అదానీకి ఇండియా, కవితకు తెలంగాణ కవచకుండలాలా

By KTV Telugu On 9 March, 2023
image

తెలంగాణ తల వంచదు అని ఎమ్మెల్సీ కవిత ఈడీ నుంచి నోటీసులు అందిన తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనను చాలా మంది అచ్చంగా గౌతం అదానీ వ్యవహారంతో పోల్చారు. అమెరికా కు చెందిన హిండెన్ బెర్గ్ బయట పెట్టిన నివేదిక భారత్ పై దాడేననే అదానీ చెప్పుకొచ్చారు. హిండెన్ బెర్గ్ కమిటీ ఏం చెప్పింది. అదానీ కంపెనీల లొసుగుల్ని బయట పెట్టింది. తాను చెప్పింది అబద్దమైతే తనపై దావా వేయాలని ఆ సంస్థ చాలెంజ్ చేసింది. అవి నిజమా కాదా అన్న సంగతి పక్కన పెడితే ఇలా చేయడం దేశంపై దాడేనని అదానీ జాతీయవాదం ముసుగులో దాక్కుని యుద్ధం చేయడం ప్రారంభించారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఈడీ నోటీసులు జారీ చేస్తే ఆ విషయాన్ని తెలంగాణ వాదానికి చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇద్దరి పోరాటంలో పోలికలు చూస్తున్నారు జనం.

హిండన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ చేసిన ఆరోపణలతో అదానీ కంపెనీల షేర్లన్నీ నేల చూపులు చూశాయి. మొత్తం మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి. కనీసం పదిహేనులక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇందులో చిన్న పెట్టుబడిదారుల సొమ్ము చాలా ఉంది. ఇది కేవలం ఇండియాపై ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర అని అదానీ గ్రూప్ ఆరోపించింది. తాము వెలువరించిన రిపోర్ట్‌పై అదానీ చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది. కేవలం జాతీయవాదం అనే ముసుగు తగిలించుకుని మోసాల్ని కప్పి పుచ్చలేరంటూ హిండెన్ బెర్గ్ తేల్చి చెప్పింది. అదానీ గ్రూప్ షేర్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఇప్పటికే ఆరోపణలు చేసిన ఆ కంపెనీ కేవలం ఈ విషయాన్ని దృష్టి మరల్చడానికే అదానీ జాతీయవాదం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని స్పష్టం చేసింది. భారత్‌పై దాడి చేసేందుకే తాము ఈ రిపోర్ట్‌ను వెలువరించినట్టు చేసిన వ్యాఖ్యల్నీ కొట్టి పారేసింది. నేషనలిజం అనే ముసుగు కప్పుకుని ఇలా దేశ సంపదను దోచుకోడం ఏమిటని ప్రశ్నించింది.

అదానీ కంపెనీలు ఎప్పుడైతే జాతీయవాదం ఎత్తుకున్నాయో అప్పుడే దేశం కోసం ధర్మం కోసం అదానీ షేర్లను కొందామంటూ ఓ ప్రచారాన్ని సోషల్ మీడియాలో ప్రారంభించారు. దేశంలో ఇతరుల దాడిని తిప్పి కొడదామని సూచించారు. సోషల్ మీడియాలో అదానీకి మద్దతుగా పోస్టుల వెల్లువ వచ్చింది. బీజేపీ కార్యకర్తలు బహిరంగంగానే మద్దతు పలికారు. ఇక సోషల్ మీడియా మేనేజ్ మెంట్‌తో అదానీ గ్రూప్ కూడా ఈ పనికి పాల్పడిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సహజంగానే కేంద్రం సపోర్ట్ అదానీకి ఉంది కాబట్టి ఇంత జరిగినా బయట నుంచి వేల కోట్లను అతి తక్కువ షేర్లు అమ్మి రాబట్టుకోగలుగుతున్నారు. చాలా స్పష్టంగా తాము అక్రమాలకు పాల్పడి జాతీయవాదం మాటున దాక్కుంటున్నారని అర్థమైపోతుంది

కవిత కూడా తెలంగాణ తల వంచదు అని పోస్ట్ పెట్టడంతోనే ఆమె తనకు రక్షణగా తెలంగాణను పెట్టుకుంటున్నారని అర్థమైపోయింది. దేశంలో బీజేపీకి ఎంత బలం ఉందో తెలంగాణలో బీఆర్ఎస్‌కు అంత బలం ఉంది. బీఆర్ఎస్ గా మార్చకు ముందు తెలంగాణ అంటే టీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటే తెలంగాణ. టీఆర్ఎస్ పై ఏ ఆరోపణ వచ్చినా అది తెలంగాణపై దాడేనన్నట్లుగా చూసేవారు. టీఆర్ఎస్ కాకుండా ఎవరు ఏ పార్టీలో ఉన్నా తెలంగాణేతరులు అన్నట్లుగా విమర్శించారు. ఇప్పుడు కవితకు సపోర్ట్ గా అదే తెస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు వెంట పడుతూంటే తెలంగాణను అడ్డం పెట్టుకున్నారు. కవితపై వచ్చిన ఆరోపణలు తెలంగాణలోనివి కాదు ఢిల్లీలోనివి. ఏ ఆధారాలు లేకుండా కవితకు సంబంధం లేకుండా కవితను రాజకీయ కారణాలతో ఇరికించే ప్రయత్నం చేస్తే న్యాయపరంగా పోరాడేంత కాన్ఫిడెన్స్ చూపించి ఉండేవారు. కానీ తెలంగాణను అడ్డం పెట్టుకోవడంతో ఏదో లింక్ ఉందని ఎక్కువ మంది నమ్మడానికి అవకాశం ఏర్పడుతోంది.

దేశంలో వ్యక్తులు చేసే తప్పులు లేదా అవినీతిపై కేసులు పెట్టడం లేదా ప్రశ్నించడం. దేశం లేదా రాష్ట్రంపై దాడి కానే కాదు. ఇలాంటి వాదనలతో వారు తప్పించకునే ప్రయత్నం చేశారంటే ఖచ్చితంగా వారు తప్పు చేశారనే భావన ఏర్పడుతుంది. అధికారం అండగా కొన్నాళ్లు బయటపడవచ్చు కానీ తర్వాతైనా శిక్ష అనుభవించాల్సిందే. భారత ప్రజాస్వామ్యంలో శిక్షలు ఆలస్యం అవ్వవొచ్చు కానీ తప్పించుకోలేరు. చరిత్ర చెప్పింది ఇదే. ఈ శిక్ష న్యాయస్థానాలు వేయవచ్చు ప్రజలు కూడా వేయవచ్చు.