రఘువీరారెడ్డి కిరణ్‌ కుమార్ రెడ్డి మళ్లీ యాక్టివ్ అవుతున్నారా

By KTV Telugu On 10 March, 2023
image

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో కీలక మంత్రిపదవులు నిర్వర్తించి రాజకీయాల్లో హుందాగా వ్యవహరించిన నేతల్లో ఇద్దరి ఆచూకీ అంతు చిక్కకుండా పోయింది. వారిలో ఒకరు అనంతపురం జిల్లాకు చెందిన నీలకంఠాపురం రఘువీరారెడ్డి కాగా రెండో నేత చిత్తూరు జిల్లాకు చెందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. రఘువీరా రెడ్డి అయితే అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి గెలిచారు రఘువీరారెడ్డి. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు గెలిచిన రఘువీరారెడ్డి దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి మంత్రి వర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవహరించారు. పార్టీలో సీనియర్ నేతగా ఆయన అంటే అందరికీ గౌరవ మర్యాదలు ఉండేవి. వై.ఎస్.ఆర్. మరణానంతరం కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రి వర్గాల్లోనూ రఘువీరా రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయ జీవితం తల్లకిందులైపోయింది.

2014 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే మొదటి ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ ఏపీలో అడ్రస్ లేకుండా పోయింది. విభజన పట్ల ఆగ్రహంతో ఉన్న ఆంధ్రా ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేశారు. ఆ తర్వాత అయిదేళ్ల పాటు పిసిసి అధ్యక్షుడిగా కొనసాగిన రఘువీరా రెడ్డి 2019 ఎన్నికల్లో అయినా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నారు. 2019 ఎన్నికల ముందు ఏపీలో బానే యాక్టివ్ గా తిరిగారు. అయినా లాభం లేకపోయింది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభంజనం ముందు కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండో సారి ఒక్క సీటు కూడా గెలవకుండా ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. అంతే ఎన్నికల ఫలితాలు రావడంతోనే రఘువీరా రెడ్డిలో నిర్వేదం నైరాశ్యం అలుముకున్నాయి. అయితే వాటిని బయట పెట్టుకోకుండా పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఏకంగా రాజకీయాలకే దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత రఘువీరా రెడ్డిని ఎవరూ చూడలేదు. ఆయన గ్రామంలో మాత్రం స్థానికులకు రఘువీరారెడ్డి నిత్యం అందుబాటులోనే ఉంటున్నారు. కాకపోతే అత్యంత నిరాడంబరంగా పంచె కట్టి పొలానికి వెళ్లి వ్యవసాయ పనులు చూసుకోవడం గ్రామంలో దేవాలయాన్ని నిర్మించి ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో రఘువీరా రెడ్డి బిజీగా ఉన్నారు.

ఇక ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టరు అనుకుంటోన్న తరుణంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో అత్యంత కీలక కమిటీకి రఘువీరా రెడ్డిని నియమించింది కాంగ్రెస్ నాయకత్వం. మరి రానున్న రోజుల్లో రఘువీరారెడ్డి మళ్లీ యాక్టివ్ అవుతారా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఏమన్నా లోక్ సభ నియోజక వర్గం నుండి పోటీ చేస్తారా అన్న అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఏపీలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం కోలుకోలేదు. గత మూడున్నరేళ్లలో ఏపీలో జరిగిన ప్రతీ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో పార్టీ శ్రేణుల్లోనూ నైరాశ్యం అలుముకుంది. మరి ఇపుడు రఘువీరా రెడ్డిని కాంగ్రెస్ హై కమాండ్ ఏ లక్ష్యంతో కీలక కమిటీకి నియమించిందో అర్ధం కావడం లేదంటున్నారు రాజకీయ పండితులు. ఒక వేళ 2018 ఎన్నికల్లో తెలంగాణాలో టిడిపితో పొత్తు పెట్టుకున్నట్లే 2024 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ టిడిపితో జట్టు కడుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో టిడిపి-కాంగ్రెస్ రెండూ కూడా ఏ మాత్రం సిగ్గు పడకుండా శత్రుత్వాలు పక్కన పెట్టి జట్టు కట్టాయి కాబట్టి మరోసారి రిపీట్ అయితే ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ఇక ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చిట్ట చివరి ముఖ్యమంత్రి గా చరిత్ర సృష్టించిన నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.
చిత్తూరు జిల్లా వాయిల్పాడు నియోజకవర్గం నుండి 1989,1999, 2004 ఎన్నికల్లో గెలిచిన కిరణ్‌ కుమార్ రెడ్డి 2009లో పీలేరు నియోజకవర్గం నుండి గెలిచి వై.ఎస్.ఆర్. కేబినెట్ లో చీఫ్ విప్ గా వ్యవహరించారు. వై.ఎస్.ఆర్. కు విధేయంగా ఉండే వారని పేరు. కిరణ్‌ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్ నాయకుడే. ఆయన దివంగత ప్రధాని పి.వి.నరసింహారావు కేబినెట్ లో మంత్రిగా వ్యవహరించారు. తండ్రి మరణానంతరం జరిగిన ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2009లో వై.ఎస్.ఆర్. అకాల మరణం అనంతరం ముందుగా రోశయ్యను సిఎంని చేసిన కాంగ్రెస్ హై కమాండ్ కొంత కాలానికే కిరణ్ కుమార్ రెడ్డిని సిఎంని చేసింది. నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన వెంటనే ముఖ్యమంత్రి పదవికి ఎమ్మెల్యే గిరీకీ రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు.

ఆ పార్టీ తరపున 2014 ఎన్నికల్లో అభ్యర్ధులను బరిలో దింపారు కూడా. అయితే ఆ ఎన్నికల్లో ఘోర పరాజయాలతో చాలా కాలం మౌనంగా ఉండిపోయారు. 2019 ఎన్నికలకు ఏడాది ముందు కిరణ్ కుమార్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి తిరిగి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను ఏపీ ప్రజలు తిరస్కరించడంతో తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన బిజెపిలో చేరతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఎందుకో కానీ అలా జరగలేదు. ప్రస్తుతం పాత సీనియర్ల వెంట పడుతోన్న కాంగ్రెస్ అధిష్ఠానం కిరణ్‌ కుమార్ రెడ్డిని కూడా టచ్ లో ఉంచుకుందని అంటున్నారు. రఘువీరా రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ కూడా వై.ఎస్.ఆర్. తో సన్నిహితంగా నమ్మకంగా ఉండేవారు. అయితే ఆయన తనయుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని స్థాపించినపుడు మాత్రం వీళ్లు అందులో చేరలేదు. నిజానికి రఘువీరా రెడ్డి వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది కానీ అది నిజం కాలేదు.