టీడీపీ, బీజేపీ మళ్ళీ దగ్గరవుతున్నాయ్ 2019 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిన్న తర్వాత…ఈ రెండు పార్టీలకు…వాస్తవం తెలిసోచ్చింది. టీడీపీ, బీజేపీ…కలిసి ఉంటేనే కలదు సుఖం అనే నిర్ణయానికి వచ్చాయ్. ఢిల్లీలో మోడీతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడటంతో…ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా పోటీ చేస్తాయన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయ్.
ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయ్. నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న పార్టీల్లో స్వరం మారింది. ఒకరిపై ఒకరు తారాస్థాయిలో విమర్శలు చేసుకున్న టీడీపీ, బీజేపీ నేతలు…ప్రశంసలు కురిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం…ఆజాదీ కా అమృత్ మహోత్సవాల కమిటీ సమావేశానికి చంద్రబాబును ఆహ్వానించడం…సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు…ప్రత్యేకంగా మాట్లాడుకోవడం…ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబును రెగ్యులర్ గా ఢిల్లీకి రావాలని…కొంచెం టచ్ లో ఉండాలని మోడీ చెప్పారు. దీనికి స్పందించిన చంద్రబాబు…ప్రత్యేకంగా వచ్చి కలుస్తానని చెప్పడంతో…మోడీ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా…ముందు తమ ఆఫీస్ కు రావాలని చెప్పడంతో…ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయ్. అన్ని పార్టీల నేతలు, ప్రజలు…మోడీ, చంద్రబాబు కలయిక గురించే చర్చించుకుంటున్నారు.
2019 ఎన్నికల ముందు ప్రత్యేక హోదా కోసం…రాష్ట్రంతో పాటు ఢిల్లీలోనూ ఆందోళనలు నిర్వహించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వంతో పాటు మోడీని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్ర నేతలు మరింత రెచ్చిపోయి…మోడీని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం…అన్ని పార్టీలు బొక్క బోర్లా పడటం జరిగిపోయింది. టీడీపీ 23 సీట్లకే పరిమితమైతే…బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. జనసేన మాత్రం ఒక్క సీటులో గెలిచినా…ఆ తర్వాత ఎమ్మెల్యే రాపాక వైసీపీలో చేరిపోయారు. మూడేళ్లుగా టీడీపీ, బీజేపీ నేతలు ఎడమెహం…పెడమెహంగా ఉన్నారు. సందర్భం వచ్చినపుడల్లా పరస్పర విమర్శలతో హీట్ పెంచుకున్నారు.
ముఖ్యమంత్రి జగన్…టీడీపీ నేతలను కేసులతో ఇబ్బంది పెడుతున్నారు. మూడు రాజధానులను తెరపైకి తేవడం…ఉపాధి కల్పన, కొత్త కంపెనీలు తీసుకురావడం….ఇలా అన్ని రంగాల్లో డెవలప్ మెంట్ లో రాష్ట్రం వెనుకబడిపోయింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి పూర్తిగా మారిపోయింది. గత కొంతకాలంగా టీడీపీ నేతలు…బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో..ప్రధాని మోడీ అడగపోయినా…ద్రౌపది ముర్ము, జగదీప్ ధన్కర్ కు మద్దతు ప్రకటించారు. ఏపీకి వచ్చినపుడు…ఢిల్లీలోనూ ద్రౌపది ముర్మును ప్రత్యేకంగా కలిశారు చంద్రబాబు నాయుడు. అప్పటి నుంచే ఏపీ రాజకీయాల్లో ఏదో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్న ఊహాగానాలు మొదలయ్యాయ్. అందరూ అనుకున్నట్లు మోడీ, చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడుకోవడం…ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు ఉండబోతున్నాయన్న సంకేతాలు వెలువడ్డాయ్. అటు జనసేనాని ఇప్పటికే మూడు ఆప్షన్లు ఇచ్చారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయ్. కొన్ని రోజులుగా బీజేపీ నేతల వైఖరిలో స్పష్టంగా మార్పు కనిపిస్తోంది. మొన్నటి వరకు మూడు రాజధానులను వ్యతిరేకించిన కమలనాథులు…ఉన్నట్టుడి అమరావతి నిర్మాణం కోసం పాదయాత్ర నిర్వహించారు. రాజధాని రైతులకు మద్దతు తెలుపుతూ…అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నామంటూ సమావేశాల్లో చెప్పుకొచ్చారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు…చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు గొప్ప విజనరీ ఉన్న నేత అని…అందుకే నాడు కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి 8 వేల 5వందల కోట్ల నిధులివ్వడానికి సిద్ధపడిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ దార్శనికుడు కానందునే…నిధులు ఇవ్వడం లేదంటూ విమర్శలు గుప్పించారు. అన్ని పరిణామాలను నిశితంగా గమనిస్తే…వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖాయమన్న సిగ్నల్స్ వస్తున్నాయ్.