కాంగ్రెస్ పాలనలో కంటే…బీజేపీ పాలన దారుణంగా ఉందా ? నిరర్థక ఆస్తుల పేరుతో…దేశంలో అతి పెద్ద స్కామ్ జరిగిందా ? అవుననే సమాధానం వస్తోంది. యూపీఏ పాలనలో 2 లక్షల కోట్లు ఉంటే…ఎన్డీఏ 8 ఏళ్ల పాలనలో 20 లక్షల కోట్లకు పెరిగింది. దీనిపై విపక్షాల నుంచే కాదు…సొంత పార్టీ నేతలు మోడీ సర్కార్ విమర్శిస్తున్నారు. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము పెరిగిపోతున్నా…ఒక్క రూపాయి తీసుకురాలేదు.
8 ఏళ్ల బీజేపీ పాలనలో ఎన్పీఏల విలువ…ఏకంగా పది రెట్లు పెరిగింది. కొన్ని సంస్థలకు ఎన్పీఏ పేరిట 12 లక్షల కోట్లు ఇచ్చింది. యూపీఏ పాలనలో 2 లక్షల కోట్ల ఎన్పీఏలు ఉంటే…అవి కాస్త ఎన్డీఏ పాలనలో 20.7 లక్షల కోట్లకు పెరిగాయ్. అంటే ఎనిమిదేళ్లలో రెట్లు ఎన్పీఏలు పెరగడం…బీజేపీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని సంస్థలు, అధికారులు కుమ్మక్కయ్యి ఎన్పీఏలకు దోచిపెడుతున్నారని ఆరోపణలు కేంద్రంపై ఉన్నాయ్. మోహుల్ చోక్సీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వంటి వ్యాపారవేత్తలు…లక్షల కోట్లు బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోతున్నారు. బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణం తీసుకొని పారిపోయిన వారిలో మెజార్టీ మోసకారులు…గుజరాతీలే ఉన్నారు. బ్యాంకుల్లో రుణ ఎగవేతలు కూడా లక్షల కోట్లకు చేరాయి. నీతి ఆయోగ్ బృహత్తరమైన ఆలోచనలు అవలంభిస్తే ఎన్పీఏలు తగ్గాలి కదా? మరెందుకు పదింతలు పెరిగాయన్నది ప్రతిపక్షాల ప్రశ్న ? ఒకప్పుడు మేథోవలస జరిగితే ఇప్పుడు సంపదను తరలిస్తున్నారు.
దేశంలో 2004-05లో 55 వేల కోట్ల ఎన్పీఏలు ఉంటే…2014 నాటికి 2.63 లక్షల కోట్లకు చేరింది. యూపీఏ పాలనలో ఎన్పీఏలు 1.90 లక్షల కోట్లకు పెరిగింది. ఈ 8 సంవత్సరాల్లోనే 20 లక్షల కోట్లకు చేరింది. మోడీ పాలనలో ఎన్నడూ లేని విధంగా…ఎన్పీఏలు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్…కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహత్తరమైన పాలన అందిస్తే ఎన్పీఏలు తగ్గాలి కదా ? అంటూ నిలదీశారు. మోడీ ప్రభుత్వం కాకులను కొట్టి గద్దలకు పెడుతోందంటూ మండిపడ్డారు. బ్యాంకుల దగ్గరి తీసుకున్న లక్షల కోట్ల లోన్లను మాఫీ చేస్తూ.. పేదలకు అందే సంక్షేమ పథకాలను తీసేయాలని మోడీ వ్యాఖ్యానించడాన్ని కేసీఆర్ తప్పుపట్టారు. పేదలకు సంక్షేమ పథకాలను అమలుచేస్తే హాహాకారాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు, కార్పొరేట్లకు లక్షలకోట్లు మాఫీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ అందించడాన్ని గొప్పగా చెప్పుకుంటున్న కేంద్రం…గత ఐదేళ్లలో 10 లక్షల కోట్ల మొండి బకాయిలు మాఫీ చేయడంపై విమర్శలు గుప్పించారు. ఈ ఉచితాల జాబితాలో మెహుల్ చోక్సీ, రిషి అగర్వాల్ పేర్లు ముందు వరుసలో ఉన్నాయంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ నిధుల్లో మొదటి హక్కు ఎవరికి ఉందో…దీన్ని బట్టి తెలుసుకోవచ్చంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వేల కోట్ల దేశ సంపద విదేశాలకు తరలిపోతోంది. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సినిమా స్టార్లు…ఇక్కడ సంపాదించుకొని…స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. డొల్ల కంపెనీల పేరుతో…డబ్బును విదేశాల్లో దాచేస్తున్నారు. స్విస్ బ్యాంకుల్లో దాచిన నల్లధనాన్ని తెస్తామంటూ బీరాలు పలికిన మోడీ…ఒక్క పైసా తీసుకురాలేదు. దీనికి తోడు ప్రధాని మోడీ హాయాంలోనే…ఎక్కువ వ్యాపార వేత్తలు బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయారు. మన దేశీయులు డిపాజిట్లు, సెక్యూరిటీలు, ఇతర పత్రాలు 30,500 కోట్ల రూపాయలు ఉన్నట్లు స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంక్ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయ్.
స్విట్జర్లాండ్ బ్యాంకులో 96 దేశాలకు చెందిన 33 లక్షల ఖాతాదారులు ఉన్నారు. ఇందులో ఇండియా టాప్ 3 ప్లేసులో ఉంది. 3.83 బిలియన్ల స్విస్ ప్రాంక్ లు భారతీయుల సంపద ఉన్నట్లు స్విస్ బ్యాంక్ ప్రకటించింది. 2020లో రూ.20700 కోట్లు ఉంటే ఇప్పుడు ఏకంగా 10 వేల కోట్లకు పెరిగింది. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం ఒక్క ఏడాదే 50శాతం పెరిగింది. స్విస్ బ్యాంకులో ఇప్పుడున్న డబ్బు 14 సంవత్సరాల గరిష్టానికి చేరింది. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోతున్న వ్యక్తులను శిక్షించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోంది. వ్యాపారవేత్తలు పారిపోయిన తర్వాత…ఆ డబ్బును నిరర్ధక ఆస్తుల కింద ప్రకటించి చేతులు దులుపుకుంటోంది. పేదలకు పన్నుల మీద పన్నులు విధించి…పెద్దలకు పెడుతోంది.