ప్రశాంత్ కిషోర్ గొప్పా ? కేసీఆర్ గొప్పా ?

By KTV Telugu On 19 March, 2022
image

చపాతిని ఎలా చేయాలో తెలుసుకోవడం వేరు.. అదే చపాతీని ప్రాక్టికల్‌గా ఎలా చేయాలో నేర్చుకోవడం వేరు. రెండు వేర్వేరు అంశాలు. రెండూ ఉండాలి. ఒకటి లేకుండా రెండోది చేయలేం. చేస్తే ఎలా వస్తుందో మనకు చాలా మందికి తెలుసు. రాజకీయాలు కూడా అంతే. రాజకీయ నాయకులు.. రాజకీయ వ్యూహాల్లో రాటుదేలితేనే రాణిస్తారు. వేరే వారి ఆలోచనల మీద ఆధారపడితే మొదటికే మోసం వస్తుంది. ఇప్పటి వరకూఅదే జరిగింది. కానీ ఇప్పుడు స్ట్రాటజిస్టులు రంగంలోకి దిగారు. చివరికి కేసీఆర్ వంటి వారు కూడా ప్రశాంత్ కిషోర్‌ను అంగీకరించాల్సి వచ్చింది.

కేసీఆర్ రాజకీయ చాణక్యంపై అనుమానాలెందుకు ?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవలు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఎందుకంటే కేసీఆర్ మించిన రాజకీయ నాయకుడు మరొకరు లేరు. నిన్నామొన్నటిదాకా చంద్రబాబు పదేళ్లు ముందుగా ఆలోచించి రాజకీయాలు చేస్తారని అనుకునేవారు. అలాంటి చంద్రబాబును కూడా కేసీఆర్ మించిపోయారు. తనదైన వ్యూహాలతో టీఆర్ఎస్‌ను శిఖరంలా నిలబెట్టారు. కానీ ఇప్పుడు ఆయన పీకే సేవలు తీసుకుంటున్నారు. పీకేకు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్‌ను గెలిపించే బాధ్యతను కేసీఆర్ అప్పగించారు. అయితే, రాజకీయ ఎత్తులు-జిత్తులు వేయడంలో అపర చాణక్యుడిగా పేరున్న కేసీఆర్.. పీకే లాంటి కార్పొరేట్ నిపుణుడిని అరువు తెచ్చుకోవడంపై పరిశీలకుల్లో, ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. తన ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇతరులపై ఆధారపడని తమ అధినేత ఇప్పుడు పీకే వైపు చూడడం పట్ల టీఆర్ఎస్ వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

పీకే గెలిపించారని చెప్పుకోవడమే కానీ .. నిజమేనా ?

బిహార్‌కు చెందిన పీకే 2012 గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి పని చేశారు. మోదీ మూడో సారి సీఎం అయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో, 2015లో బిహార్‌లో జేడీ(యు), 2017లో పంజాబ్‌లో కాంగ్రెస్‌, 2019లో ఏపీలో జగన్‌, 2020లో ఢిల్లీలో ఆప్‌, 2021లో బెంగాల్, తమిళనాడుల్లో తృణమూల్, డీఎంకే లకు పని చేశారు. వాటన్నింటిలో ఆయా పార్టీలు విజయం సాధించాయి. నిజానికి పీకే గెలిచే పార్టీలతోనే పని చేసి క్రెడిట్ సంపాదించుకుంటారన్న అభిప్రాయం కూడా ఉంది. అదే పీకే తెలంగాణలో షర్మిల పార్టీకి పని చేసి విజయం తెచ్చి పెట్టాలన్న సవాళ్లు కూడా ఉన్నాయి. షర్మిలకు పని చేస్తానని మాట ఇచ్చికూడా పీకే తప్పారు. అంటే. .. గెలుపోటములు పీకే చేతుల్లో ఉండవనేది నిజం.

పీకే నుంచి కేసీఆర్ ఏం ఆశిస్తున్నారు ?

మొదటిదఫా తెలంగాణ తెచ్చిన సెంటిమెంటుతో, రెండవదఫా రైతుబంధు వంటి స్కీములతో అధికారం దక్కించుకున్న కేసీఆర్ మూడవసారి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం అంత ఈజీ కాదు. ఎంత బాగా పరిపాలించినా ప్రజలకు కొత్త పాలకులు కావాలని ఉంటుంది. అదే కనిపిస్తోంది. తెలంగాణ సమాజంలో టీఆర్ఎస్‌పై వ్యతిరేకత ఉంది. కేసీఆర్ జాతీయ ాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ముందుగా రాష్ట్రంలో పట్టు జారకుండా చూసుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. కేసీఆర్ ఇంకా ఓ ఆరు నెలలు ముందే వెళ్లాలనుకుంటున్నారు. అందుకే ముందుగా పీకే సేవలు ఎక్కువగా తెలంగాణలోనే ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. పీకే జాతీయ రాజకీయాల కన్నా ముందుగా టీఆర్ఎస్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కించడంపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ తనపై నమ్మకం కోల్పోవడం వల్లనే పీకేకు స్పేస్ ఇచ్చారని అర్థం చేసుకోవచ్చు.

పీకే వల్ల మొదటికే మోసం రావొచ్చు !

దేశంలో ఇతర రాష్ట్రాలు వేరు.. తెలంగాణ వేరు. ఇక్కడ కులాల కుంపట్లు పెట్టలేరు. ఇతర రాష్ట్రాల్లో చేసిన రాజకీయాలు వర్కవుట్ అయ్యే అవకాశం లేదు. ఏలాంటి విచిత్రం జరిగినా అది పీకే ప్లాన్ అనడం ప్రారంభించారు. అందుకే కేసీఆర్ మరింతజాగ్రత్తగా వ్యవహరించాలి. పీకే ను కన్నా సొంత వ్యూహాలనే నమ్ముకోవడం మంచిదనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది.