించేలా ఏదో ఒక సంచలన వ్యాఖ్య చేస్తే కావల్సినంత పబ్లిసిటీ వచ్చేస్తుందని ఆమె నమ్ముతున్నట్లున్నారు. తాజాగా రేణుకా చౌదరి ఏపీలో హడావిడి చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే తాను వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని రేణుకా చౌదరి అన్నారు. ఏపీలో వార్డు మెంబర్ ను కూడా గెలిపించుకునే స్థితిలో లేని కాంగ్రెస్ పార్టీ రేణుకా చౌదరిని లోక్ సభ స్థానం నుండి బరిలో దింపితే ఒరిగేదేంటని రాజకీయ పండితులు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుని వీధిలోకి వస్తే ఇప్పటికీ ఏపీ ప్రజలు చీదరించుకునే పరిస్థితే ఉంది. అటువంటిది విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేస్తానని రేణుక సవాల్ విసరడం ఏంటో అర్ధం కావడం లేదంటున్నారు రాజకీయ పండితులు. సరే తాను ఎక్కడి నుండి పోటీ చేయాలి అన్నది నిర్ణయించుకునే అధికారం రేణుకా చౌదరికి ఉంటుంది. అక్కడ గెలుస్తారా లేదా అన్నది ప్రజలు చెప్పాలి.

దాన్ని పక్కన పెడితే విజయవాడ నుండి పోటీ చేస్తానన్న రేణుక అదే మీడియా సమావేశంలో ఏపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. బంగారం లాంటి ఏపీని దివాళా తీయించేశారంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు రేణుకా చౌదరి. కొద్ది రోజుల క్రితం ఇదే రేణుకా చౌదరి తెలంగాణాలో మరో ప్రకటన చేశారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుండే ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని రేణుకా చౌదరి ప్రకటించారు. ఆ వెంటనే అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2024 సాధారణ ఎన్నికల్లో ఖమ్మం నుండే లోక్ సభ ఎన్నికల బరిలో దిగుతానని కూడా అన్నారు. ఇంతకీ అసెంబ్లీలో ఉంటారా లేక పార్లమెంటులో ఎంట్రీ ఇస్తారా అని ఆమె అనుచరులే అయోమయానికి గురయ్యారు.

ఆమె అక్కడితో కూడా ఆగలేదు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ప్రకటించి మరింత గందరగోళం సృష్టించారు. దీంతో ఆమెకు ఓటు వేయాలా అక్కర్లేదా అని తెలంగాణా ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆమెకు ఓటు వేసి వేస్టు చేసుకోవడం అవసరమా అని వారు గుసగుస లాడుకుంటున్నారు. ఎక్కడి నుండి పోటీ చేయాలో ఆమెకే క్లారిటీ లేకపోతే ఎలాగ అని రాజకీయ పరిశీలకులు కూడా వ్యాఖ్యానాలు చేశారు. ఇపుడు మరో అడుగు ముందుకు వేసి విజయవాడ ఎంపీ స్థానం నుండి పోటీ అంటున్నారు.
అసలు ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కడి నుండి అయినా ఆమె కచ్చితంగా గెలవగలరని చెప్పే పరిస్థితి ఉందా అని రాజకీయ పరిశీలకులు సెటైర్లు వేస్తున్నారు. ఎప్పుడో ఎనభైలు తొంభైలలో చేసిన రాజకీయాలతోనే ఇప్పుడూ నెట్టుకొచ్చేయచ్చని రేణుకా చౌదరి భావిస్తున్నట్లు ఉందని రాజకీయ పండితులు అంటున్నారు. ఆ రాజకీయాలకు కాలం చెల్లిందని వారంటున్నారు. ఖమ్మంలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ సీటు ఇచ్చినా ఆమె గెలుస్తారని గ్యారంటీగా చెప్పలేం అంటున్నారు స్థానిక కాంగ్రెస్ నేతలు.

అయితే ఆమె మాత్రం తాను ఎక్కడి నుండి పోటీ చేసినా గెలిచేస్తానని అనుకుంటున్నారు. అది కేవలం భ్రాంతి మాత్రమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి అడ్రస్సే గల్లంతైంది. 2014 ఎన్నికల నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏపీలో కోలుకోనే లేదు. అటువంటిది అక్కడ పోటీ చేస్తానని రేణుక సవాల్ విసరడం ఏంటో అర్ధం కావడం లేదంటున్నారు వారు. రేణుక హడావిడి చూస్తోంటే బహుశా ఆమె చంద్రబాబు నాయుడి తరపున వకాల్తా పుచ్చుకుని విజయవాడ నుండి పోటీ చేస్తానని అని ఉండవచ్చంటున్నారు. అందుకే జగన్ మోహన్ రెడ్డిపైనా విమర్శలు గుప్పించి ఉంటారని వారు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడి అయిదేళ్ల పాలనలో ఏనాడూ ఏపీ గురించి వ్యాఖ్య కూడా చేయని రేణుకా చౌదరి ఇపుడు హఠాత్తుగా అక్కడి ప్రభుత్వంపై విమర్శలు చేయడం వెనక చంద్రబాబు అవసరాలు ఉండి ఉంటాయంటున్నారు.

ఎన్టీయార్ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన కొత్తలో నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచినపుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాఉద్యమం వచ్చింది. అందులో రేణుకా చౌదరి చురుగ్గా పాల్గొన్నారు. అప్పుడే ఎన్టీయార్ దృష్టిలో పడ్డారు. దాంతో ఎన్టీయార్ రేణుకను పిలిచి రాజ్యసభకు పంపారు. ఎన్టీయార్ అంతగా ప్రోత్సహిస్తే ఎన్టీయార్ కు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచినపుడు మాత్రం రేణుకా చౌదరి మౌనంగా ఉండిపోయారు. చంద్రబాబు నాయుడికే మద్దతు ఇచ్చి ఎన్టీయార్ కు టోకరా ఇచ్చారు. దానికి ప్రతిఫలంగా కేంద్రంలో మంత్రి పదవిని పొందారు. 1998వరకు టిడిపిలోనే ఉన్న రేణుకా చౌదరి ఆ తర్వాత టిడిపికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. అక్కడా కేంద్ర మంత్రి పదవి పొందారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆమె ఏ సభకీ ఎన్నిక కాలేదు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో లేకపోవడంతో రేణుకా చౌదరి తెరమరుగైపోయారు. ఆమె గురించి పట్టించుకునేవాళ్లు కూడా లేకపోయారు. అలాగే మౌనంగా ఉంటే తనను పూర్తిగా మర్చిపోతారేమోనన్న భయంతోనే రేణుకా చౌదరి ఇపుడు నాలుగైదు నియోజకవర్గాల పేర్లు చెబుతూ ఉండచ్చని కర్ణపిశాచులు చెవులు కొరుక్కుంటున్నాయి.

ఏపీలో టిడిపి పూర్తిగా డీలా పడిపోయి బలహీనంగా ఉండడంతో చంద్రబాబు నాయుడే రేణుకా చౌదరిని పిలిపించి విజయవాడ నుండి పోటీ చేస్తానని ఒకసారి గుడివాడ నుండి పోటీ చేస్తానని మరోసారి అనిపించి ఉండచ్చంటున్నారు. గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పై చంద్రబాబుకు పీకలదాకా కోపం ఉంది. నానిని ఎలాగైనా సరే ఓడించాలని చంద్రబాబు 2014 నుండి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా లాభం లేకపోయింది. వచ్చే ఎన్నికల్లో అయినా నానిని ఓడించాలంటే రేణుకా చౌదరిని బరిలో దింపితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన బాబుకు ఉండచ్చంటున్నారు టిడిపి వర్గీయులు. టిడిపిలో ఉన్నప్పుడు రేణుకా చౌదరి చంద్రబాబుతో సన్నిహితంగానే ఉండేవారు. టిడిపిలో ఉన్నప్పుడు ఆమెకు ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు కూడా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు రేణుకను రంగంలోకి దింపాలని భావిస్తూ ఉండచ్చంటున్నారు నిపుణులు. అయితే ఇప్పటి రాజకీయాల తీరే వేరంటున్నారు పరిశీలకులు 30 ఏళ్ల క్రితం పన్నిన వ్యూహాలు ఎత్తుగడలు ఇపుడు పనిచేయవని వాటికి ఎక్స్ పైరీ డేట్ కూడా అయిపోయి ఉంటుందని రాజకీయ పండితులు అంటున్నారు.