మీలో ఒక్కడు.. మీతోనే ఆ ఒక్కడు….

By KTV Telugu On 19 March, 2022
image

నాన్న ఉంటేనే కొడుకు.. నాన్న లేకపోతే కొడుకు లేడు.. ఒంటరిగా పోరాడే సత్తా ఆ కొడుకుకు లేదు… అనే సెంటిమెంట్ కు ఆయన తిరుగులేని ఎదురు సమాధానం.. తండ్రి పరమపదించిన తర్వాతే ఆయన అసలు రాజకీయం జీవితం మొదలైంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న చందంగా కాకుండా… స్వశక్తితో రాజకీయాల్లో రాణించే అవకాశమూ వచ్చింది ఆయనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్…

నిజానికి స్టాలిన్ ది హక్కుల పారాటం. రాజకీయాల్లో విశ్వసనీయతను కాపాడుకోవడం తన హక్కుగా భావించి ఆయన చేసిన పోరాటం. చిన్నప్పుడే తండ్రి కరుణానిధితో కలిసి కేంద్రంపై ఫెడరలిజాన్ని పటిష్టం చేసుకోవడంతో కోసం చేసిన హక్కుల పోరాటం. సీఎం పదవిని చేపట్టిన తర్వాత పేదలు, అణగారిన వర్గాలు, అవకాశాలు వెదుక్కునే వారికి నేనున్నానని భరోసా ఇచ్చే హక్కు తనకు ఉందని నిరూపించే నిరంతర పోరాట. అదే ముత్తువేలర్ కరుణానిధి స్టాలిన్ పోరాటం.. అధికారంలో ఉన్నప్పటికీ .. ప్రజల కోసం ఆయన చేస్తున్న పోరాటం రాజకీయాల పట్ల అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుందనడంలో సందేహించాల్సిన అవసరం లేదు…

ఎమర్జెన్సీలో స్టాలిన్ జైలుకెళ్లారు. పోలీసు దెబ్బలు తిన్నారు. జైల్లోనే ఆయన తొలి రాజకీయ పాఠాలు నేర్చుకుని ఉండొచ్చు. 37 ఏళ్ల పాటు డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా కార్యకర్తలతో కలిసి తిరిగిన అనుభవం ఉపయోగపడొచ్చు.చెన్నై మేయర్ గా పరిపాలనా అనుభవం గడించి ఉండొచ్చు. కుటుంబ రాజకీయాల్లో పండిపోయి… అన్న అళగిరిపై వారసత్వంలో విజయం సాధించి ఉండొచ్చు. అవన్నీ ఒక ఎత్తు… 2021 మే 7 తమిళనాడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్టాలిన్ ప్రదర్శిస్తున్న పరిణితి మరో ఎత్తు. ఇప్పుడు తమిళ ప్రజలే ఆయన శ్వాస. ప్రజా సంక్షేమమే ఆయన ఉఛ్వాస నిశ్వాస…

వంద రోజుల పాలనలోనే స్టాలిన్ తన సత్త చాటారు. పదేళ్లలో చేయలేని పనులను పట్టాలెక్కించారు. కొవిడ్ బాధితులకు రెండు వాయిదాల్లో నాలుగు వేల రూపాయలు అందించారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో ఉచితంగా కొవిడ్ వైద్యం అందించారు. ఆస్పత్రికి వెళ్లి మరీ కొందరు కొవిడ్ పేషెంట్లను పలుకరించారు. అదీ వారికి ఆత్మీయ స్పర్శగా మారింది. కొవిడ్ బాధిత అనాథలకు 5 లక్షల రూపాయలు సాయం ప్రకటించారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించారు. పాల ధర లీటరుకు మూడు రూపాయలు తగ్గించారు.రేషన్ వ్యవస్థను క్రమబద్ధీకరించారు… ఇలా చెప్పుకుంటూ పోతే స్టాలిన్ అఛీవ్ మెంట్స్ చాలానే ఉన్నాయి…

స్టాలిన్ ప్రజల మనిషి ప్రజల్లోనేఉంటాడు. దారిలో ఎవరైనా తన కోసం నిరీక్షిస్తున్నారని తెలిస్తే.. అక్కడే దిగిపోయారు. సెక్యూరిటీ సమస్యలను ఆయన అసలు పట్టించుకోరు. వారి ఇబ్బందలేమిటో తెలుసుకుని వినతి పత్రాలను తీసుకుని, తక్షణమే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు… అందుకే ఇప్పుడు దేశంలో స్టాలిన్ అత్యంత పాపులర్ సీఎం. ప్రజల వద్దకు సీఎం తరహాలో స్కీమ్ ప్రారంభించి నియోజకవర్గం స్థాయిలో సక్సెస్ చేశారు. మహిళల పేరుతో ఉచిత ఇళ్ల రిజిస్ట్రేషన్ లాంటి పథకాలు స్టాలిన్ ఇమేజ్ ని మరింతగా పెంచాయి. నాన్ ముదల్ వన్.. అంటే నేనే ఫస్ట్… పేరుతో యువతలోని టాలెంట్ ను బయటకు తెచ్చే పథకం స్టాలిన్ పుట్టినరోజున ప్రారంభమై… విజయవంతంగా కొనసాగుతోంది… ఎన్నికల సందర్భంగా డీఎంకే 500పైగా హామీలిచ్చింది. మొదటి నాలుగు నెలల్లోనే 200పైగా హామీలను నెరవేర్చింది.మిగిలిన హామీలను పూర్తి చేసేందుకు ఎక్కువ సమయం పట్టదని కూడా ప్రకటించేసింది.

స్టాలిన్ వచ్చిన తర్వాత పద్ధతులు మారి ఉండొచ్చు. కరుణానిధి పాలనా కాలం కంటే ఇప్పుడు దూకుడు పెరిగి ఉండొచ్చు. అయినా పార్టీ మూల సిద్ధాంతాల విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడలేదు. కేంద్రంపై పోరాటంలోనూ రాష్ట్రాల హక్కులను కాపాడటంలోనూ వెనుకంజ వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బలమైన కేంద్రం, శక్తమంతమైన రాష్ట్రాలు… అన్న నినాదం మళ్లీ తెలపైకి వచ్చింది. ఇంతకాలం సెంట్రల్ గవర్నమెంట్ అని పిలిచిన డీఎంకే… ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ అని పిలుస్తోంది.. రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు రాజ్యాంగ సవరణలు కూడా చేయాల్సిందేనని స్టాలిన్ నేరుగానే చెప్పేశారు. ఇందుకోసం కాంగ్రెస్ లెఫ్ట్ కలిసి రావాలని స్టాలిన్ పిలుపునిస్తున్నారు…

ఇచ్చిన హామీల్లో స్టాలిన్ కొన్నింటినీ నెరవేర్చలేకపోయారు. తాము అధికారంలోకి వస్తే అఖిలభారత వైద్య విద్యా ప్రవేశ పరీక్ష అయిన నీట్…ను రద్దు చేయిస్తామన్నారు. అధికారానికి వచ్చిన తర్వాత ఆ అంశంపై దూకుడును ప్రదర్శించడం లేదు. అది అంత సులభం కాదని అనుకున్నారో ఏమో.. అయితే అందులోనూ ఫెడరల్ సమస్యలున్నాయని చెప్పక తప్పదు. స్టాలిన్ వాదనకు అన్ని రాష్ట్రాలు అంగీకరించాలి కదా…కేంద్రం నుంచి సానుకూల స్పందన రావాలి కదా…

బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కు స్టాలిన్ ర్యాలీయింగ్ పాయింట్ కావచ్చు.కొందరు నేతల్లా ఢిల్లీ ముంబై తిరుగుతూ రాజకీయాలు చేయకపోవచ్చు, ఎందుకంటే విపక్ష నేతలను కలపడంలో డీఎంకే స్టయిల్ వేరుగా ఉంటుంది. తమిళనాడు కేంద్రంగానే మీటింగులు పెట్టి నేతలను రప్పించి వ్యూహాలు సిద్ధం చేస్తారు. ఇటీవల స్టాలిన్ బయోగ్రఫీ రిలీజ్ ఫంక్షన్ కు చాలా మంది జాతీయ నాయకులు వచ్చారు. ఉంగలిన్ ఒరువర్… అంటే మీలోే ఒక్కడు అని ప్రచురితమైన పుస్తకంలో స్టాలిన్ జీవత చరిత్ర కంటే దేశ వ్యవస్థలు, అదీ ఫెడరలిజంపైనే ఎక్కువ ప్రస్తావన ఉంది. భవిష్యత్తులో స్టాలిన్ ఏం చేస్తారో చూద్దాం…