నారా లోకేష్ పాదయాత్ర అనగానే టీడీపీ సీనియర్లు చాలామంది ఉలిక్కిపడ్డారు. ఈ దెబ్బతో పెనంమీంచి పొయ్యిలో పడతామేమోనని భయపడ్డారు. ఎందుకంటే అమ్మ పుట్టిల్లు మేనమామకెరుకన్నట్లు అధినేత పుత్రరత్నం గురించి దగ్గరగా చూసినవాళ్లందరికీ బాగా తెలుసు కానీ వద్దంటే అబ్బాయ్ ఆగడుగా మొదలుపెట్టేశాడు. నీరసంగా చప్పగా మొత్తానికి 500కిలోమీటర్లు పూర్తిచేసుకుంది లోకేష్ పాదయాత్ర. వయసులో ఉన్నాడు తిరగనీ ఇంకాస్త స్లిమ్ అవుతాడనుకుంటే నడవడంతోనే ఆగడంలేదా యాత్ర అక్కడక్కడా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నా పోయిన ఎన్నికల్లో కేవలం 23 సీట్లే వచ్చినా (అందులో సగంమంది జారిపోయారు) చాలా నియోజకవర్గాల్లో టీడీపీలో గ్రూపు గొడవలకు కొదవలేదు. నువ్వానేనా అంటూ పదులసంఖ్యలో నియోజకవర్గాల్లో తమ్ముళ్లు కుమ్ములాడుకుంటున్నారు. వైసీపీ మీద వ్యతిరేకత ఉందనీ ఈసారి టీడీపీకి ఛాన్సుందనే నమ్మకమో జనసేన కలిసొస్తే ఎలాగైనా గట్టెక్కుతామన్న ధైర్యమోకానీ చింతచచ్చినా పులుపుమాత్రం ఇంకా అలాగేఉంది. రేపు జనసేనతో నిజంగా పొత్తు కుదిరితే ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ ఇవ్వాల్సి వస్తుందో తెలీదు. చంద్రబాబు కూడా యూత్ యూత్ అంటున్నారు. వాళ్లకెక్కడ ఇస్తారో క్లారిటీ లేదు.
ఇక అధికారపార్టీ ఎత్తుగడలు అభ్యర్థులను బట్టి వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇవేమీ పట్టనట్లు పాదయాత్రలో కొన్నిచోట్ల లోకేష్ అభ్యర్థుల్ని ప్రకటించేస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పుడే అభ్యర్థులను ప్రకటించడమంటే కొరివితో తలగోక్కోడమే కుమ్ములాటలు పెరిగే ప్రమాదం ఉంది. అధినేతే అబ్బాయ్‌కి అపరిమిత స్వేచ్ఛనిచ్చాడ నేను చెప్పినా నాన్న చెప్పినా ఒక్కటేనని అబ్బాయ్ అనుకుంటున్నాడోగానీ అక్కడక్కడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కొన్నిచోట్ల అభ్యర్థులను ప్రకటిస్తుండటంతో అక్కడ అసంతృప్తి రాజుకుంటోంది. ప్రకటించని చోట టిక్కెట్‌పై అనుమానాలతో నేతలు డీలాపడుతున్నారు. దీంతో లోకేష్ పాదయాత్ర వల్ల లాభం జరుగుతోందా నష్టం జరుగుతోందా అన్న డైలమాలో పడుతున్నారు పార్టీ సీనియర్లు. టిక్కెట్ వస్తుందో రాదో తెలీనప్పుడు పార్టీకోసం పనిచేయడానికి జేబునుంచి ఖర్చుపెట్టుకోడానికి ఎవరూ సిద్ధపడరు. దీంతో టీడీపీకి లోకేష్ రూపంలో నష్టమే ఎక్కువగా జరుగుతోంది.
లోకేష్ వీక్నెస్ కనిపెట్టేసిన కొందరు షార్ట్ కట్లో టిక్కెట్ కొట్టేసే ప్రయత్నాల్లో ఉన్నారు. చంద్రబాబుని నమ్ముకునేకంటే లోకేష్ దృష్టిలో పడితేనే తమకు మేలు జరుగుతుందన్న ధోరణితో కొందరున్నారు. టీడీపీలో ఈ కొత్త ధోరణి సహజంగానే సీనియర్లను బాధిస్తోంది. పుత్రోత్సాహంతో అధినేత కొడుకుకి పెత్తనమిస్తే కొంప మునుగుతుందంటున్నారు సీనియర్లు.