చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని అధికారంలో ఉన్న వాళ్లు అంటారు. ఆ చట్టం పాలకులకు దగ్గరి చుట్టంలా వ్యవహరిస్తుందని విపక్షాలంటాయి. చట్టానికి కుల మత వివక్షలే కాదు లింగ వివక్ష కూడా ఉండదంటున్నారు పాలకులు. అయితే అధికారంలో ఉన్న వారి జోలికి మాత్రం ఆ చట్టం పోదని విపక్షాలంటున్నాయి. వీటిలో ఏది నిజమో తెలీక జనం అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె కల్వకుంట్ల కవిత ప్రమేయం కూడా ఉందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తోంది. ఈ కేసులోనే విచారించడానికి కవితకు సమన్లు జారీ చేసింది కూడా. ఈ నెల 11న విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని కవిత చేసిన అభ్యర్ధనను ఈడీ ఆమోదించింది. ముందస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందునే గడువు కోరారు కవిత. ఈడీ దూకుడు చూస్తోంటే కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బి.ఆర్.ఎస్. నేతలు కూడా అదే భావిస్తున్నారు. ఎందుకంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్ధులపైకి ఈడీ సీబిఐ ఐటీ లను పంపి దాడులు చేయిస్తోందన్నది వారి ఆరోపణ. అయితే ఈ బెదిరింపులకు అరెస్టులకు కూడా తాము భయపడేది లేదని బిజెపికి తలవంచేదీ లేదని బి.ఆర్.ఎస్. నేతలు స్పష్టం చేస్తున్నారు. అటు కవిత కూడా తన తండ్రిని రాజకీయంగా ఏమీ చేయలేకనే తనను కేసులో ఇరికించారని ఆరోపిస్తున్నారు.
తెలంగాణా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎమ్మెల్యేల బేరసారాలాడించిన బిజెపి ఆ కుట్ర భగ్నం కావడంతోనే ఈడీ చేత సమన్లు పంపిందని నిజానికి ఇవి మోడీ సమన్లను బి.ఆర్.ఎస్. నేత మంత్రి కేటీయార్ దుయ్యబడుతున్నారు. మహిళా దినోత్సవం రోజునే కవితకు సమన్లు జారీ చేయడం పై బి.ఆర్.ఎస్. మహిళా నేతలు మండి పడుతున్నారు. అయితే చట్టాలకు ప్రత్యర్ధులకూ కూడా లింగ వివక్ష ఉండదంటున్నారు రాజకీయ పండితులు. ఇక్కడ కవితకు సమన్లు పంపినట్లు బిహార్ లో మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి ఇంట్లో సిబిఐ బృందాలు సోదాలు చేస్తున్నాయి. రబ్రీదేవిని కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. రబ్రీదేవి భర్త లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీ పార్టీకూడా నరేంద్ర మోదీని మొదట్నుంచీ వ్యతిరేకిస్తోంది. అందుకే లాలూ కుటుంబాన్ని టార్గెట్ చేశారని ఆర్జేడీ నేతలు ఆరోపిస్తున్నారు.
లాలూను చాలా కాలం జైల్లో ఉంచారు. ఇపుడు రబ్రీదేవిని కూడా జైలుకు పంపుతారా లేదా అన్నది చూడాలి.
మహిళలు అయినా తమ రాజకీయ ప్రత్యర్ధులైతే టార్గెట్ చేసుకోవడమే వారి లక్ష్యం అంటున్నారు బాధితుల తరపు నేతలు. అయితే తప్పు చేసేసి ఆ తర్వాత మేం మహిళలం మమ్మల్ని ఏమీ చేయకూడదు అంటే ఎలా కుదురుతుందని పాలక పక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.
మహిళలను అరెస్టులు చేయడం మన దేశంలో కొత్తేమీ కాదు కదా. తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలితను ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ఆమె జైలుకు వెళ్లాల్సి రావడంతోనే ముఖ్యమంత్రి పీఠంపై తనకు విధేయుడైన పన్నీరు సెల్వాన్ని కూర్చోబెట్టి ఆమె నిర్భయంగా జైల్లో కాలక్షేపం చేశారు. పన్నీరు సెల్వం కూడా జయలలిత ఫోటోను సిఎం కుర్చీలో పెట్టి తాను వేరే కుర్చీలో కూర్చుని పాలన సాగించారు. జయలలితతో పాటు ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న సహనిందితురాలు శశికళను కూడా చట్టం వదల్లేదు. జయలలిత మరణానంతరం ఆసుపత్రి వేదికగానే ముఖ్యమంత్రి అయిపోడానికి శశికళ అన్నీ సిద్ధం చేసుకుంటోన్న తరుణంలోనే నిను వీడని నీడను నేను అంటూ పాత కేసు ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. దాంతో ఆమె తాను వచ్చే దాకా ముఖ్యమంత్రి సీటును జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి తనకు విధేయుడైన పళని స్వామిని సిఎంని చేసి అక్కడి నుండి అలా నేరుగా జైలుకు వెళ్లారు.
ఇటీవలి తమిళనాడు ఎన్నికల సమయంలోనే ఆమె జైలు నుండి విడుదలై మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుదామనుకున్నారు కానీ ఆమె సిఎం పదవి కట్టబెట్టిన పళనిస్వామే ఆమెకు ఎదురు తిరగడంతో పార్టీకి ఆమె దూరంగా ఉండిపోవలసి వచ్చింది. ఇదే తమిళనాడులో అన్నాడిఎంకే కి రాజకీయ ప్రత్యర్ధి అయిన మరో ద్రవిడ పార్టీ డిఎంకే అధినేత కరుణానిథి గారాల పట్టి కనిమొళి కూడా చట్టం నుండి తప్పించుకోలేకపోయారు. యూపీయే టూ పాలనలో ఆమె టూ జీ స్కాంలో కీలక పాత్ర పోషించారని పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించుకుని ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆమె అరెస్ట్ అయి జైలకు వెళ్లారు. చిత్రం ఏంటంటే యూపీయే ప్రభుత్వంలో అపుడు డిఎంకే భాగస్వామ్య పక్షమే అయినా దర్యాప్తు సంస్థల దూకుడును ఎవరూ అడ్డుకోలేకపోయారు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లోనూ అంతే మాజీ ముఖ్యమంత్రి బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిపైనా కేసులు నమోదయ్యాయి. తాజ్ కారిడార్ కేసుతో పాటు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి బి.ఎస్.పి. పార్టీ గుర్తు అయిన ఏనుగు విగ్రహాలను విచ్చలవిడిగా పెట్టించారని మాయావతిపై కేసులు నమోదయ్యాయి. అయితే ఆ తర్వాత ఆమె బిజెపికి సరెండర్ అయిపోవడం వల్లనే ఆమెపై కేసుల వేడి లేకుండా పోయిందని అంటారు. లేదంటే లాలూ ప్రసాద్ యాదవ్ తరహాలోనే మాయావతి కూడా సుదీర్ఘ కాలం జైల్లో గడపాల్సి వచ్చేదని అంటారు.
బిఎస్పీ నేతలు మాత్రం దళిత నాయకురాలు కాబట్టే మాయావతిపై అక్రమ కేసులు బనాయించారని మాయావతి తప్పు చేశారనడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదని వాదిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపుల వల్లనే మాయావతి తీవ్ర మానసిక క్షోభ అనుభవించారని వారు ఆరోపిస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనీ చట్టం వదల్లేదు. ఆమె ప్రభుత్వ హయాంలో శారదా చిట్స్ స్కాం ఒకటి వెలుగులోకి వచ్చింది. అలాగే నారదా స్కాం కూడా వచ్చింది. ఆ రెండు కుంబకోణాల్లోనూ మమతా బెనర్జీని అరెస్ట్ చేయడం ఖాయమని ప్రచారం జరిగింది. అయితే ఆమెపై ఆరోపణలకు సాక్ష్యాలు లేకపోవడంతో ఆమె పార్టీ నేతల అరెస్టులతో ఆగిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలపై ఈడీ సీబీఐ ఐటీ దాడులు జరిగాయి. అయితే వాటిలో ఎన్ని రాజకీయ కక్షసాధింపులో భాగంగా జరిగాయో ఎన్ని నిజాయితీగా జరిగాయో తేలాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎమర్జెన్సీ అనంతరం దివంగత ప్రధాని ఇందిరా గాంధీకి కూడా జైలు శిక్ష తప్పలేదు. అయితే ఆమె జైలు నుండి విడుదల అయ్యాక మళ్లీ ఫీనిక్స్ పక్షిలా పైకి లేచి పూర్వ వైభవం పొందగలిగారు. అంచేత కేసులు, అరెస్టులు, జైలు శిక్షల్లో మహిళలనూ వేధిస్తూనే ఉంటారని చట్టాలు తమ పని తాము చేసుకోక తప్పదని అంటున్నారు.