గ్లోబల్‌ సమ్మిట్‌ సాక్షిగా వైజాగ్‌ క్యాపిటల్‌పై క్లారిటీ

By KTV Telugu On 5 March, 2023
image

కడుపులో పెట్టుకోలేక మంత్రి బుగ్గన కాస్త ముందే చెప్పేశారుగానీ విశాఖనే వన్‌ అండ్‌ ఓన్లీ క్యాపిటల్‌. దిగ్గజ పారిశ్రామిక వేత్తల సమక్షంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ సాక్షిగా అదే విషయాన్ని కుండబద్దలు కొట్టేశారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ విశాఖపట్టణమేనని ఆ నగరంలో నిర్వహించిన సమ్మిట్‌లో అందరికీ క్లారిటీ ఇచ్చేశారు. జనవరి 31న కూడా సీఎం జగన్‌ ఇదే మాట చెప్పారు. విశాఖ రాజధానిపై ఢిల్లీలో జరిగిన సమ్మిట్‌ సన్నాహక సమావేశంలోనూ ప్రకటించారు. త్వరలోనే వైజాగ్‌కి షిఫ్ట్‌ అవుతానని చెప్పారు. వైజాగ్‌ షిఫ్టింగ్‌ సీఎం ప్రకటన చేసిన వెంటనే అధికారులు కూడా అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలపై ఫోకస్‌ పెట్టారు. కాపులుప్పాడ ఐటీ పార్కులో భవనాలు కూడా సిద్దం చేస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. కొత్త విద్యాసంవత్సరం నాటికి విశాఖ పరిపాలనా రాజధానిగా కార్యకలాపాలు మొదలవుతాయని మంత్రులు బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్‌నాథ్‌ ప్రకటించారు. ఇప్పుడు గ్లోబల్‌ సమ్మిట్‌లోనూ ఏపీ రాజధానిపై అతిథులు పారిశ్రామికవేత్తలకు క్లారిటీ ఇచ్చేశారు సీఎం.

మూడు రాజధానుల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అమరావతి కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మార్చి 28న ఇది విచారణకు రావాల్సి ఉంది. అయితే ముందుగానే విచారణకు స్వీకరించాలని కోరుతూ మరోసారి ఏపీ ప్రభుత్వం కోర్టు తలుపులు తట్టింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంలో స్టే వస్తే కొత్త చట్టం ద్వారా మూడు రాజధానులపై వేగంగా అడుగులు వేయొచ్చనుకుంటోంది ఏపీ ప్రభుత్వం.
గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కి హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా విశాఖ రాజధానికి మద్దతిచ్చేలా మాట్లాడటం ఆసక్తిరేపుతోంది. ఏపీ బీజేపీ నేతలు అమరావతే రాజధాని అంటూ రాగం తీస్తున్నారు. ఇదే సమయంలో సమ్మిట్‌కు వచ్చిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి విశాఖ రాజధాని అంటూ వ్యాఖ్యానించారు. విశాఖలో బీజేపీ ఎమ్మెల్సీగా మాధవ్‌ను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందంటూ పార్టీకోసం కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలు చేసినా రాజధానిగా విశాఖను ధృవీకరించేలా మాట్లాడటం ఆసక్తికర పరిణామం.