ముసిముసి న‌వ్వుల న‌రేష్‌.. సిగ్గుల మొగ్గ ప‌విత్ర‌

By KTV Telugu On 11 March, 2023
image

సామాన్యుడైనా సెల‌బ్రిటీ అయినా వ్య‌క్తిగ‌త జీవితాల్లో స‌వాల‌క్ష ఉంటాయి. అంద‌రి జీవితం సాఫీగా సాగాల‌ని లేదు. ప్ర‌తివారి పెళ్లిబంధం ప‌దికాలాలు నిల‌వాల‌ని లేదు. కొన్ని బంధాలు చివ‌రిశ్వాస దాకా బలంగా ఉంటాయి. కొన్ని కొన్నేళ్ల‌కే తెగిపోతుంటాయి. సామాన్యుడి బ‌తుకు నాలుగ్గోడ‌లు దాట‌దు. అదే సెల‌బ్రిటీ జీవితంలో ప్ర‌తీదీ ప‌బ్లిక్ అవుతుంది. అల‌నాటి హీరో కృష్ణ కొడుకు న‌టుడు న‌రేష్ మ‌రో పెళ్లి చేసుకున్నాడు ఆయ‌న‌కిది నాలుగోపెళ్లి. ఇద‌న్నా సుఖాంతం అవుతుందో లేదో చెప్ప‌లేంగానీ మొత్తానికి మూడు ముళ్లు వేసేశాడు న‌రేష్‌. మూడో భార్య ఉండ‌గానే భ‌ర్త‌తో సాంకేతికంగా విడిపోని ప‌విత్ర మెడ‌లో మూడుముళ్లువేశాడు న‌రేష్‌. పెళ్లి వీడియోని చూసిన‌వాళ్లంతా ముసలోడికి ద‌స‌రాపండ‌గంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇర‌వై పాతికేళ్ల వ‌య‌సులో పెళ్లిచేసుకునే జంట ఎలా ఫీల‌వుతుందో అంత‌కంటే ఎక్కువే ఫీలైపోయారు ఇద్ద‌రూ. బుగ్గ‌న దిష్టిచుక్క‌తో న‌రేష్ ముసిముసి న‌వ్వులు న‌వ్వుతుంటే కొత్త పెళ్లికూతురిలా సిగ్గుల మొగ్గ‌యిపోయింది ప‌విత్ర‌.

ఈ వీడియో చూసిన‌వాళ్లు పాల‌గ్లాసుతో ప‌విత్ర గ‌దిలోకి అడుగుపెట్టే దృశ్యం కూడా చూడాల్సి వ‌స్తుందేమోన‌ని టెన్ష‌న్ ప‌డ్డారు. థాంక్‌గాడ్‌ అక్క‌డిదాకా రాలేదు. త‌ప్పేంలేదు ఏ వ‌య‌సులో ఏ ముచ్చ‌ట‌యినా తీర్చుకోవ‌చ్చు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. కానీ ఎప్పుడూ ఏ భార్య కూడా రోడ్డెక్క‌లేదు. ఆయ‌న్ని రోడ్డుమీదికి లాగ‌లేదు. కానీ న‌రేష్ విష‌యం అలాకాదు. మూడో భార్య ర‌మ్య ర‌ఘుప‌తి ఎదురుప‌డితే కొట్టేందుకు రెడీ అవుతోంది. మీ బ‌తుకు బ‌స్‌స్టాండ్ చేస్తానంటోంది. ఇలాంటి టైంలో సైలెంట్‌గా స‌హ‌జీవ‌నం చేసుకోకుండా ఈ పెళ్లిగోలేంట్రా బాబూ అంటున్నారంతా. న‌రేష్‌కు భార్య‌ ర‌మ్యతో వివాదం ఇంకా కొన‌సాగుతోంది. ఈ స‌మ‌యంలో పెళ్లిచేసుకుని వీడియో రిలీజ్ చేయ‌డం సంసారంలో నిప్పులు పోసుకోవ‌డ‌మే.

ఒక పవిత్ర బంధం రెండు మనసులు మూడు ముళ్లు ఏడు అడుగులు మీ ఆశీస్సులు కోరుకొంటూ నరేష్‌ పవిత్ర అన్న కామెంట్‌తో విడుద‌ల‌చేసిన వీడియో మీద వెంట‌నే మాట మార్చారు న‌రేష్‌. ఇద్ద‌రూ ఏదో రోజు పెళ్లిచేసుకోవ‌డం ఖాయ‌మ‌నే అంతా అనుకున్నారు. అందుకే వీడియో చూసిన‌వాళ్ల‌కి ఏ డౌటూ రాలేదు. కానీ అది తామిద్ద‌రం న‌టించిన పెళ్లి సీన్ అంటున్నారు న‌రేష్‌. పెళ్లి భోజనం ఎప్పుడు పెడతార‌ని అడిగిన ప్రశ్నకు డొంక తిరుగుడుగానే స్పందించారు. పెళ్లి పూర్తిగా వ్యక్తిగత విషయం అంటూ దాట‌వేశారు. అంటే సినిమా ప్ర‌చారం కోసం కూడా న‌రేష్ వ్య‌క్తిగ‌త జీవితాన్ని ముడిపెట్టిన‌ట్లుంది. లీగ‌ల్ ఇష్యూస్ రాకుండా న‌రేష్ అంద‌రినీ గంద‌ర‌గోళంలో ప‌డేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

న‌రేష్‌కి ఎట్టి ప‌రిస్థితుల్లో విడాకులు ఇవ్వ‌న‌ని ప‌విత్ర‌తో అత‌ని పెళ్లి జ‌ర‌గ‌నివ్వ‌న‌ని ర‌మ్య శ‌ప‌థం చేసింది. త‌న ఇంటిపై కొంద‌రు దుండ‌గులు దాడి చేశార‌ని ఈ ఘ‌ట‌న వెనుక ర‌మ్య ఉన్న‌ట్టు న‌రేష్ ఫిర్యాదు చేశారు. అంత‌కుముందు న‌రేష్‌ ప‌విత్ర బెంగ‌ళూరు హోట‌ల్ గ‌దిలో ఉన్న‌ప్పుడు కూడా ర‌మ్య ర‌ఘుప‌తి వెళ్లి గొడ‌వ‌చేస్తే పోలీసులు కంట్రోల్ చేయాల్సి వ‌చ్చింది. డ‌బ్బు కోసమే ర‌మ్య త‌న‌ను వేధిస్తోంద‌న్న‌ది న‌రేష్ ఆరోప‌ణ‌. మాన‌సిక ప్ర‌శాంతత కంటే డ‌బ్బు ముఖ్య‌మా. న‌రేష్‌కి డ‌బ్బు ఏమ‌న్నా కొద‌వా మాట్లాడి సెటిల్ చేసుకోకుండా రోజూ ఈ పంచాయితీలేంటో ప‌విత్ర‌తోనైనా ప్ర‌శాంతంగా ఉండాలంటే ఏంచేయాలో న‌రేష్‌కి తెలీద‌నుకోలేం. ఆయ‌నంతే అదో టైపు.