ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో సీఐడీ విచారణని వేగవంతం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ స్కాంలో కీలకపాత్ర పోషించిన సీమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్ని సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. మాజీ ఎండీ అర్జా శ్రీకాంత్‌ని సుదీర్ఘంగా విచారించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నైపుణ్య శిక్షణ (స్కిల్ డెవలప్మెంట్) పేరుతో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్లు నిగ్గుతేలటంతో ఇందులో ప్రమేయం ఉన్న అందరినీ విచారించేలా సీఐడీ స్పీడ్ పెంచింది.
భాస్కర్‌ను నోయిడాలో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చారు సీఐడీ పోలీసులు. స్కిల్ డెవలప్మెంట్ ఎండీగా 2019 మార్చి నుంచి 2021 ఫిబ్రవరిదాకా ఉన్న శ్రీకాంత్‌ని అవకతవకలపై ప్రశ్నించారు. సీఐడీ అధికారుల విచారణలో సీమెన్స్‌తో పాటు షెల్ కంపెనీల వివరాలు కూడా రాబట్టినట్లు తెలిసింది. శ్రీకాంత్ ఎంక్వయిరీ సమయంలోనే ఐటీ అధికారులు కూడా సీఐడీ కార్యాలయానికి వచ్చారు. జీఎస్టీ ఎగవేతల్లో సీమెన్స్ భాగోతం బయటపడటంతో జరిగిన లావాదేవీలపై ఆదాయపన్నుశాఖ అధికారులు కూడా సీఐడితో వివరాలు పంచుకున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రాజెక్టు ధరను అమాంతం పెంచేయటంలో భాస్కర్ కీలకపాత్ర పోషించినట్లు నిర్ధారణకు వచ్చారు.
సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిన సాఫ్ట్వేర్ ధర కేవలం రూ. 58 కోట్లు. కానీ అంచనాలను తారుమారు చేసి 3300 కోట్లుగా మార్చిపారేశారు. ప్రాజెక్టు వ్యయాన్ని అసాధారణంగా పెంచేయటంతో 10 శాతం చెల్లింపుల కింద ఏపీ ప్రభుత్వంపై అదనంగా 371 కోట్ల రూపాయల భారం పడింది. 2015 జూన్‌లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆర్థికలావాదేవీల్లో అవకతవకలు జరిగాయని సీఐడీ గుర్తించింది. యూపీ క్యాడర్ ఐఏఎస్‌గా ఉన్న భార్య అపర్ణను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ సీఈఓగా నియమించుకునేందుకు అప్పటి సీఈఓ సుబ్బారావుతో భాస్కర్ ముందుగానే ఒప్పందం చేసుకున్నట్లు సీఐడీ విచారణలో తేలింది. ప్రాజెక్ట్ ద్వారా నిధుల మళ్లింపు కోసం వాడుకున్న షెల్ కంపెనీల్లోనూ భాస్కర్ పాత్రే కీలకమని గుర్తించింది. ఈ కేసులో మరికొందరు కీలక వ్యక్తుల పేర్లు తెరపైకొచ్చేలా ఉన్నాయి.