తండ్రుల లెగసీని కాపాడుకోవడం అంత తేలికేం కాదు. వైఎస్ తనయుడిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆ విషయంలో చాలావరకు మెప్పించారు. అలాగే కేసీఆర్ కొడుకు తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఏదో కొంతమందికే. తండ్రి ఎంత కాకలుతీరిన నాయకుడైనా కొడుకులు ఆయన పేరు నిలబెట్టలేరు. ఎక్కడిదాకో ఎందుకు మాస్ లీడర్‌గా చెరగని ముద్రవేసిన పీజేఆర్‌నే తీసుకుంటే ఆయన కొడుకు ఆ వారసత్వాన్ని కొనసాగించలేకపోయాడు. కూతురు రాజకీయాల్లో ఉన్నా తండ్రికి తగ్గ తనయ అనే పేరు తెచ్చుకోలేకపోయింది. చెప్పుకుంటూ పోతే తెలుగురాష్ట్రాల రాజకీయాల్లో ఇలాంటి వారసులు ఎందరో.
ఏపీకొస్తే వంగవీటి రంగా ఇన్ని దశాబ్ధాల తర్వాత కూడా ఓ బ్రాండ్. నాలుగుదశాబ్ధాల క్రితం కాపులకు ఆయన ఓ రోల్‌మోడల్. రాజీలేని ధోరణితోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు వంగవీటి రంగా. కాబట్టే చనిపోయి ఇన్నేళ్లయినా ఆయన గురించి చర్చ జరుగుతూనే ఉంది. 80వ దశకంలో కూడా కాంగ్రెస్‌లో కుళ్లు రాజకీయాలే. ఎందుకంటే రెడ్డి కాంగ్రెస్, ఇందిరమ్మ కాంగ్రెస్‌గా కాంగ్రెస్‌పార్టీ చీలిపోయింది. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గానైనా పోటీచేస్తాగానీ పార్టీ మాత్రం మారనని అప్పట్లో రంగా ఖరాఖండిగా చెప్పారు. అప్పట్లో కమ్యూనిస్టు జెండా కప్పుకుంటారని ప్రచారం జరిగినా ఢిల్లీకి వెళ్లి ఇందిరమ్మతో మాట్లాడి మరీ సీటు తెచ్చుకున్నారు. ఇదీ అప్పట్లో ఆయన రాజకీయ నిబద్ధత.
వర్తమానానికి వస్తే వంగవీటి రాధా సన్నాఫ్ రంగా. తండ్రికున్న పట్టుదలతో పోలిస్తే రాధాని లెక్కలోకి కూడా తీసుకోలేం. రంగా కుమారుడిగా ఉన్న పేరుని ఆయన నిలబెట్టుకోలేకపోతున్నారు. రంగాకి తగ్గ వారసుడన్న పేరు తెచ్చుకోలేకపోతున్నారు. 2019 తర్వాత రాజకీయంగా గందరగోళంలో ఉన్నారు రాధా. ఆయన నిలకడలేనితనంతో రంగా అనుచరులు కూడా నమ్మలేకపోతున్నారు. వైసీపీలోకి వెళ్లి అక్కడినుంచి టీడీపీలోకొచ్చి ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు. టీడీపీలో ఉంటూనే వైసీపీ నేతలతో టచ్‌లో ఉంటూ కేడర్‌ని కన్‌ఫ్యూజ్ చేశారు. ఇప్పుడు జనసేనలో చేరడం ఖాయం అనుకుంటున్న టైంలో లోకేష్ పాదయాత్రలో ప్రత్యక్షమయ్యారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం తెగించే నైజం రంగాది. కానీ రాధాలో ఆ తెగింపులేదు. ఎప్పటికీ ఆయన మరో రంగా కాలేడు.