ఒక్క చోటా గెలిపించలేకపోయిన జోడో యాత్ర

By KTV Telugu On 5 March, 2023
image

కశ్మీరు నుండి కన్యాకుమారి దాకా ఎక్కడైనా సరే తమని గెలిపించే వీరులే లేరని కాంగ్రెస్ పార్టీ మరో సారి చాటి చెప్పుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత దారుణ పరాజయాలను మూటగట్టుకుని కాంగ్రెస్ పార్టీ డీలా పడిపోయింది. ఎక్కడా గట్టి పోటీ ఇవ్వలేక చతికిల పడింది. ఎందుకిలా ఓడారో కూడా చెప్పలేని పరిస్థితి. నాగాలాండ్ లో ఖాతా తెరవలేదు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పెద్ద హిట్టే అయ్యింది కానీ దాని వల్ల ఒక్క రాష్ట్రంలోనూ విజయం వచ్చి వరించలేదు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌కు ఓట్లు తెచ్చిపెట్టలేకపోయింది. ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సోదిలో లేకుండా పోయింది హస్తం పార్టీ. 12 రాష్ట్రాల్లో 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ ఈశాన్యం వైపు కన్నెత్తి చూడలేదు. త్రిపుర నాగాలాండ్‌లో ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లలేదు. ఒక్కసారి మేఘాలయ వెళ్లొచ్చారు. ఈ ఎఫెక్ట్‌ ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. రాహుల్ ఖాతాలో మరో చెత్త ఓటమి రికార్డ్‌ చేరింది. పార్టీ కొత్త అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జాతకం ఏమాత్రం మారలేదని గ్రహాలన్నీ పార్టీపై కక్షగట్టేసినట్లు వ్యవహరించాయని ఎన్నికల ఫలితాలు చాటి చెప్పాయి.

త్రిపురలో లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీచేసిన కాంగ్రెస్‌ మూడంటే మూడు సీట్లు గెలిచింది. 17చోట్ల పోటీచేస్తే మూడు స్థానాలు వచ్చాయి. ఇక మేఘాలయలో ఐదు సీట్లతో సరిపెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముకుల్ సంగ్మా సారథ్యంలో 21 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ఐదేళ్లు తిరిగే సరికి అడ్రస్‌ లేకుండా పోయింది. ముకుల్‌ సంగ్మా తృణమూల్‌లో చేరిపోవడం మిగిలిన ఎమ్మెల్యేలు తలోదారి చూసుకోవడంతో మేఘాలయ కాంగ్రెస్‌కు దశదిశ కరువైంది. ఎన్నికల్లో పోటీచేసేందుకు అభ్యర్థులే దొరకని పరిస్థితి. ఇక నాగాలాండ్‌లో అయితే కాంగ్రెస్‌ ఖతం అయిపోయింది. 3.54 శాతం ఓట్లు రాబట్టినా ఒక్క సీటూ గెలవలేకపోయింది. ఈశాన్యంలో ఘోర పరాజయం మూటగట్టుకున్న కాంగ్రెస్‌కు ఉపఎన్నికలు కాస్త ఊరట నిచ్చాయి. దేశవ్యాప్తంగా 5 శాసనసభ స్థానాలకు ఉపఎన్నిక జరగ్గా కూటమి పార్టీల అండతో మూడు గెలుచుకుంది హస్తం పార్టీ. తమిళనాడులోని ఈరోడ్ ఈస్ట్‌ మహారాష్ట్రలోని కస్బా పేత్‌ స్థానాలు కాంగ్రెస్‌కు దక్కాయి. అలాగే బెంగాల్‌లోని సగర్డిగి స్థానంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. జార్ఖండ్‌లోని రామగఢ్‌లో కాంగ్రెస్ ఓటమిపాలైంది.