బీజేపీకి వస్తే నల్లారి జాతకం మారుతుందా

By KTV Telugu On 12 March, 2023
image

వైఎస్‌ మరణానంతరం నక్కతోక తొక్కినట్లు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆ పదవ మూడ్నాళ్ల ముచ్చటే. ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేయలేకపోయారు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి. ఆయనక ఆ అవకాశం కూడా రాలేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకుందామన్నట్లే సాగిపోయింది ఆయన హయాం. గుర్తుంచుకోడానికేం లేదు. అప్పుడప్పుడూ కేసీఆర్‌ పార్టీ అప్పట్లో అసెంబ్లీలో ఆయన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచారని చెప్పుకోవడం తప్ప కిరణ్‌కుమార్‌ రెడ్డి గురించి చర్చించుకున్నవాళ్లేలేరు. కొన్నాళ్లుగా ఆయన ఏ పార్టీలో ఉన్నారో అసలు రాజకీయాల్లో ఉన్నారో లేదో కూడా తెలియనంతగా తెరమరుగయ్యారు. ఇప్పుడు సడెన్‌గా ఓ వార్త. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పబోతున్నారని. అవునా ఆయన ఇప్పటిదాకా మన పార్టీలో ఉన్నారా అని కాంగ్రెస్‌వాళ్లే మొహాలు చూసుకునే పరిస్థితి.
మాజీ ముఖ్యమంత్రి వెళ్లిపోయినంత మాత్రాన కాంగ్రెస్‌కొచ్చిన నష్టమేం లేదు. అసలు ఏపీలో కాంగ్రెస్‌ ఉనికే అంతంతమాత్రంగా ఉంది. ఇప్పుడాయన వెళ్లిపోతున్నాడని కాంగ్రెస్‌ కంగారుపట్టానిక్కూడా ఏమీ లేదు. కాంగ్రెస్‌కి రాజీనామా చేస్తున్నారంటే రాజకీయంగా ఏదో నిర్ణయం తీసుకోబోతున్నారన్నమాట.

బీజేపీలో చేరాలన్న నిర్ణయానికి వచ్చారట కిరణ్‌కుమార్‌రెడ్డి. కన్నా లాంటి ముఖ్యనేత పార్టీని వీడాక బీజేపీకి కిరణ్‌కుమార్‌రెడ్డి రూపంలో ఓ కటౌట్‌ దొరుకుతోంది. కమలంతో ఆయనకు ఒరిగేదేం ఉండదు. ఆయనతో కమలానికి నాలుగు ఓట్లు పడే నమ్మకం కూడా లేదు. సొంతతమ్ముడు కిషోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలో ఉన్నా పోయిపోయి కిరణ్‌ కుమార్‌ రెడ్డి చంద్రబాబుకి జైకొట్టలేరు. కాంగ్రెస్‌లో ఉంటే పూర్తిగా తెరమరుగైపోవడం తప్ప భవిష్యత్తు లేదని అర్ధమైపోయింది. అందుకే ఆయన బీజేపీలో చేరుతున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ 2014లోనే కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. అంతటి భావోద్వేగాల సమయంలోనూ ఆయన పార్టీని ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత మళ్లీ పాత గూటికి చేరినా కాంగ్రెస్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా లేరు కిరణ్‌కుమార్‌రెడ్డి. ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీ రాయలసీమలో పార్టీని యాక్టివ్‌ చేసేందుకు ఆయన ఎంతోకొంత పనికొస్తాడని భావించినట్లుంది. ఆర్నెల్లుగా జరుగుతున్న ప్రచారానికి చివరికి తెరదించినట్లయింది. ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆ స్థాయిలో గౌరవం పదవి ఇచ్చి ఆయన సేవల్ని వినియోగించుకుంటామని బీజేపీ అధినాయకత్వం ఆయన్ని ఒప్పించినా కమలంలో కిరణం ఎంతవరకు వికసిస్తుందన్నది అనుమానమే.

తెలుగురాష్ట్రాల్లో రెడ్డి సామాజికవర్గంపై గురిపెట్టింది బీజేపీ. ఆ సామాజికవర్గంలో కిరణ్ కుమార్ రెడ్డికి కొంత పట్టుంది. అనివార్య పరిస్థితుల్లో ఏదో ఒక పార్టీ నీడన ఉన్న ఆ సామాజికవర్గ నేతలను ఓ చోటికి చేర్చాలన్నది కమలం పార్టీ వ్యూహం. దానికి సరైన నాయకుడికోసం చూస్తున్న బీజేపీకి ఉన్నంతంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారినే బెస్ట్‌ ఆప్షన్‌గా కనిపించారు. రాష్ట్రవిభజనని వ్యతిరేకిస్తూ సీఎం పదవికి రాజీనామా చేసిన నాయకుడిగా ఆయనమాటకు విలువుందన్న ఆలోచనతో బీజేపీ ఉంది. అందుకే కిరణ్‌కుమార్‌రెడ్డికున్న క్రెడిబిలిటీ తనకు కలిసొస్తుందని భావిస్తోంది. ఇప్పటిదాకా జాతీయపార్టీలోనే రాజకీయాలు నెరిపిన కిరణ్‌కుమార్‌రెడ్డి తన రేంజ్‌కి తగ్గట్లు మరో జాతీయపార్టీని ఎన్నుకున్నారు. రాజకీయాలకు పూర్తిగా దూరమైపోతారనుకున్న సమయంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవటం ఆసక్తిరేపుతోంది. కొత్త పార్టీ ఆయన సేవల్ని ఎలా వాడుకుంటుందన్నదానిపైనే కిరణ్‌కుమార్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది.