చైనా అవలంభించే ప్రతి చర్యలోనూ ఒక నిగూఢమైన అంతరార్థం దాగి ఉంటుంది. ప్రపంచంపై ఆధిపత్యం సాధించాలనే ఆశయంతో అది తన ఇరుగుపొరుగు దేశాలను శత్రు దేశాలుగా భావిస్తుంది. ఇతర దేశాల్లో ఏం జరుగుతుందో తెలసుకునేందుకు రకరకాల పద్దతుల్లో నిఘా పెడుతోంది. చైనాలో తయారైన పలు యాప్‌ల ద్వారా ఇతర దేశాల అంతరంగిక రహస్యాలు పౌరుల డేటాను సేకరిస్తోందని ఎప్పటినుంచో అనుమానాలు ఉన్నాయి. చైనా రూపొందించిన టిక్‌టాక్ యాప్ ప్రపంచ వ్యాప్తంగా బాగా క్లిక్కయ్యింది. అన్ని వయసుల వారు వీడియోలు తీస్తూ బాగా ఎంజాయ్ చేశారు. టిక్ టాక్ యాప్ కి ప్రపంచ వ్యాప్తంగా 100కోట్లమంది యూజర్లు ఉన్నారు. ఒక్క అమెరికాలోనే 10కోట్లమంది తమ ఫోన్లలో టిక్ టాక్ వినియోగిస్తున్నారని అంచనా. అయితే పేరుకు అది యాప్ అయినా దానితో దేశ సార్వభౌమాధికారానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని భారత్ సంశయించింది. అందుకే 2020లో 59 చైనీస్ యాప్స్‌తో పాటు టిక్‌టాక్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.
భారత్‌తో పాటు తైవాన్, యురోపియన్ యూనియన్, కెనెడా, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ లో కూడా టిక్‌టాక్‌పై నిషేధం విధించారు. తాజాగా అమెరికాలో కూడా టిక్‌టాక్‌ను బ్యాన్ చేశారు. దీనికి సంబంధించిన బిల్లుకి వైట్ హౌస్ ఆమోదం తెలిపింది. టిక్ టాక్ ద్వారా ఎలాంటి ముప్పు పొంచి ఉంది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా ఎలా నిఘా పెడుతుంది. దేశ వ్యతిరేక భావజాలాన్ని ఎలా వ్యాపింపజేస్తుంది అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. టిక్ టాక్ పై నిషేధమే కాకుండా కొన్ని ఇతర దేశాల సాంకేతిక సేవలు వినియోగించుకోకుండా నిరోధించడానికి యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వానికి ఈ చట్టం అధికారాన్నిస్తుంది. అమెరికన్ల డేటా జాతీయ భద్రతకు హాని కలిగించే ఎలాంటి టెక్నాలజీని తమ ప్రభుత్వం స్వాగతించదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు తెలిపారు. ఈ యాప్‌పై బ్యాన్ విధించడానికి అమెరికా చాలా రోజులుగా కసరత్తు చేస్తోంది. మొదటి దశలో ప్రభుత్వానికి సంబంధించిన ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ లలో టిక్ టాక్ యాప్ ఉపయోగించడానికి వీలు లేకుండా కొన్ని ఆంక్షలు విధించింది. ఇప్పుడు పూర్తిగా బ్యాన్ చేస్తూ చట్టం చేసింది.