తెలుగు రాష్ట్రాల్లో ఈడీ వేడి మొదలైందా

By KTV Telugu On 24 August, 2022
image

తెలంగాణలో ఈడీ వేడి మొదలైపోయిందా ? సీబీఐ ఎంక్వైరీలతో రాజకీయం హీట్ పెరగబోతోందా ? ఢిల్లీలో ఆప్ నేత సిసోడియా కేసు తవ్వుతున్న కొద్దీ ఆ మూలాలు తెలంగాణలో బయటపడుతున్నాయని నిఘా వర్గాలు నేరుగా చెప్పడం, కేసీఆర్ కూతురు కవిత, ఇతర సన్నిహితుల ప్రమేయం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ వరస చూస్తే విచారణల రాజకీయం తెలంగాణలో హీటు పెంచడం ఖాయం అనిపిస్తోంది. అటు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్టుండి ఢిల్లీ వెళ్లడానికి ఈ కేసులకి కూడా లింక్ ఉందన్న టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇంతకీ మేటర్ ఏంటి ? ఢిల్లీ – పంజాబ్ లిక్కల్ స్కామ్ లో ఉన్న ఏపీ, తెలంగాణ లీడర్లు ఎవరెవరు ? ఏం జరగబోతోంది ?

కేసీఆర్ కుటుంబం మీద నిఘా వర్గాలు గురి పెట్టాయ్ ! ఈడీ, సీబీఐ దర్యాప్తులు కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మీద దృష్టి సారించబోతున్నాయ్. ఆల్రెడీ ఢిల్లీలో ప్రకటనలు వచ్చేశాయ్. పంజాబ్ లిక్కల్ స్కామ్ లో కీలకంగా ఉన్న చెద్దాతో టీఆర్ఎస్ నాయకురాలు కవితకు సంబంధాలు ఉన్నాయని, ఓబెరాయ్ హోటల్లో అనేక దఫాలు మీటింగులు జరిగాయని కూడా నిఘా వర్గాలు మీడియాకు చెప్పడం చర్చనీయం అవుతోంది.

పరిస్థితులు చూస్తే ఇలాగే కనిపిస్తున్నాయ్. బీజేపీ రాజకీయ దండయాత్ర చేయాలనుకున్న రాష్ట్రాల్లో సీబీఐ, ఈడీ దాడులు జరుగుతాయ్ అని విపక్ష పార్టీలు ముందు నుంచి ఆరోపణలు చేస్తాయ్. కానీ ఇక్కడ పంజాబ్-ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆధారాలు కూడా ఉన్నాయని, కవిత పేరు కూడా బయటకు రావడం రాజకీయంగా మరింత చర్చనీయం అవుతోంది. టీఆర్ఎస్ ను ఓడించేది మేమే అని బీజేపీ ఓ పక్కన చెబుతున్న సమయంలో… ఈ విచారణలు రాజకీయాన్ని మలుపు తిప్పుతాయా అనేదే ప్రశ్న.

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు. పంజాబ్, ఢిల్లీలో లిక్కర్ టెండర్లలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న సిసోడియా మీద ఆరోపణ. ఏపీ ఎంపీలు నేతల ప్రమేయంపై జోరుగా ప్రచారం. అంటే ఢిల్లీ స్కామ్ లో తీగ లాగితే తెలుగు రాష్ట్రాల్లో డొంక కదులుతున్నట్టు కనిపిస్తోంది.

దర్యాప్తుల ఉచ్చు బిగుసుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి జగన్ ఢిల్లీ వెళ్లడం చర్చనీయం అవుతోంది. ఇద్దరు తమ పార్టీ ఎంపీల పేర్లు ఉండటం, వాళ్లతోపాటు, కేసీఆర్ కూతురు కవిత కూడా సిసోడియాతో అనేకసార్లు సమావేశం అయ్యారన్న ఆధారాలు బయటపడటం జరిగాక జగన్ ఢిల్లీ టూర్ మీద ఆసక్తి పెరుగుతోంది.

రాజకీయంగా హీటు పెరిగిపోతోంది. అదే అదునుగా బీజేపీ రంగంలోకి దిగింది. మరికొన్ని పేర్లు తొందరలో బయటకు రాబోతున్నాయి అని, టీఆర్ఎస్ నేతలతోపాటు, కేసీఆర్ కుటుంబ సభ్యులు మరికొందరు కూడా విచారణలు ఎదుర్కోబోతున్నారని బీజేపీ అంటోంది.

బీజేపీని ఢిల్లీలో తుడిచిపెట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ, సామాన్యుడి గుండె చప్పుడు తెలుసు అంటూ వచ్చిన ఆ పార్టీ ఇప్పుడు సొంతనేత సిసోడియాపై అవినీతి ఆరోపణలు వచ్చే సరికి డిఫెన్స్ లో పడింది. బీజేపీ కుట్ర ఇదంతా అని పైకి చెప్పొచ్చు. కానీ పంజాబ్ లిక్కర్ స్కామ్ లో కొన్ని ఆధారాలు కూడా ఉండటం ఇక్కడ కీలక విషయం. అందుకే ఢిల్లీతోపాటు పంజాబ్ లోనూ ఆప్ ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ ఈ స్కామ్ ను వాడే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో సెంటిమెంట్ తో బలంగా ఉన్న టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను ఢీ కొట్టేందుకు కవితపై కేసులు అస్త్రం అవుతాయనేది బీజేపీ ఆశ.

ఏమవుతుందనేది ముందు ముందు చూడాలి. ఆరోపణలు చేసి, దర్యాప్తు, విచారణలు సాగించి కేసీఆర్ కుటుంబాన్ని ఇరుకున పెడితే రాజకీయంగా లాభం అనేది బీజేపీ ఐడియా. కేసీఆర్ పాలనపై ఉన్న వ్యతిరేకత తమకి కలిసి వస్తుందని – ఆరోపణలను ప్రజలు నమ్ముతారని బీజేపీ ఆశ పడుతోంది. మరి ఇదే కేసుల్ని సింపథీ కోసం కేసీఆర్ వాడుకోగలరా అనేది చూడాలి. బీజేపీ ఎక్కడ కాలు పెట్టినా… అక్కడ ఈడీ కేసులు ఆరోపణలు కామన్, ఇది కూడా అలాంటి కుట్రే అని కేసీఆర్ కనుక జనంలోకి తీసుకెళ్ల గలిగితే పరిణామాలు మరోలా ఉండే అవకాశం ఉంటుందేమో !