ఏపీ కూడా అనుకోలేదు ఈ ప్రయత్నం ఇంత సఫలమవుతుందని. విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విమర్శకుల నోళ్లు మూయించింది. పెట్టుబడులు రాబట్టటేకపోతే రాళ్లు వేద్దామనుకున్న ప్రతిపక్షాల నోటికి పనిలేకుండా పోయింది. గ్లోబల్ సమ్మిట్ అనుకున్నదానికంటే సక్సెస్ కావటంతో ప్రభుత్వం ఫుల్ హ్యాపీ. దేశంలో పేరున్న పారిశ్రామికవేత్తలు రావటం ఏపీలో పరిశ్రమలకు ఉత్సాహం చూపటంతో ఓ యజ్ఞంలా ఏపీ ప్రభుత్వం పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుతో 15విభాగాల్లో సెషన్స్ నిర్వహించింది ప్రభుత్వం. ఏపీ అభివృద్ధికి కీలకమైన 15 రంగాల్లోనూ ఫలప్రదమైన చర్చలు జరిగాయి. రెండు రోజుల్లో 352 ఎంవోయూలు జరిగాయి. వందమందికి పైగా వక్తలు పాల్గొనటంతో సదస్సు అందరి దృష్టినీ ఆకర్షించింది. జీఐఎస్ ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ.13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. వీటితో దాదాపు 6 లక్షలమందికి ఉపాధి అవకాశాలు దక్కినట్లే.
మొత్తం పెట్టుబడుల్లో ఎనర్జీ రంగంలోనే 8 లక్షల 84 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం విశేషం. పర్యాటక రంగంలోనూ 22 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. రూ. 2.35 లక్షల కోట్ల ఎంవోయూతో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఎన్టీపీసీ టాప్‌లో ఉంది. ఏబీసీ లిమిటెట్ (రూ.1.20 లక్షల కోట్లు), రెన్యూ పవర్ (రూ.97,550 కోట్లు), ఇండోసాల్ (రూ.76,033 కోట్లు), ఏసీఎమ్‌ఈ (రూ.68,976 కోట్లు), టీఈపీఎస్‌ఓఎల్ (రూ. 65,000 కోట్లు), జేఎస్‌డబ్యూ (రూ.50,632 కోట్లు), హంచ్ వెంచర్స్(రూ.50 వేల కోట్లు), అవాదా గ్రూప్( రూ.50 వేల కోట్లు) రిలయన్స్ (రూ.50వేల కోట్లు) ఏపీ ప్రభుత్వంతో ఎంవోయులు చేసుకున్నాయి. ఏపీలో గ్రీన్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. త్వరితగతిన పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని కోరారు. పారిశ్రామికవేత్తలకు ఏపీ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. వైసీపీ మంత్రులు నేతలు చెబుతున్నట్లు ఏపీకి అసలు సిసలు బ్రాండ్ అంబాసిడర్ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డే. ఈ క్రెడిట్ ఆయన ఖాతాలో వేయాల్సిందే.