ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ పూర్తిగా చితికిపోయింది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యులు బతికే పరిస్థితి కనిపించడం లేదు. అత్యవసర మందులు అందుబాటులో లేవు. పాకిస్తాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోతోంది. ప్రస్తుతం డాలర్ తో పాక్ రూపాయి మారకం విలువ రూ.280కి పైన ట్రేడవుతోంది. విదేశీ మారక ద్రవ్య నిలువలు అడుగంటి పోతున్నాయి. ద్రవ్యోల్బణం 50 సంవత్సరాల గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం అక్కడ లీటర్ డీజిల్ ధర రూ. 280కి చేరింది. అలాగే లీటర్ పెట్రోల్ ధర రూ. 267 గా ఉంది. అక్కడి కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను 300 బేసిస్ పాయింట్లు పెంచింది. దాంతో రుణ వడ్డీ రేటు 20 శాతానికి పెరిగింది. ఈ సంక్షోభం నుంచి బయట పడడానికి పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధిని ఆశ్రయించింది. అయితే తాము విధించిన షరతులకు అంగీరిస్తేనే అప్పు ఇస్తామని ఐఎంఎఫ్ ఖరాకండిగా చెప్పడంతో ఇటీవల ఆ షరతులకు పాక్ ప్రభుత్వం తలొగ్గింది. ప్రాణాధార ఔషధాల కొరత కారణంగా ఆసుపత్రుల్లోని రోగులు అవస్థలు పడుతున్నారు. ఇక బంగారం ధర అయితే ఎవరికీ అందుబాటులో లేకుండా పోయింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 2.06 లక్షల పాకిస్తానీ రూపాయాలకు చేరింది.
ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి గమనిస్తే ఆ దేశం మరో శ్రీలంకలాగా మారడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు అనంటున్నారు విశ్లేషకులు.