నందమూరి కుటుంబం ఇప్పటికీ జూనియర్ ఎన్టీయార్ ను దూరంగానే ఉంచుతోందా ఎన్నికల అవసరం వచ్చినపుడు జూనియర్ చేత ప్రచారం చేయించుకున్న టిడిపి వ్యవస్థాపకుని కుటుంబం అవసరం తీరాక జూనియర్ ను పక్కన పెట్టేసింది. ఇప్పటికీ జూనియర్ ను పరాయి వ్యక్తిగానే చూస్తోన్నట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి తనయుడు నందమూరి బాలకృష్ణ అల్లుడు అయిన నారా లోకేష్ పాదయాత్ర రోజున సంఘీభావంగా యాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే తారకరత్నను బెంగళూరు లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న తుదిశ్వాస విడిచి నందమూరి కుటుంబానికీ అభిమానులకూ విషాదం మిగిల్చారు. తారకరత్న ఆసుపత్రిలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులంతా వెళ్లి పరామర్శించి వచ్చారు. ఆ క్రమంలో హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీయార్ లు కూడా తమ సోదరుని చూసి కంటతడి పెట్టుకుని వచ్చారు. ఆ తర్వాత తారకరత్న మరణంతో వారు కోలుకోలేకపోయారు.
తారకరత్న పెద్ద కర్మ గురువారం రోజున హైదరాబాద్ లో జరిగింది. దీనికి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు బంధు మిత్రులు అభిమానులు టిడిపి నేతలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన నందమూరి కుటుంబ సభ్యులందరినీ నందమూరి బాలకృష్ణ పలకరించారు. ఒక్కొక్కరినీ ఆయన పలకరిస్తూ ముందుకు సాగుతోన్న క్రమంలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీయార్ లు బాబాయ్ ని చూసి లేచి నిలబడ్డారు. అయితే మిగతా అందరినీ పలకరించిన బాలయ్య జూనియర్ ఎన్టీయార్ కేసి మాత్రం చూడకుండా మొహం తిప్పేసుకున్నారు. దీంతో జూనియర్ ఎన్టీయార్ ను ఇంకా బయటి వ్యక్తిగానే చూస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. నందమూరి తారకరామారావు పెద్ద కుమారుడు నందమూరి హరికృష్ణ కు రెండో భార్య కుమారుడు జూనియర్ ఎన్టీయార్. మొదటి భార్య కుమారుడు కళ్యాణ్ రామ్. అయితే జూనియర్ ఎన్టీయార్ ను మొదట్నుంచీ కూడా నందమూరి కుటుంబం దూరంగానే ఉంచింది తప్ప ఆయన్ను ఓన్ చేసుకునే ప్రయత్నం చేయలేదు.
నందమూరి కుటుంబం అండ కానీ మద్దతు కానీ లేకుండానే జూనియర్ ఎన్టీయార్ స్వయంకృషితో సినీ రంగంలో అడుగు పెట్టారు. తన ప్రతిభతో వెండితెరపై క్లిక్ అయ్యారు. ఆయనకు కొడాలి నాని వల్లభనేని వంశీ వంటి ఎన్టీయార్ వీరాభిమానులే అండగా ఉండేవారు. ఆది సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో జూనియర్ ఎన్టీయార్ పేరు సినీ రంగంలో మార్మోగిపోయింది. సాధారణంగా ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు బాలయ్య. ఆ జోనర్ లో వచ్చిన ఆది సినిమా బాలయ్య సినిమాలు నరసింహనాయుడు సమరసింహారెడ్డి స్థాయిలో పెద్ద హిట్ కావడంతో జూనియర్ కు రాత్రికి రాత్రే స్టార్ డమ్ వచ్చింది. అయినా కూడా నందమూరి కుటుంబం జూనియర్ ను చేరదీయలేదు. అయితే హరికృష్ణతో పాటు ఆయన మొదటి భార్య కుమారుడు కళ్యాణ్ రామ్ మాత్రం జూనియర్ ఎన్టీయార్ ను బంధువుగా ఆమోదించి సన్నిహితంగా ఉంటూ వచ్చారు. జూనియర్ ఎన్టీయార్ తో కళ్యాణ్ రామ్ సినిమా కూడా తీశారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు తెలుగుదేశం పార్టీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ ఎన్నికల్లో టిడిపి ఓటమి ఖాయమని భయపడ్డ చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం కోసం జూనియర్ ఎన్టీయార్ ను చేరదీశారు.
జూనియర్ ఎన్టీయార్ కు తన బంధువైన నార్నే శ్రీనివాసరావు కుమార్తెకి ఇచ్చి పెళ్లి జరిపించడంలోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. చివరకు ఎన్నికల ప్రచారానికి మేనల్లుణ్ని పిలిచారు. మామయ్య అంతలా అడిగే సరికి జూనియర్ ఎన్టీయార్ కాలికి చక్రాలు కట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. అహోరాత్రులూ శ్రమించి చెమటోడ్చి తిరిగారు. చివరకు ఎన్నికల ప్రచారం చేస్తూ తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు కూడా. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే బెడ్ పై పడుక్కుని కూడా తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీయార్. అపుడు జూనియర్ ఎన్టీయార్ ను నందమూరి కుటుంబం కూడా తమ వాడేనని తాత్కాలికంగా ఆమోదించినట్లుంది. బాలయ్య కూడా జూనియర్ ప్రచారానికి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. 2009 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాలేదు. ఆ తర్వాత జరిగిన మహానాడులో తన కుమారుడు లోకేష్ ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించాలని నిర్ణయించిన చంద్రబాబు నాయుడు పార్టీలో జూనియర్ ఎన్టీయార్ ఉంటే తన కుమారుడు తేలిపోతాడని భయపడ్డారు.
అందుకే ఎన్నికల ప్రచారంలో బాగా వాడేసుకున్న జూనియర్ ను మహానాడుకు పిలవలేదు చంద్రబాబు. ఇక అప్పట్నుంచీ నెమ్మదిగా జూనియర్ ను దూరం పెట్టేశారు. జూనియర్ ఎన్టీయార్ తండ్రి హరికృష్ణను కూడా పక్కన పెట్టేసి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేశారు చంద్రబాబు. ఈ పరిణామాలతో జూనియర్ ఎన్టీయార్ కూడా రాజకీయాలకు టిడిపికి నందమూరి కుటుంబానికీ దూరంగానే ఉంటూ వచ్చారు. 2014 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీయార్ ను మళ్లీ ప్రచారానికి వాడుకోవాలని చూశారు చంద్రబాబు. అయితే జూనియర్ ఎన్టీయార్ రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో జూనియర్ పై కోపం పెంచుకున్నారు చంద్రబాబు. ఆ క్రమంలోనే జూనియర్ నటించిన దమ్ము సినిమా విడుదలైతే దాన్ని బాయ్ కాట్ చేయాల్సిందిగా తమ సామాజిక వర్గానికి ఫత్వా జారీ చేయించారు కూడా చంద్రబాబు. అయితే జూనియర్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన సినిమాలేవో తాను చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ పాదయాత్రలో కొందరు జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తారా అని లోకేష్ ని అడగ్గా నూరు శాతం స్వాగతిస్తానని లోకేష్ చెప్పుకొచ్చారు. అయితే దీనిపై జూనియర్ ను అభిమానించే హరికృష్ణ అనుచరులు కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా లోకేష్ పై మండి పడ్డారు. 2009లోనే జూనియర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి టిడిపి తరపున ప్రచారం చేసిన సంగతి లోకేష్ కు తెలియదేమో అని సెటైర్లు వేశారు. జూనియర్ ఇపుడు కొత్తగా రాజకీయాల్లోకి రావల్సిన అవసరం లేదనన కొడాలి నాని తన తాతగారి పార్టీని జూనియర్ ఎన్టీయార్ కు అప్పగించేయాల్సిందిగా చంద్రబాబుకు సలహా ఇచ్చారు కూడా. 2024 ఎన్నికలు టిడిపికి అత్యంత కీలకమైనవి. ఆ ఎన్నికల్లో ఓడిపోతే పార్టీ తెరమరుగు అయిపోతుందని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
2019లో ఓటమి చెందిన తర్వాత టిడిపి తిరిగి కోలు కోలేదు సరికదా మరింతగా బలహీన పడింది. వరుస ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాలే దానికి నిదర్శనం. అందుకే వచ్చే ఎన్నికల్లో మళ్లీ జూనియర్ ను ప్రచారానికి ఒప్పించాలని చంద్రబాబు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నందమూరి బాలయ్య వ్యవహరించిన తీరు చూస్తోంటే వచ్చే ఎన్నికల్లో టిడిపి తరపున ప్రచారానికి కూడా జూనియర్ ఒప్పుకుని ఉండకపోవచ్చునని రాజకీయ పండితులు అంటున్నారు. ఆ ఉక్రోషంతోనే బాలయ్య జూనియర్ వైపు చూడకుండా తల తిప్పేసుకుని ఉంటారని వారు విశ్లేషిస్తున్నారు. అయితే జూనియర్ వీటికి స్పందించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆయన నటించిన ట్రిపుల్ ఆర్ మూవీ ఆస్కార్ అవార్డ్ రేసులో ఉందిపుడు. అంతర్జాతీయ స్థాయిలో రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీయార్ పేరు మార్మోగిపోతోంది. ఆ జోష్ లో ఉన్న జూనియర్ ఎన్టీయార్ కు కుళ్లిపోయిన రాజకీయాల గురించి ఆలోచించే తీరిక కానీ ఓపిక కానీ ఉండవంటున్నారు విశ్లేషకులు. బాలయ్య వేషాలన్నీ ఇలాగే విచిత్రంగానే ఉంటాయని కూడా వారంటున్నారు.