కేంద్రం విపక్షాలపై ఎన్నడూ లేని విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఎనిమిది పార్టీల నాయకులు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు . వీరు మోదీకి విపక్షమే కానీ కొంత మంది అధికారపక్షాలు ఉన్నాయి. కేసీఆర్ మమతా బెనర్జీ కేజ్రీవాల్ ఆయా రాష్ట్రాల్లో అధికారపక్షాలు కేంద్రం దగ్గరకు వచ్చే సరికి విపక్షాలు. అయితే ఇక్కడ తమపై వేధింపులు ఉన్నాయని వీరు ఉమ్మడిగా లేఖ రాశాయి. ప్రజాస్వామ్య మనుగడకు ప్రతిపక్షాలు క్రీయాశీలకంగా ఉండాలని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటూ ప్రతిపక్ష నాయకులు ఆ లేఖలో ప్రధాని ని కోరారు. మరి ఇలా కోరిన వారు నిజంగానే రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నారా.
పవన్ ఈజ్ నో పవర్ అన్లెస్ ఇట్ ఈజ్ మిస్ యూజ్డ్ అండ్ అబ్యూజ్డ్ అని రాజకీయాల్లో అనుకుంటూ ఉంటారు. దుర్వినియోగం చేయకపోతే ఆ అధికారం అధికారమే కాదు. ఎవరు చేయరు అధికార దుర్వినియోగం అనే ప్రశ్నలు సహజంగానే వినిపిస్తూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజ్యాలలోని ప్రతిపక్షాల మీద ఇలా దుర్వినియోగం చేస్తూనే ఉన్నాయి. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అధికార పక్షమే. వీరు మరి వీరు చేతిల్లో ఉన్న పోలీసు, దర్యాప్తు సంస్థల్ని తమ విపక్షాలపై ప్రయోగించడం లేదా అని ప్రశ్నించుకుంటే నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని చెప్పుకోవాలి. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల్ని నిర్వీర్యం చేయడానికి వారిపై ఎన్ని రకాల కేసులు పెట్టాలో అన్నీ పెట్టి నిఘా సంస్థల్ని పోలీసుల్ని ఎంతగా దుర్వినియోగం చేయాలో అంతా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరి అప్పుడు విపక్షాల హక్కులు గుర్తుకు కాలేదా అనే ప్రశ్నలు సహజంగానే వస్తాయి.
ఇక మమతా బెనర్జీ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఆ రాష్ట్ర వ్యవహారాలపై తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. విపక్షమైన బీజేపీ నేతలు గగ్గోలు పెడుతూంటారు. ఇటీవల పంజాబ్ లో అధికారం చేపట్టిన భగవంత్ మాన్ ఉద్దేశపూర్వకంగా సెక్యూరిటీ తీసేయడంతో కాంగ్రెస్ నేత ప్రముఖ సింగల్ ను దుండగులు హత్య చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే తమ చేతిలో ఉన్న దర్యాప్తు సంస్థలు, పోలీసుల్ని విచ్చలవిడిగా వాడుకున్నారు. తమపై కేంద్రం ప్రయోగిస్తూంటే ప్రజాస్వామ్య హక్కుల గురించి చెబుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓ సినిమాలో డైలాగ్ చెప్పినట్లు తుపాకీ ఎవరి చేతిలో ఉంటే వారు చెప్పేది నిజం. అధికారం ఎవరి చేతుల్లో ఎక్కువ ఉంటే వారు చేసేదే కరెక్ట్. ఇలాంటి అధికారంలో ఉన్న వారు అనుకున్నంత కాలం ఈ వ్యవస్థ మారదు.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత ముందుకెళ్లింది. విపక్షాలను పూర్తి స్థాయిలో దర్యాప్తు సంస్థలతో కార్నర్ చేస్తుందనేది కళ్ల ముందు కనిపించే నిజం. ఎనిమిది సంవత్సరాల ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 124 CBI కేసుల్లో 118 ప్రతిపక్షాల నాయకుల మీదనే మోపబడ్డాయి. 121 E.D కేసుల్లో 115 విపక్ష నేతలపైనే ఉన్నాయి. ఏదయినా తనదాకా వస్తే కాని నొప్పి తెలియదన్నట్లుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలు పెడబొబ్బలు పెడుతున్నారు. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొడుతుందన్నట్లుగా ఎవరికి ఎక్కువ అధికారం ఉంటే వారిదే కర్రపెత్తనం కేసులన్నట్లుగా వ్యవస్థ మారిపోయింది. ఈ పాపం ఎవరిది అంటే అధికారం చేతికి అందగానే కన్నూమిన్నూ కానరాకుండా ప్రత్యర్థుల్ని అధికారబలంతో ఏదో చేయాలనుకునే వారి వల్లే వస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష పార్టీల నేతలు ఉంటే టీఆర్ఎస్ లో ఉండాలి లేకపోతే ఎన్ని రకాల వేధింపులు ఉంటాయో అన్నట్లుగా రాజకీయం చేశారు. ఇందులో పోలీసుల పాత్ర దర్యాప్తు సంస్థల పాత్ర కొట్టి వేయలేం. ఇప్పుడు ఏపీలో అంతకు మించి జరుగుతోంది కేంద్రం కూడా అంతే.
ఇలా అన్ని రాజకీయ పార్టీల వారు ఎవరికి వారు తాము అధికారం అందగానే ప్రతీకారం కోసం రంగంలోకి దిగుతున్నారు. ఈ రోజు బాధలు పడిన వారు రేపు రంగంలోకి దిగకుడా ఉంటారా అధికారం అందితే తమకు చూపించిన లెక్కల కన్నా రెండింతల లెక్కలు విపక్షంగా మారిన అధికారపక్షంకి చూపిస్తారు. ఇందులో ఎవరు నష్టపోతారు ఎవరు లాభపడతారు అన్న సంగతి పక్కన పెడితే దేశ ప్రజాస్వామ్యమే బలహీనం అవుతుంది. ఏ ప్రభుత్వం అయినా ప్రజాస్వామ్య స్ఫూర్తిని వీడకుండా ఉంటే ప్రభు త్వం గౌరవం మరింత పెరుగుతుంది. అన్ని ప్రభుత్వాలకూ ఇది వర్తిస్తుంది. తాము మాత్రం వేధింపులకు పాల్పడతాం తమపై వేధింపులకు పాల్పడకూడదంటే ఎలా అందుకే రాజకీయనేతలంతా మారాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.