రాజకీయం కూడా ఓ క్రీడే. అందుకే చాలా మంది క్రీడాకారులు తమ స్పోర్ట్స్ కెరీర్ ముగిశాక సరదాగా కాలక్షేపం కోసం రాజకీయాల్లో అడుగు పెట్టి ఆడేస్తూ ఉంటారు. ఆట ఆడ్డం రావాలి కానీ ఏ ఆట అయితే ఏంటి అంటున్నారు రాజకీయ క్రీడా రంగ నిపుణులు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న తెలంగాణాలో బరిలో దిగాలని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ముచ్చట పడుతున్నారు. మన దేశంలో సినిమాల నుండి క్రీడల నుండి వచ్చిన ప్రముఖులు రాజకీయాల్లోనూ హల్ చేస్తూనే ఉన్నారు. నచ్చిన పార్టీలు కటాక్షిస్తే చట్టసభల్లో అడుగు పెడుతున్నారు. తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని తహ తహ లాడుతున్నారు మహమ్మద్ ఆజారుద్దీన్.
క్రికెట్ కెరీర్ లో అంతర్జాతీయ స్థాయిలో మొదటి మూడు టెస్టుల్లోనూ మూడు సెంచరీలు కొట్టి ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నారు అజారుద్దీన్. మణికట్టు మాయాజాలంతో బంతిని బౌండరీ తరలించే అజారుద్దీన్ సొగసైన బ్యాటర్. భారత జట్టుకు ఎన్నో కీలక విజయాలు అందించిన దిగ్గజం కూడా. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లో ఇరుక్కోవడంతో క్రికెట్ కు దూరమైన అజారుద్దీన్ చాలా కాలం తర్వాత రాజకీయాల్లో చేరారు. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఆదేశిస్తే నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నుండి పోటీ చేస్తానని తాజాగా అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. అంటే తన మనసులో మాట బయట పెట్టుకున్నారు. కామారెడ్డిలో ముస్లిం ఓటర్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అందుకే ఆయన ఈ నియోజకవర్గాన్ని ఎంచుకుని ఉంటారు. గతంలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ రెండు సార్లు గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.
1989లో మొదటి సారి షబ్బీర్ అలీ కామారెడ్డి నుండి గెలిచారు. ఆ తర్వాత 2004లో వై.ఎస్.ఆర్. ప్రభంజనంలో రెండో సారి గెలిచారు. 2009 ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి గంప గోవర్ధన్ ఈ నియోజక వర్గంలో పాగా వేశారు. 2012లో గంప గోవర్ధన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణా ఉద్యమంలో చేరారు. ఆ వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన టి.ఆర్.ఎస్. అభ్యర్ధిగా గెలిచారు. ఇక అప్పట్నుంచీ ఇప్పటి వరకు గంప గోవర్ధనే కామారెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వరుసగా ఓటమి చెందుతూ వస్తోన్న షబ్బీర్ అలీ స్థానంలో పోటీ చేయాలన్నది అజారుద్దీన్ ఆలోచనా లేక పార్టీ నాయకత్వమే అలా ఆలోచన చేస్తోందా అన్నది తేలాల్సి ఉంది. అజారుద్దీనే కాదు చాలా మంది క్రికెటర్లు ఏదో ఒక పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగి చట్టసభలో అడుగు పెడుతున్నారు. వాళ్లల్లో క్రికెటర్లే కాదు ఇతరులూ ఉన్నారు. షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ బిజెపి తరపున జైపూర్ రూరల్ నుండి పోటీ చేసి గెలిచారు.
మహమ్మద్ అజారుద్దీన్ గతంలో మొరాదాబాద్ నుండి పోటీ చేశారు. క్రికెటర్ కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ముందుగా బిజెపిలోనూ ఆ తర్వాత కాంగ్రెస్ లోనూ చేరి ఎంపీ అయ్యారు. మరో క్రికెటర్ కీర్తి ఆజాద్ ఢిల్లీలోని గోలే మార్కెట్ నియోజకవర్గం నుండి బిజెపి తరపున పోటీ చేసి గెలిచారు. ఐపీఎల్ లో స్టార్ గా వెలుగుతోన్న క్రికెటర్ మనోజ్ తివారీ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. 2011 క్రికెట్ వరల్డ్ కప్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ గౌతమ్ గంభీర్ బిజెపి తరపున తూర్పు ఢిల్లీ నుండి పోటీ చేశారు. మరో క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఉత్తర ప్రదేశ్ లోని ఫూల్ పూర్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. బాక్సర్ విజేంద్ర సింగ్ కాంగ్రెస్ తరపున దక్షిణ ఢిల్లీ నుండి పోటీ చేశారు.
వెటరన్ క్రికెటర్లలో దివంగత మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో కొనసాగారు. వీరిలో కొందరు గెలిచారు. కొందరు తృటిలో ఓటమి చెందారు. కాకపోతే విజయవంతంగా రాజకీయాల్లో మాత్రం కొనసాగుతున్నారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అయితే స్పోర్ట్స్ కోటాలో రాజ్యసభకు నామినేట్ అయ్యి అయిదేళ్ల పాటు ఎంపీగా కొనసాగారు. ఆటగాళ్లు ఉత్సాహంగా ఉంటారు. వాళ్లే రాజకీయాల్లోకి రావడం వల్ల క్రీడలకు మేలే జరుగుతుంది దానికి నిదర్శనం రాజ్యసింగ్ వర్ధన్ రాథోడే. ఒలింపిక్స్ లో భారత్ కు బంగారు పతకాన్ని అందించిన రాథోడ్ నరేంద్ర మోదీ కేబినెట్ లో 2014లో సమాచారా ప్రసార శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు. 2017లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయన ఏకంగా క్రీడాశాఖ మంత్రిగా నియమితులయ్యారు.