అధికార పార్టీ అంటేనే వర్గపోరు. ముఠాతత్వం. ఒకరినొక్కరు కిందకు లాక్కునే ప్రయత్నం. తాను మాత్రం పెత్తనం చేలాయించాలని అధినేత దృష్టిలో పడాలని తపనపడే సంకల్పం. ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీలో కూడా అదే జరుగుతోంది. వైసీపీ నేతలు పార్టీలోని ప్రత్యర్థులను చూసి తొడలు కొడుతూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు.
ఉమ్మడి కడప జిల్లా వైసీపీలో వర్గపోరును వర్ణించడం అంత సులభమేమీ కాదు. జిల్లాల విభజనకు ముందు కడపలో 10 నియోజకవర్గాలుండగా గత ఎన్నికల్లో అన్ని చోట్ల వైసీపీ జయకేతనం ఎగురవేసింది. ఎన్నికలు ముగిసి పదవులు వచ్చే సరికి అసలు రంగు బయటపడింది. అందరూ ఒకటై అంతా తామై పనిచేయాల్సిన నేతలు ఆధిపత్యం కోసం అడ్డదారులు తొక్కడంతో సాధారణ కార్యకర్తలు ఆందోళనకు లోనవుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ అదే పరిస్తితి కనిపిస్తోంది. జమ్మలమడుగులో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి మరో వైసీపీ నేత మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి మొదటినుండి సఖ్యత లేదు. సుధీర్‌రెడ్డి అంతా తనదేనంటూ రామసుబ్బారెడ్డిని దూరం పెడుతున్నారు. ఇద్దరి మధ్యా హత్యారాజకీయాలకు తెరతీసి చాలా రోజులైంది. అక్రమ దందాలన్నీ ఎమ్మెల్యే చేతిలోనే ఉంటడంతో రామసుబ్బారెడ్డికి చేయి కాదు ఆడటం లేదు. సుధీర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డిని కలిపే విషయంలో అధినేత జగన్‌రెడ్డి సైతం విఫలం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్ మధ్య మొదటినుండి వర్గపోరు కొనసాగుతోంది. నిజానికి ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా గవర్నర్ కోటాలో జగన్‌రెడ్డి డైరెక్ట్‌గా రమేశ్‌యాదవ్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఆ నిర్ణయాన్ని ఓర్వలేని ఎమ్మెల్యే వర్గం రమేశ్‌యాదవ్‌పై కక్ష కట్టి రకరకాల ఇబ్బందులు పెడుతుందనే ప్రచారం జరుగుతోంది. దాంతో ప్రొద్దుటూరు వైసీపీలో రెండు వర్గాల మధ్య కుమ్ములాట కొనసాగుతుందనే ఆరోపణలున్నాయి. మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచునూరు చంద్రతోపాటు కొందరు జడ్పీటీసీలు, ద్వితీయస్థాయి నేతలను పక్కన పెట్టడంతో ఆ నియోజకవర్గంలోనూ వర్గపోరు భగ్గుమంటోంది. ఇక కడప ఎమ్మెల్యే అంజాద్ భాషా పేరుకే డిప్యూటీ సీఎం. జిల్లా కేంద్రంలో రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యానికి ప్రయత్నిస్తూనే ఉంది. దానితో అంజాద్ భాషా నిత్యం ఉక్కపోతకు గురవుతున్నారు.
ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన బద్వేల్‌లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధా పేరుకు మాత్రమే ఎమ్మెల్యే. పెత్తనమంతా ఆ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అయిన ఎమ్మెల్సీ గోవిందరెడ్డిదేనని చెబుతున్నారు. దాంతో బలహీన వర్గాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అటు రాజంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి కడప జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాధరెడ్డి వర్గాల మధ్య కూడా తొలి నుండే విభేదాలు కొనసాగుతున్నాయి. ఇరు వర్గాలు కలిసి కార్యక్రమాలు నిర్వహించకపోగా ఇసుక భూకబ్జాల్లో మాత్రం పోటాపోటీగా అక్రమాలకు పాల్పడుతుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక రైల్వే కోడూరు రాయచోటి నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు శ్రీనివాసులు శ్రీకాంత్‌రెడ్డితో కొందరు ద్వితీయశ్రేణి నాయకులకు విభేధాలు ఉన్నాయి. మీరెంత అంటే మీరెంత అన్నట్లుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. దానితో ఏం చేయాలో తెలియక వైసీపీ అధిష్టానం తల పట్టుకు కూర్చుంటోంది. ఎన్నికల నాటికి ఎలాగోలా సమస్య పరిష్కారమవుతుందన్న ఆశాభావంతో ఉంది.కుద రకపోతే కొందరు సిట్టింగులకు మొండిచేయి చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు.