గవర్నర్ తెలంగాణ సర్కార్ మధ్య అసలు సమస్య “ఈగో”

By KTV Telugu On 4 March, 2023
image

తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఏర్పడిన ఏర్పడిన వివాదం బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన పరిణామాలతో ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అనూహ్యంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో గవర్నర్, ప్రభుత్వం మధ్య సానుకూల వాతావరణం ఏర్పడలేదని స్పష్టయింది. ఇప్పుడు ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతో వివాదం మరింత ముదిరినట్లయింది. ఢిల్లీకి వెళ్లే బదులు రాజ్ భవన్‌కు రావాల్సిందని గవర్నర్ తమిళిసై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. సీఎస్ అసలు గౌరవించడం లేదని ఆమె అంటున్నారు. అడిగినా బిల్లులు ఆమోదించడం లేదని బీఆర్ఎస్ నేతలంటున్నారు. అంటే అసలు సమస్య “ఈగో”నే అన్న మాట.

సాధారణంగా బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్లు యాక్టివ్ గా ఉంటారు. అయితే వారి తీరు కేంద్రం సూచనలకు తగ్గట్లుగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్నట్లుగా ఉంటుంది. కానీ తెలంగాణలో మాత్రం కేంద్రం బిల్లుల్ని ఆపేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే సూచనలు తమిళిసైకి ఇచ్చి ఉంటారని ఎవరూ అనుకోవడం లేదు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలకు ఇక్కడ జరుగుతున్న పరిణామాలకు చాలా తేడా ఉంది. బడ్జెట్ సమావేశాల దగ్గర సఖ్యత కుదిరినా తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కు కల్పించాల్సిన ప్రోటోకాల్ కల్పించకపోవడంతోనే గవర్నర్ గుర్రుగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. చీఫ్ సెక్రటరీ తనను మర్యాదపూర్వకంగా కూడా కలవడం లేదని ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదని భావిస్తున్నారు. మామూలుగా కొత్త సీఎస్ వస్తే గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలుస్తారు. కానీ సీఎస్ శాంతి కుమారి కలవలేదు. రిపబ్లిక్ డే వేడుకల్లో హైకోర్టు ఆదేశాల మేరకు పాల్గొన్నారు కానీ ప్రత్యేకంగా సమావేశం కాలేదు. తనకు గౌరవం ఇవ్వలేదన్న కారణంతోనే బిల్లులు పెండింగ్‌లో పెట్టినట్లుగా భావిస్తున్నారు.

అదే సమయంలో గవర్నర్ కు ఇప్పటి వరకూ ఇచ్చిన గౌరవం చాలా ఎక్కువ అన్న పద్దతిలో ప్రభుత్వం ఉంది. అందుకే రాజ్ భవన్‌కు సంబంధించి బిల్లల ఆమోదం ప్రక్రియపై ఫాలో అప్ చేయకుండానే గవర్నర్‌పై నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఢిల్లీ కన్నా రాజ్ భవన్ దగ్గర అని తమిళిసై ఈ విషయం తెలిసి వ్యాఖ్యానించారు. అంటే కేవలం ఆమె బిల్లులు ఆమోదించాలని సీఎస్ వచ్చి అడిగి ఉంటే చాలని అనుకున్నట్లుగా కనిపిస్తోంది. కానీ సీఎస్ మాత్రం ప్రభుత్వ పెద్దల అనుమతి లేకుండా గవర్నర్ తో మర్యాదపూర్వక భేటీకి కూడా సిద్ధంగా లేరు. తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ మధ్య ఏర్పడిన వివాదం బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన పరిణామాలతో ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అనూహ్యంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో గవర్నర్ ప్రభుత్వం మధ్య సానుకూల వాతావరణం ఏర్పడలేదని స్పష్టయింది. ఇప్పుడు ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతో వివాదం మరింత ముదిరినట్లయింది. దీంతో అసలు సమస్య ఏమిటన్నది రాజకీయం కాదని ఈగో అన్నఅభిప్రాయం బలపడుతోంది.

అదే సమయంలో ఇలా వ్యవహరిచడం వెనుక బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం కూడా ఉందని చెబుతున్నారు. గవర్నర్ ద్వారా కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటోందన్న విషయాన్ని జాతీయంగా ప్రచారం చేయాలనుకుంటున్నారని అందుకే సుప్రీంకోర్టుకు వెళ్లారని అంటున్నారు. ప్రస్తుతం పంజాబ్ గవర్నర్ వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. రాష్ట్ర క్యాబినెట్‌ సిఫార్సు చేసిన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను న్యాయసలహా మేరకే నిర్వహిస్తానని గవర్నర్ మంకుపట్టు పట్టారు. దీనిపై పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గవర్నర్‌ రాజ్యాంగం ప్రకారం పనిచేయాలని స్పష్టం చేసింది. క్యాబినెట్‌ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని సిఫారసు చేసినప్పుడు గవర్నర్‌ దానికి కట్టుబడి ఉండాలని క్యాబినెట్‌ సలహాలను స్పష్టంగా పాటించాలని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం చురుకుగా ఆలోచించి వెంటనే తెలంగాణ గవర్నర్ వ్యవహారశైలి కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పిటిషన్ వేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ విచారణకు వస్తే పంజాబ్ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా గవర్నర్ ద్వారా కేంద్రం వేధిస్తుందన్న అభిప్రాయం ప్రచారం అవుతుంది.

మొత్తంగా గవర్నర్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను అటు తిరస్కరించడమో ఇటు ఆమోదించకుండా చేయడమో పెట్టడం ద్వారా ప్రజా ప్రయోజనాలను అడ్డుకున్నట్లవుతుంది. కానీ గవర్నర్ మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. సీఎస్ వచ్చి అడగలేదు మంత్రులు వచ్చి వివరణ ఇవ్వలేదని కాలయాపన చేస్తున్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్లో రాజ్యాంగ వ్యతిరేకతమైనవి ఏమైనా ఉంటే వెనక్కి పంపేయాలి లేకపోతే ఆమోదించాలి. అలా చేయకపోవడం వల్ల రాజకీయంగానూ దుమారం రేగుతోంది.