నాయనా నిత్యానందా.. ఇక చాలు ద‌య‌చేయి

By KTV Telugu On 6 March, 2023
image

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస‌. మ‌న దేశంలో తింగ‌రేషాల‌న్నీ వేసి అరెస్ట్‌చేసి లోప‌లేసే టైంలో పారిపోయిన నిత్యానంద‌స్వామి క‌ల్పించిన దేశం ఓ క‌ల్పిత దేశం. దాని క‌రెన్సీ వేరు. దాని రాజ్యాంగం వేరు. నిత్యానందుడి చుట్టూ ఎలాంటి బ్యాచ్ ఉంటుందో గతంలో చూశాంగా. కుప్పిగంతులు పూన‌కాలు. సాక్షాత్తూ భ‌గ‌వ‌త్‌ స్వరూపుడిన‌ని నిత్యానందుడు న‌మ్మితే ఆయ‌న చుట్టూ ఉండేవాళ్లంతో కీర్తిస్తారు ఆరాధిస్తారు. కొంత‌మంది బాధితులు బ‌య‌టికిరాబ‌ట్టే నిత్యానంద‌స్వామి నిజ‌స్వ‌రూప‌మేంటో మ‌న ద‌గ్గ‌ర బ‌య‌ట‌ప‌డింది. లేక‌పోతే ఇప్ప‌టికే ఆ స్వామి సామ్రాజ్యం విస్త‌రించి ఉండేది.

నిత్యానంద‌స్వామి చెబుతున్న కైలాస‌దేశం అస‌లుందా ఊరికే ఊహాజ‌నితంగా సృష్టించిందేనా అన్న అనుమానాలు కొంద‌రికున్నాయి. అయితే ఈమ‌ధ్య ఆదేశ ప్ర‌తినిధినంటూ ఓ మ‌హిళ ఐక్యరాజ్య‌స‌మితి స‌మావేశాల్లో ప్ర‌త్య‌క్షం కావ‌టంతో ఓరి నీ అసాధ్యం కూలా అనుకున్నారంతా. భ‌విష్య‌త్తులో సొంత సైన్యంతో ఇక దండ‌యాత్ర‌లు కూడా మొద‌లెట్టేస్తాడేమోన‌న్న అనుమానాలు వ‌చ్చాయి. అయితే వివాదాస్ప‌ద నిత్యానంద‌కు ఇప్పుడు పెద్ద షాక్ తగిలింది. కైలాస దేశానికి అంతర్జాతీయ ఉనికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు కోసం నిత్యానంద ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా కైలాసతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు అమెరికా నగరం ప్రకటించింది.

వివాదాస్ప‌ద కైలాస‌తో ఒప్పందాన్ని ర‌ద్దుచేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది అమెరికన్‌ సిటీ నెవార్క్. తాము మోస‌పోయామ‌ని ఆ న‌గ‌రం ప్ర‌క‌టించింది. కైలాస చుట్టూ అన్నీ వివాదాలేనంటూ అందుకే ఆ దేశంతో చేసుకున్న ఒప్పందాన్ని జనవరి 18నే రద్దు చేసుకున్న‌ట్లు నెవార్క్ న‌గ‌ర అధికార ప్రతినిధి ప్ర‌క‌ట‌న చేశారు. కానీ నిత్యానందుడి దేశంలోని అధికారిక వెబ్‌సైట్‌ మాత్రం అమెరికా నగరం USKని గుర్తించిందని ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుందంటూ డాక్యుమెంట్స్‌ని పెట్టి ఇప్ప‌టికీ ప్ర‌చారం చేసుకుంటోంది.

నిత్యానందుడు అత్యాచారం కిడ్నాప్‌ లాంటి కేసుల్లో నిందితుడు. కానీ ఐక్యరాజ్య‌సమితి మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్‌కు వ‌చ్చిన కైలాస ప్ర‌తినిధి మాత్రం నిత్యానంద వేధింపులకు గురవుతున్నాడని స్వదేశం నుంచే బహిష్కరణకు గురయ్యాడంటూ ప్ర‌సంగించింది. అయితే ఐరాస మానవహక్కుల కమిషన్ ఆ వాద‌న‌ను తోసిపుచ్చింది. నిత్యానంద చెబుతున్న కైలాస దేశం ఎక్కడ ఉందో స్పష్టత లేదు. ఈక్వెడార్ సమీపంలోని దీవుల్లో ఉందంటున్నా ఆదేశం ఖండించింది. మ‌రి నేల‌మీదే ఉన్నాడో ఆకాశంలో ఉన్నాడో త్రిశంకుస్వ‌ర్గంలో వేలాడుతున్నాడో ఆ క‌న్నింగ్ స్వామికే తెలియాలి.