తమ్ముడు టీడీపీలో అన్న బీజేపీలో

By KTV Telugu On 11 March, 2023
image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దూకుడున్న నాయకుడు. ఎవరినీ లెక్కచేయని తత్వం ఆయనది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన కుటుంబానికి మంచి పేరే ఉంది. తండ్రి అమర్ నాథ్ రెడ్డి కాంగ్రెస్ లో మంత్రిగా చేశారు. కిరణ్ తల్లి కూడా ఒక సారి ఎమ్మెల్యేగా సేవలందించారు. తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి నాలుగు సార్లు గెలిచారు.

కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్పీకర్ గా చేశారు. వైఎస్ మరణ తర్వాత మారిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. సీఎంగా రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు కిరణ్ అన్ని ప్రయత్నాలు చేశారు. విభజనను ఆపి తీరుతామని ఆయన సవాలు చేశాయి. ఆ ప్రక్రియలో ఆయన ఫెయిల్ అయ్యారనుకోండి. ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగి 2014 ఎన్నికల ముందు జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. అయితే ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఆ పార్టీ రద్దు చేసి 2018లో మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ చాలా రోజులుగా గాలం వేస్తున్నట్లు సమాచారం. రాజకీయాల్లో దూకుడున్న నాయకులనే ఎంచుకునే పార్టీ కావడంతో కిరణ్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. కిరణ్ కూడా రెండో సారి కాంగ్రెస్ లో చేరిన తర్వాత హస్తం పార్టీలో ఇమడలేకపోయారు. పైగా తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారనుకుంటే రుద్రరాజుకు కట్టబెట్టారన్న అసంతృప్తి కూడా ఆయనలో ఉంది.

కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఏపీలో కమలం పార్టీకి మంచి నాయకుడు అవసరమైంది. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడిపై కబ్జా ఆరోపణలు రావడం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న పేరు ఉండటంతో నాయకత్వ మార్పుపైనా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. పైగా ఎంత ప్రయత్నించినా ఆంధ్రప్రదేశ్లో పార్టీ అభివృద్ధి చెందడం లేదన్న ఆందోళన బీజేపీ పెద్దల్లో కనిపిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లోనైనా పాగా వేస్తున్నాం ఏపీలో మాత్రం ఎందుకు బలపడలేకపోతున్నామని తర్జన భర్జనలు పడుతున్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు కావడం కూడా ఇబ్బందికరంగా మారింది. దానితో పేరున్న ఓటర్లను ప్రభావితం చేయగల నాయకుడి కోసం పార్టీ చేపట్టిన వెదుకులాట కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఆగింది. కిరణ్ కుమార్ రెడ్డి వెనుకా ముందు ఆలోచిస్తున్న తరుణంలోనే బీజేపీ రెండు ఆఫర్లిచ్చినట్లు సమాచారం. రాజ్యసభ సీటు ఇస్తామన్నది మొదటి ఆఫర్ గా చెబుతున్నారు. అవకాశం చూసుకుని ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని కూడా కట్టబెడతామని చెప్పారట. ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను ఆయనపై పెడతారని అంటున్నారు.

నిజానికి కాంగ్రెస్ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం టీడీపీ వైపు మొగ్గుచూపింది. తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డితో పాటు చాలా మంది అనుచరులు పచ్చ కుండువా కప్పుకున్నారు. పీలేరు టీడీపీ ఇంఛార్జ్ గా ఉన్న కిషోర్ కుమార్ ను ఇటీవలే పిలేర్ అభ్యర్థిగా ప్రకటించారు. నారా లోకేష్ యువగళం యాత్రలో భాగంగా ఈ ప్రకటన వెలువడింది. రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో పాటు కిషోర్ కు పీలేరులో మంచి పేరు ఉండటంతో గెలుపు కూడా సులభమే అనుకున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ కూడా టీడీపీ వైపు మొగ్గు చూపడం లేదా మౌనంగా ఉండిపోవడం లాంటివి చేస్తారని భావించారు. అయితే ఆయన బీజేపీని ఎంచుకున్నారు. కిరణ్ కు చంద్రబాబు నాయుడు అంటే పడదని చాలా కాలంగా వినిపిస్తున్న వాదన. ఒక జిల్లాకు చెందిన నేతలు కావడంతో మాట పడక దూరం పెరిగిందని చెబుతారు. పైగా కిరణ్ తండ్రి కాంగ్రెస్ నాయకుడు కావడం కిరణ్ కూడా తండ్రి అడుగుజాడల్లో నడవడంతో ఎప్పుడూ టీడీపీ వైపు మొగ్గు చూపలేదు. ఇప్పుడు అమిత్ షా సమక్షంలో కిరణ్ బీజేపీలో చేరిన తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా సాగుతుందో చూడాలి.