ఆహార యుద్ధం రాబోతోందా..

By KTV Telugu On 25 August, 2022
image

ఉక్రెయిన్‌లో యుద్ధం వస్తే ఇండియాలో సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రెట్టింపయింది. అదే సమయంలో గోధుమల కొరత ఏర్పడుతుందేమోనని ప్రభుత్వం ఎగుమతులు నిలిపివేసింది. ఎక్కడో యుద్ధం వస్తే మన దేశంలో ఆహారపదార్థాలపై అలజడి ఎందుకు ?. ఎందుకంటే అక్కడ రష్యా యుద్ధం చేస్తున్నది ఉక్రెయిన్ మీద మాత్రమే కాదు .. ఇండియాపై కూడా. ఉక్రెయిన్ , ఇండియాపైనే కాదు.. ఉక్రెయిన్ తో పాటు రష్యా నుంచి ఆహారపదార్థాల దిగుమతుల మీద ఆధారపడుతున్న ప్రతీ దేశం మీద యుద్ధం జరుగుతున్నట్లే. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగితేనే ఇలా ఉంటే..ఇక తైవాన్ విషయంలో అమెరికా, చైనా క్షిపణులు కురిపించుకుంటే ఏం జరుగుతుంది ? ప్రపంచంపై ఆకలి యుద్ధం ప్రకటించినట్లేనా ? ఆకలితో లక్షల మంది తనువులు చాలించాల్సిందేనా ?

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఆకలి మంటలు ప్రారంభమయ్యాయి. ఐదు నెలల కిందటే ఐక్యరాజ్యసమితి చీఫ్ ఈ విషయాన్ని ప్రకటించారు. దానికి తగ్గట్లే ఇప్పుజు ప్రపంచవ్యాప్తంగా నేడు ఆహార సంక్షోభం ముసురుకుంటోంది. ఉక్రెయిన్ నుంచి ప్రపంచవ్యాప్తంగా సన్ ఫ్లవర్ , బార్లీ, గోధుమలు వంటివి ఎగుమతి అవుతూ ఉంటాయి. అదే సమయంలో రష్యా నుంచి కూడా పెద్ద ఎత్తున ఆహారధాన్యాలు ఇతర దేశాలకు వెళ్తూ ఉంటాయి. ప్రపంచం మొత్తం మీద సన్ ఫ్లవర్ ఎగుమతుల్లో ఈ రెండు దేశాలదే 87 శాతం వాటా. అయితే యుద్ధం కారణంగా సప్లయ్ చైన్స్ విచ్చిన్నమయ్యాయి. ఉక్రెయిన్‌ సాగురంగం సగానికి సగం నిర్వీర్యమయింది. 59 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేని దుస్థితి నెలకొంది. వ్యవసాయ మౌలిక వసతులపై బాంబుల వర్షం కురిపిస్తూ, పొలాలను రష్యా సైన్యం తగలబెట్టేసింది. ఆ దేశం నుంచి పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికాలకు వెళ్ళాల్సిన రెండు కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఎడతెగని యుద్ధం మూలంగా పంపలేకపోతున్నాయి. ఫలితంగా నలభై కోట్లమంది ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ేర్పడింది. అదే సమయలో ఆంక్షలు విధించడం .. సప్లయ్ చైన్స్ దెబ్బతినడం వల్ల గోధుమలతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువుల ఎగుమతుల్లో మంచి వాటా కలిగిన రష్యా నుంచీ సరఫరాలు దెబ్బతిన్నాయి.

యుద్ధభయం కారణంగా చాలా దేశాలు తమ ప్రజల ఆకలి తీర్చాలంటూ రక్షణాత్మక ధోరణితో వ్యవహరిస్తున్నాయి. తమ సాగు ఉత్పత్తుల ఎగుమతులను నియంత్రిస్తున్నాయి. ఈ కారణంగా ఆహారాన్ని పొందడం పేద, అల్పాదాయ దేశాలకు తలకు మించిన భారమవుతోంది. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి. గోధమలు, బార్లీ, ఇతర ధాన్యాలు దశాబ్దం క్రితంతో పోలిస్తే 37శాతం అధికంగా ఖరీదయ్యాయి. 36 దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణం 16శాతానికిపైగా ఎగబాకింది. ఆకలి తీర్చుకోవాలంటే తమ సంపాదనలో యాభై శాతానికి పైగా వెచ్చించాల్సిన దుర్భరావస్థలో బతుకులీడుస్తున్న పేద కుటుంబాలు ఆకలి చావులకు గురయ్యే పరిస్థితి యేర్పడింది. మూడోవంతు ప్రపంచ జనాభా ఒక మోస్తరు నుంచి తీవ్ర ఆహార అభద్రతను ఎదుర్కొంటోందని ఐక్యరాజ్య సమతి చెబుతోంది.

అయితే ఇదంతా ఆహారయుద్ధం కిందకే వస్తుంది. తమకు శత్రువు అయిన దేశాల ప్రజలకు ఆహారం అందకుండా చేయడం ద్వారా వారి దేశంలో చావులను చూడటం కూడా యుద్ధంగానే కొన్ని దేశాలు భావిస్తున్నాయి. ఇది ఈనాటి యుద్ధ వ్యూహం కాదు. హిట్లర్ జమానాలోనే ఇది జరిగింది. హిట్లర్ శత్రు దేశాల సైన్యం.. ప్రజలకు ఆహారం అందకుండా చేయడం ద్వారా లక్షల మంది చనిపోవడానికి కారణమయ్యారు. నిజానికి యుద్ధ ఆయుధంగా ఆహారపదార్థాలను వాడుకోవడం.. యుద్ధ నేరం. ఈ విషయంలో అంతర్జాతీయ చట్టాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ రష్యా చేస్తోంది ఇప్పుడు ఉక్రెయిన్‌పై ఆహారయుద్ధమే. ఉక్రెయిన్ ప్రజలు ఆహారం లేక అలమటిస్తున్నారు. ఇరవై లక్షలకు మందికిపైగా రష్యాకు వలస వెళ్లారు. ఆహార ఉత్పత్తి తగ్గిపోవడంతో ఉక్రెయిన్ ప్రజలు ఆకలితో అలమటిస్తారని.. చావులూ ఉంటాయని అంతర్జాతీయంగా విశ్లేషణలు వస్తున్నారు. ఇది ఆహాయుద్ధమే. కానీ రష్యాను యుద్ధ నేరం చేస్తున్నట్లుగా ఎవరూ చెప్పడం లేదు.

రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిస్థితే ఇలా ఉంటే .. తైవాన్ విషయంలో తేల్చుకుందామంటూ రెచ్చిపోతున్న అమెరికా, చైనాల మధ్య నిజంగా యుద్ధం వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ? ఈ ఆలోచనే భయం పుట్టించడం ఖాయం. ఎందుకంటే ఈ రెండు దేశాల నుంచే ఆహారం అత్యధికంగా ఎగుమతి అవుతోంది. చిన్నస్థాయి సంక్షోభం కూడా ప్రపంచ ఆహారోత్పత్తిపై పెను ప్రభావం చూపుతుందని ఉక్రెయిన్ యుద్ధమే నిరూపించింది. అదే అమెరికా-రష్యా మధ్య ఘర్షణ చోటు చేసుకుంటే.. 90 శాతం వ్యవసాయం పడిపోతుంది. ప్రపంచంలో ఉపయోగించే నలభై శాతం కార్న్ , 34 శాతం సోయా అమెరికాలో పండుతుంది. ప్రపంచంలో ఉపయోగించే 30 శాతం బియ్యం, 18 శాతం గోధుమలు చైనాలో పండుతుంది. వీటి ఎగుమతులపై ఆధారపడే దేశాలు ఆకలి దుప్పుల్లో ఉండిపోతాయి. ఆ దేశాలే .. ఆ యద్ధంపై ప్రభావం ప్రపంచం అంతటా పడుతుంది. దీని ఐదు వందల కోట్ల మంది వరకూ చనిపోతారన్న అంచనా కూడా ఉంది.