మునుగోడులో బీజేపీకి రివర్స్ పంచ్ ఇస్తారా..?

By KTV Telugu On 20 August, 2022
image

తెలంగాణ రాజకీయాలన్నీ…మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతోంది. బై ఎలక్షన్ లో ఎలాంటి తప్పిదాలు చేయకూడదో…ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి తెలిసొచ్చింది. దుబ్బాక, మునుగోడులో చేసిన తప్పిదాలు మళ్లీ చేయకుండా…మునుగోడు గెలుపే లక్ష్యంగా గులాబీ బాస్ పావులు కదుపుతున్నారు. ఉప ఎన్నికల్లో సత్తా చాటి…బీజేపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాచేయడంతో…ఉప ఎన్నిక రాబోతుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. ఈ ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయ్. అధికార టిఆర్ఎస్…మునుగోడుపై ఫోకస్ పెట్టింది. ఉప ఎన్నికల్లో గెలిచి…తెలంగాణలో తమకు తిరుగులేదని చెప్పాలని గులాబీ దళపతి కేసీఆర్ వ్యూహాలు రూపొందిస్తున్నారు. గతంలో దుబ్బాక,హుజురాబాద్ ఉప ఎన్నికల నుంచి పాఠాలు నేర్చుకున్న టిఆర్ఎస్, మునుగోడు విషయంలో కాస్తా భిన్నంగానే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. ప్రధానంగా హుజురాబాద్ ఉప ఎన్నికలో చేసిన తప్పులు …మునుగోడులో రిపీట్ చేయకూడదన్న నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే అటు కాంగ్రెస్ ,ఇటు రాజగోపాల్ రెడ్డి హడావుడి చేస్తున్నా…టిఆర్ఎస్ ఆ పరిణామాలను గమనిస్తోంది. పార్టీ నేతలతో ఇప్పటి వరకు మునుగోడుపై ఒక్క సమావేశం పెట్టకపోవడం అందుకు సంకేతమేన్న వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మునుగోడు బై ఎలక్షన్ ను సాధారణంగానే ఎదుర్కోవాలని …ఎక్కువ హడావుడి వద్దన్న అలోచనతో గులాబీ పార్టీ ఉంది.

సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో…దుబ్బాకకు ఉప ఎన్నిక వచ్చింది. టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌ గా పేరున్న హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించడంతో…దుబ్బాకలోనూ టీఆర్ఎస్ విజయం ఈజీ అనుకున్నారు. ఉప ఎన్నికల వ్యవహారాలను చూసేది హరీశ్ రావు కావడం.. దుబ్బాక సిద్ధిపేటకు పక్కనే ఉండటంతో హరీశ్ రావు సులభంగా గెలిపిస్తారని భావించారు. తెలంగాణ ఏర్పడి, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ప్రతి ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. దుబ్బాకలో మాత్రం ఫలితం తిరగబడింది. ఆ తర్వాత జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ సర్వశక్తులు ఒడ్డింది .ఉప ఎన్నిక కంటే ముందు గులాబీ పార్టీ ఒక రకంగా రాజకీయ దండయాత్ర చేసిందన్న రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే టీఆర్ఎస్ నేతలు తిష్ట వేయడం …మరోవైపు భారీగా అభివృద్ది కార్యక్రమలకు శ్రీకారం చుట్టింది. మంత్రులు విరామం లేకుండా పర్యటించారు. పార్టీ పరంగా నామినేటేడ్ పదవులు…స్థానిక నేతలకు కట్టబెట్టింది. టిఆర్ఎస్ కు హంగామా…పార్టీకి మేలు కంటే కీడే ఎక్కువ చేసిందన్న విశ్లేషణలు ఉన్నాయ్.

కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలో విజయం సాధించి…ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్స్ పంపాలని గులాబీ బాస్ కేసీఆర్ ఉన్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు…మునుగోడులో సత్తా చాటితే…దెబ్బకు కాంగ్రెస్, బీజేపీలు దారిలోకి వస్తాయన్న ఆలోచనలో ఉన్నారు. గెలుపు బాధ్యతలు మంత్రులకే అప్పగించి…ప్రచారానికి దూరంగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ప్రచారం చేసినా గెలవకపోతే…ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. ప్రత్యర్థులు కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది. అందుకే గులాబీ దళపతి …వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు రెండు పార్టీలు హడావిడి చేస్తున్నా…ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఎలాగైనా సరే మునుగోడులో గులాబీ జెండా ఎగరేసి…తమకు ఇంకా ప్రజాభిమానం ఉందని నిరూపించాలని డిసైడ్ అయ్యారు. హుజూర్ నగర్ ,నాగార్జున సాగర్ లో వ్యవహరించినట్టే…మునుగోడు ఉప ఎన్నికలోనూ ముందుకు సాగాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.