బాలీవుడ్ హీరోయిన్ సుస్మితాసేన్ కు గుండెపోటు వచ్చింది ఆ విషయాన్ని కాస్త ఆలస్యంగా సుస్మిత స్వయంగా వెల్లడించారు. నెలక్రితం గుండెపోటు వచ్చిందని డాక్టర్లు యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ అమర్చారని ఆమె చెప్పారు. 95 శాతం బ్లాక్ ఉన్నప్పటికీ వైద్య ప్రకియతో తాను బయట పడ్డానని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొత్త జీవితానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఆమె ఒకప్పుడు మిస్ యూనివర్స్. 1996లో దస్తక్ అనే హిందీ చిత్రం ద్వారా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్నారు. ఆపై బాలీవుడ్ లో అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ తొలినాళ్లలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు గుండె పోటుకు గురికావడంతో కెరీర్ కొంత మందగించే అవకాశం ఉంది. అయితే సుస్మితకు హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది. పురుషులకు ఎక్కువగా వస్తుందనుకునే గుండె పోటు ఇప్పుడు మహిళలకు ఎందుకు వస్తోందనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. దీనిపై వైద్యులు పలు రకాలుగా విశ్లేషణలు అందిస్తున్నారు.
పదేళ్ల క్రితం వరకు మహిళలకు గుండె నొప్పి వచ్చినా పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఏదో గ్యాస్ పెయిన్ అని వదిలేసే వారు. ఇప్పుడు 35 ఏళ్ల వయసులోనే ఆడవారికి హార్ట్ అటాక్ వస్తోందని వైద్య నిపుణులు తేల్చారు. వారికి ఈస్ట్రోజన్ సమస్యల కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దాన్ని ఎడిసన్ డిసీజ్ అని కూడా అంటారు. దీని వల్ల హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి కావు. అప్పుడు బీపీ పడిపోవడం హార్ట్ అటాక్ రావచ్చు. గుండె కొట్టుకునే వేగంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ సమస్య నుంచి బయట పడటానికు సుస్మితా సేన్ 2014 నుంచే స్టీరాయిడ్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడది వికటించి ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. ఇదీ సుస్మిత సమస్య మాత్రమే కాదు. చాలా మంది మహిళలకు ఈ సమస్య ఉంటుందని కూడా డాక్టర్లు చెబుతున్నారు. హార్మోన్ పిల్స్ వాడకం కూడా ఇబ్బందే అవుతుంది. మహిళల్లో ధూమపానం కూడా బాగా పెరిగింది. అదో స్టేటస్ సింబల్ గా భావిస్తూ సిగిరెట్లను తెగ ఊదేస్తున్నారు. దానితో ఊపిరితిత్తులు గుండెపై ప్రభావం పడుతోంది. సుస్మితా సేన్ కూడా ఒకప్పుడు ధూమపానం చేసేవారు. దానితో ఆమె ఊపిరితిత్తులు గుండె దెబ్బతిని ఉండొచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే సిగిరెట్ తాగే వారికి గుండె పోటు రావడానికి 34 శాతం అవకాశాలున్నాయి. సుస్మిత సమస్యకు మరో కారణం అది కావచ్చు.
మహిళల్లో మానసిక ఒత్తిడి కూడా బాగా పెరిగింది. వారికి ఎమోషనల్ రియాక్షన్ ఎక్కువ. ప్రతీ అంశాన్ని పర్సనల్ గా తీసుకుని ఎగ్జైట్ అవుతుంటారు. మానసిన వత్తిడి ప్రభావం రక్త నాళాలపై కూడా పడుతుందని వైద్యరంగం తేల్చిన అంశం. దీనివల్ల కార్డియాక్ అరెస్టు అవుతుందని తేల్చారు. సుస్మితకు వృత్తిపరమైన వత్తిడి ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కుటుంబంలో సమస్యలు ఆమె ఎప్పుడూ చెప్పుకోలేదు. ఆహార అలవాట్ల కారణంగా రక్తనాళాల్లో కొవ్వు పెరిగి గుండె సంబంధిత అనారోగ్యం వచ్చి ఉండొచ్చు. హెక్టిక్ షెడ్యూల్ కారణంగా ఆమె ఆహార నియమాలు పాటించి ఉండరని తెలిసిన వాళ్లు చెబుతున్న మాట. మెనోపాజ్ సమస్యలు కూడా సుస్మిత ఆరోగ్యంపై ప్రభావం పడి ఉండొచ్చని భావిస్తున్నారు. 47 ఏళ్ల వయసులో ఆమెకు మెనోపాజ్ మొదలై ఉండొచ్చని ఒక్క లెక్క కడుతున్నారు. అయితే దానిపై స్పష్టత రావాలంటే వైద్యులైనా వెల్లడించాలి. సుస్మిత అయినా చెప్పాలి. నిజానికి సుస్మిత అదృష్టవంతురాలేనని చెప్పక తప్పదు. చాలావరకు హార్ట్ అటాక్స్ సైలెంట్ కిల్లర్లుగా ఉంటాయి. కొంతమంది అది గ్యాస్ పెయిన్ అనుకుని వదిలేస్తుంటారు. సుస్మిత మాత్రం సకాలంలో ఆస్పత్రికి వెళ్లడం వల్ల స్టెంట్ వేసి ఆమె ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. దీనితో సుస్మిత అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.