అప్పటికీ ఇప్పటికీ ఏంటి తేడా.. జగన్ ఎలా సాధించగలిగారు

By KTV Telugu On 6 March, 2023
image

 

గతంలో ఉన్న వనరులే ఇప్పుడూ ఉన్నాయి. అప్పుడున్న సముద్రమే ఇప్పుడూ ఉంది. అంతే తీర ప్రాంతం ఉంది. సౌర శక్తీ జల వనరులూ గాలి అప్పుడూ ఉన్నాయి ఇప్పుడూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని చెబుతోన్న అడ్వాంటేజీలన్నీ కూడా గతంలోనూ ఉన్నాయి ఇప్పుడూ ఉన్నాయి. మరి గతంలో ఇప్పట్లా ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు ఎందుకని రాలేదు. అప్పట్లో అపార అనుభవం తమ సొంతం అని ప్రచారం చేసుకున్న సీనియర్ పాలకులూ ఉన్నారాయె. మరి వారు ఎందుకు పరిశ్రమలను ఇంత భారీగా తీసుకురాలేకపోయారు అప్పడు లేనిదేమిటి ఇప్పుడు మాత్రమే ఉన్నది ఏంటి.

విశాఖ నగరంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ బంపర్ హిట్ అయ్యింది. 13లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి 350కి పైగా కంపెనీలతో ఎం.వో.యూ.లు కుదుర్చుకున్నారు. ఈ పెట్టుబడుల పుణ్యమా అని ఆరు లక్షలకు పైగా ఉద్యోగాలు రానున్నాయి. నిరుద్యోగుల కళ్లల్లో కాంతులు మెరిపించనున్నాయి. పరిశ్రమల రాకతో పరిసర ప్రాంతాలు అమాంతం అభివృద్ధి చెందనున్నాయి. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ అద్భుతంగా మెరుగవుతుంది. అంతిమంగా దేశ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించడం ఖాయం. ఇపుడు ఏపీలో పరిశ్రమలు స్థాపించడానికి ఆసక్తి చూపుతోన్న వారికి ఏపీలో నచ్చినవేంటి. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామమని ఏపీ ప్రభుత్వం ఈ సమ్మిట్ నిర్వహణకు ముందు నుంచే చెబుతూ వస్తోంది. ఏపీ స్వర్గధామం కావడంలో కీలక పాత్ర పోషించే అంశాలేంటి అసలు పెట్టుబడి దారులు ఏపీకి ఎందుకు తరలి రావాలి.

ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఢ సాగర తీర ప్రాంతం ఉంది. అపారమైన ఖనిజ సంపద ఉంది. మానవ వనరులకు లోటే లేదు. రక రకాల వనరులూ ఉన్నాయి. పుష్కలంగా భూముల లభ్యత ఉంది. ఎక్కడి నుండి ఎక్కడికైనా వెళ్లేందుకు రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇవే కదా ఏపీకి ఉన్న అడ్వాంటేజీలుగా ప్రచారం చేస్తున్నవి. మరి ఇవి ఇంతకు ముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు లేవా. ఆంధ్రప్రదేశ్ కు 974 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది. ఇది భూమి పుట్టిన దగ్గర నుంచి ఉంది. అంతే కానీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తీర ప్రాంతం పొడువును ఎవరూ పెంచలేదు. ఖనిజ నిక్షేపాలు మినరల్స్ ఇతరత్రా మూలకాలు వనరులు తరతరాలుగా ఇక్కడే ఉన్నాయి. అవేవీ కూడా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఉత్పత్తి అయ్యే సరుకులు కావు. సౌర శక్తిని అంది పుచ్చుకోడానికి అవసరమైన సూర్య రశ్మి కూడా భూమి పుట్టిందగ్గర నుంచీ ఏపీకి పుష్కలంగా ఉంది.

జీవనది గోదావరి దాని ఉప నదులతో పాటు కృష్ణా నది దాని ఉప నదులతో అంతులేని జలవనరులు ఉన్నాయి. అవి కూడా ఎప్పట్నుంచో ఉన్నాయి. కాకపోతే ఇపుడు గోదావరి జలాలు సముద్రంలో వృధాగా కలిసిపోకుండా వాటిని ఒడిసి పట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు పోలవరం ప్రాజెక్టును వాయువేగంతో నిర్మిస్తోంది ఈ ప్రభుత్వం. సాగర తీరం పొడవునా పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములకూ కొదవ లేదు. ఈ భూములు కూడా ఎప్పట్నుంచో ఉన్నాయి. వాటిని కూడా కొత్తగా పుట్టించలేదు. ఉత్పత్తి చేయనూ లేదు. అంటే అర్ధం ఏంటి ఇపుడు 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిన ఏపీకి ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయో అవన్నీ గతంలోనూ ఉన్నాయి. మరి అటువంటప్పుడు గతంలో ప్రస్తుత గ్లోబల్ సమ్మిట్ స్థాయిలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎందుకు రాలేదు.
ఏపీలో పరిశ్రమలు పెట్టి బాగుపడదామని పారిశ్రామిక వేత్తలు గతంలో ఎందుకు అనుకోలేదు. తాము అభివృద్ది చెందడంతో పాటే ఏపీ అభివృద్ధిలో భాగస్వాములవుదామని పారిశ్రామిక దిగ్గజాలు ఎందుకు ఆలోచన చేయలేదు.

ఎందుకంటే గతంలో రాష్ట్రాన్ని పాలించిన వారికి పారిశ్రామకి రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన లేదు. పరిశ్రమలు రావాలంటే ఏం చేయాలన్న ధ్యాస లేదు. ప్రభుత్వ పరంగా ఎలాంటి విధానాలు రూపొందించుకోవాలన్న ముందు చూపు లేదు. ఎవరైనా తమంతటా తాముగా ఏపీలోకి వచ్చి పరిశ్రమ పెడతామంటే గాలివాటుగా ఓకే చెప్పడం తప్పితే ప్రభుత్వమే చొరవ తీసుకుని పెట్టుబడిదారులను ఏపీకి రప్పించే ప్రయత్నం లేదు. గతానికి భిన్నంగా ఇపుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇవన్నీ ఉన్నాయి అంతే తేడా. విజన్ లేకుండా ఏవీ సాకారం కావు. ప్రయత్నం లేకుండా ఏ విజయమూ దరికి రాదు. కృషి లేకుండా ఏ లక్ష్యమూ నెరవేరదు. ఏదన్నా సాధించాలంటే అసలు ముందుగా బంగారు కలను కనాలన్న ఆలోచన ఉండాలి. కన్నకలను నిజం చేసుకోవాలన్న పట్టుదల ఉండాలి. అందుకోసం రాజీలేకుండా కష్టపడే తత్వం ఉండాలి.

పారదర్శక పాలనతో ప్రగతి శీలక విధానాలతో స్నేహ పూర్వక నిర్ణయాలతో మాత్రమే కలలు నిజం అవుతాయి. పరిశ్రమలు వాటంతట అవే మన దగ్గరకు నడిచొస్తాయి. అభివృద్ధి తనంతట తానుగా రాష్ట్రమంతటా పరుచుకుని మురిసిపోతుంది. ఆ ప్రయత్నం గత పాలకులు చేయలేదు. ఇపుడు ఏపీని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటోన్న జగన్ మోహన్ రెడ్డి ప్రపంచ దేశాలను అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలను ఆకట్టుకునేలా పకడ్బందీ ప్రణాళికలతో నిజాయితీ కూడిన ప్రయత్నాలతో కష్టపడ్డారు కాబట్టే లక్షల కోట్ల పెట్టుబడులు సాధ్యమయ్యాయంటున్నారు ఆర్ధిక రంగ నిపుణులు.
గత పాలకులకు తెలివి లేదని కాదు. అనుభవం లేదని కాదు. కానీ వారిలో ప్రయత్నం మాత్రం లేదు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినపుడు ఎన్నికల సమయంలో కొందరు ఏమని ప్రచారం చేశారు. విభజనతో లోటు బడ్జెట్ తో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకోవాలంటే అనుభవజ్ఞుడైన పాలకుడు ఉంటేనే సాధ్యమవుతుందని ప్రచారం చేశారు.

అప్పట్లో ఎన్నికల బరిలో ఉన్న వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయనకు ఏం అనుభవం ఉంది అని ప్రశ్నలు వేశారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు అనుభవజ్ఞుడు కాబట్టే ఏపీకి అటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఏపీ అభివృద్ధి చెందుతుందని తాను టిడిపి కి మద్దతు ఇచ్చానని చెప్పుకొచ్చారు. సరే వారంతా అంతగా ప్రచారం చేసినా టిడిపి కూటమికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కీ మధ్య ఓట్ల తేడా కేవలం ఒకటిన్నర శాతమే. సరే దాన్ని పక్కన పెట్టేద్దాం. కొందరు సిద్ధాంతీ కరించినట్లు కొందరు ఆకాంక్షించినట్లు కొందరు అదే పనిగా ప్రచారం చేసినట్లు ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అయిదేళ్ల పాటు పాలించారు. ఆ అయిదేళ్ల పాలనలో ఆయన తనకున్న అపార అనుభవంతో ఎన్ని పరిశ్రమలు తెచ్చారు ఎందుకని బాబు హయాంలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి తరలి రాలేదు. ఎందుకు పెట్టుబడి దారులు ఏపీ వైపు ఓరకంట కూడా చూడలేదు పారిశ్రామికంగా ఏపీ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకపోవడమే కాదు చివరకు కేంద్ర ప్రభుత్వం నుండి రావల్సిన విభజన హామీలను కూడా చంద్రబాబు నెరవేర్చలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి.

చంద్రబాబు సీనియారిటీని ప్రస్తావించిన వారు ఇపుడు జగన్ మోహన్ రెడ్డి సాధించిన విజయాన్ని చూసి ఏం సమాధానం చెబుతారు. అని పాలక పక్ష నేతలు నిలదీస్తున్నారు. తన తండ్రి వయసు ఉన్న చంద్రబాబుకు ఉన్న రాజకీయ అనుభవం జగన్ మోహన్ రెడ్డికి లేదు. తన తండ్రితో పాటు రాజకీయాలు చేసిన చంద్రబాబు కున్నంతటి పాలనా అనుభవం కూడా జగన్ కు లేదు. మరి చంద్రబాబు నాయుడు చేయలేకపోయిన పనిని జగన్ మోహన్ రెడ్డి సునాయసంగా ఎలా సాధించగలిగారు. కలలో మాత్రమే కనిపించే పెట్టుబడులను ఎలా నిజం చేయగలిగారు. చంద్రబాబుకు రాజకీయ అనుభవం ఉంది. పాలనా అనుభవం ఉంది. కాకపోతే ఆయనకు పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించాలన్న ఆలోచనపైనే సరియైన అవగాహన అనుభవం లేవేమో అనిపిస్తోందంటున్నారు ఆర్ధిక రంగ నిపుణులు.
ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడితే విజన్ 2020 అనేవారు. ఆ తర్వాత విజన్ 2050 అన్నారు. విజన్ అనేది కాగితాలను నలుపు చేసేసినంత మాత్రాన కనిపించే భవిష్యత్తు కాదు.

విజన్ అంటే అది కాగితాలపై కాదు మెదడులో ఉండాలి. దాన్ని నిజం చేసుకోవాలన్న తపన హృదయంలో ఉండాలి. అవి జగన్ మోహన్ రెడ్డిలో ఉన్నాయి కాబట్టే కేవలం మూడున్నరేళ్ల పాలనలోనే 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఒక్క సారిగా తెచ్చారు. అంతే కాదు చంద్రబాబు హయాంలో ఒప్పందాలు కుదుర్చుకున్న వాటిలో పది శాతం పెట్టుబడులు వాస్తవ రూపం దాలిస్తే జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఇంతకు ముందు కుదుర్చుకున్న ఒప్పందాల్లో 89 శాతం ఎం.ఓ.యూ. లు క్షేత్ర స్థాయిలో పనులు ప్రారంభించాయి. అదే సీనియర్ మోస్ట్ చంద్రబాబుకీ జూనియర్ అయిన జగన్ మోహన్ రెడ్డికీ ఉన్న తేడా. పార్టనర్ షిప్ సమ్మిట్ అంటే ఎం.వో.యూ.లు కుదుర్చుకోవడం అంటే కాకి లెక్కలు చెప్పడం మసిపూసి మారేడు కాయ చేసేయడం తమ పత్రికల్లో అద్భుతం జరిగిపోయినట్లు కట్టు కథలు ప్రచారం చేసుకోవడం చంద్రబాబు హయాంలో జరిగింది. తమ అనుచరులకు కోట్లు వేసి వాళ్లకి డొల్ల కంపెనీలు కట్టబెట్టి వాటితో ఎం.వో.యూ.లు కుదర్చుకున్నట్లుగా ఫోటోలు తీసి పచ్చ పత్రికల్లో ప్రచారం చేసుకుని మురిసిపోవడం బాబుహయాంలో జరిగింది. ఆ అనుభవం కూడా జగన్ మోహన్ రెడ్డికి లేవు.

ఏమీ చేయకపోయినా చాలా చేసేసినట్లు ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబు ఛాంపియన్. అందులో ఎవరికీ రెండో అభిప్రాయం లేదు. చాలా చేసినా చేసింది ప్రచారం చేసుకోలేకపోవడం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనకబడే ఉందన్నది నిష్ఠుర సత్యం. అయితే కాకి లెక్కలు ఉత్తుత్తి ప్రచారాలు కొద్ది రోజుల్లోనే పుచ్చు విత్తనాల్లా తేలిపోతాయి. నిజమైన లెక్కలు నిజాయితీతో కూడుకున్న ఒప్పందాలు వాస్తవ దృక్పథానికి పెద్ద పీట వేసే విధానాలు మాత్రం కల కాలం మెరుస్తాయి. కాల క్రమంలో అవే బంగారు గుడ్లు పెడతాయి. ఇపుడు విశాఖలో ముగిసిన గ్లోబల్ సమ్మిట్ కూడా అంతే. ఇపుడు కుదర్చుకున్న ఒప్పందాలూ అంతే. ఇవి అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ కు బంగారు భవిష్యత్తును తెచ్చిపెడతాయి. ఇక్కడి నిరుద్యోగ యువత కళ్లల్లో ఆనందాల సాగు చేస్తాయి. గ్రామీణాంధ్ర ఆర్ధిక ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసి మెరుపులు సృష్టిస్తాయి. అనుమానాలు అవసరం లేదు. ప్రగతి పథంలో ఏపీ ఓ పెద్ద ముందడుగు వేసేసింది. ఇక దాన్ని ఎవరూ ఆపనూ లేరు. అది వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరమూ లేదు. ఇదంతా జగన్ విజన్ తోనే సాధ్యమైందని రాష్ట్ర మంత్రులే కాదు ముకేష్ అంబానీ వంటి దిగ్గజాలే చాటి చెప్పారు. జయహో ఏపీ.