తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. గతంలో పరిణామాలను మరిచిపోయి రెండు తెలుగు రాష్ట్రాల్లో పుంజుకోవాలని వ్యూహం పన్నుతోంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి జనంలో తగ్గిన పాపులారిటీ ఆధారంగా అక్కడ వచ్చే ఎన్నికల్లో గెలవాలన్న తపన పార్టీ నేతల్లో కనిపిస్తోంది. చంద్రబాబు కూడా రోజుకో కార్యక్రమం నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో టచ్ లో ఉంటున్నారు. లోకేష్ యువగళం పాదయాత్రతో పార్టీ కార్యకర్తల్లో జోష్ పెరిగింది.
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పరిస్థితి ఆశాజనకంగా ఉన్నప్పటికీ తెలంగాణలోనే అనుమానాస్పదంగా తయారైంది. రాష్ట్రంలో పుంజుకునేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తెలంగాణలో పునరుజ్జీవం కోసం ఖమ్మం సభతో శ్రీకారం చుట్టిన మాట వాస్తవం. హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు చంద్రబాబుకు భారీ స్వాగతం లభించింది. బహిరంగ సభకు కూడా లక్షలాది మంది తరలి వచ్చారు. తెలంగాణ శాఖ కొత్త అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సూపర్ సక్సెస్ అని చెప్పుకున్నారు. తర్వాతేమి జరిగిందో తెలంగాణలో టీడీపీ వేగం ఎందుకు జరిగిందో ఆలోచించాల్సిన అంశమేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఖమ్మం సభ ఇచ్చిన జోష్ ను తెలంగాణ టీడీపీ కొనసాగించలేకపోయింది. ఇంతకాలం నిద్రానంగా పడున్న కేడర్ ను తట్టిలేపి వారిలో ఉత్సాహాన్ని నింపలేకపోయింది. కాసాని జ్ఞానేశ్వర్ వరుస కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నారు. నిజానికి తెలంగాణలో చక్రం తిప్పాలని ఆలోచన వచ్చినప్పుడు ఐదు ఉమ్మడి జిల్లాలపై టీడీపీ దృష్టి పెట్టింది. హైదరాబాద్ రంగారెడ్డి ఖమ్మం నల్లొండ నిజామాబాద్ జిల్లాలో లీడర్లు కేడర్ కలిసి 30 సీట్ల వరకు గెలిపిస్తారని అప్పుడు తదుపరి అసెంబ్లీలో తమకే అవకాశం ఉంటుందని టీడీపీ అంచనా వేసుకుంది. పరిస్తితి మాత్రం అందుకు భిన్నంగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారైంది.
ఖమ్మం సభ ఏర్పాటు చేసినప్పుడు ఐదు చోట్ల భారీ బహిరంగసభలకు ప్లాన్ చేశారు. తర్వాత ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ద్వితీయ శ్రేణి నేతల నుంచి సరైన స్పందన లేకపోవడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. చరిత్రలో గుర్తుండిపోయే విధంగా హైదరాబాద్ లో సభ పెట్టాలనుకున్నారు. ఆ పని ఎందుకు చేయలేకపోయారో తెలీదు. ఇటీవల కాసాని జ్ఞానేశ్వర్ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ విధానాలు ఎన్నికల్లో గెలిచిన తర్వాత చేపట్టబోయే కార్యక్రమాలు వివరించేందుకు ఇంటింటికి తెలుగుదేశం ప్రారంభించారు. అయితే పట్టుమని పది మంది తెలుగు తమ్ముళ్లు కూడా రాకపోవడంతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం వెలవెలబోతోంది. నాయకులు వెంటబడి పిలిస్తే చిన్న గ్రూపు వచ్చి ఏదో మొక్కుబడిగా నాలుగు వీధులు తిరిగి వెళ్లిపోతోంది. అనుకూల మీడియా కూడా ఆ కార్యక్రమానికి పెద్దగా ప్రచారం ఇవ్వడం లేదు.
ఏపీ పరిణమాలే తెలంగాణలో టీడీపీ ఇబ్బందులకు కారణమని భావిస్తున్నారు. చంద్రబాబు తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. వైసీపీ రోజు వారీ టీడీపీ నేతలను రెచ్చగొట్టడంతో ఏపీపైనే ఏకాగ్రత చూపాల్సి వస్తోంది. వారానికి రెండు సార్లయిన చంద్రబాబు ఏపీకి వెళ్లాల్సి వస్తోంది. చంద్రబాబు వెళ్లినప్పుడల్లా ఆయన్ను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నించడం దానికి టీడీపీ కౌంటర్ ఇవ్వడం లాంటి చర్యల కారణంగా టైమ్ మొత్తం అక్కడే సరిపోతోంది. పైగా ఏపీలో ఇంకా మిత్రపక్షాలెవరో తేలలేదు. దానితో ఆంధ్రప్రదేశ్లోని ప్రతీ నియోజకవర్గాన్ని చంద్రబాబు స్వయంగా అధ్యయనం చేయడం అక్కడ నాయకులతో రోజువారీ టచ్ లో ఉండటం లాంటి చర్యలు తప్పడం లేదు. చేతికి రాబోతున్న ఏపీని చేజార్చుకోవడం చంద్రబాబుకే కాదు ఎవరికీ ఇష్టం ఉండదు.
తెలంగాణలో టీడీపికి సరైన నాయకుడు లేడు. టీడీపీ తరపున ఖమ్మం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్లు కూడా టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. ఎల్ రమణ లాంటి బలమైన నాయకులు ఎమ్మెల్సీ పదవి కోసం కారెక్కారు. దానితో ఇప్పుడు పార్టీకి కేడర్ ఉన్నా లీడర్లు లేని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా ఏపీపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. చంద్రబాబు కుటుంబంలో వేరెవ్వరూ తెలంగాణలో పనిచేసేందుకు ఇష్టపడటం లేదు. నందమూరి సుహాసినికి అంత సీన్ లేదు. ఏడు పదులు దాటిన చంద్రబాబు ఒకేసారి రెండు రాష్ట్రాలపై దృష్టి పెట్టలేకపోతుంటే టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా వయోభారంతో ఇబ్బంది పడుతున్నారు. నడవలేకపోతున్నారు. మాట్లాడలేకపోతున్నారు.
నిజానికి తెలంగాణలో పార్టీలు ఎక్కువగానే ఉన్నా పొలిటికల్ వ్యాక్యూమ్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య రసవత్తర పోరు నడుస్తోంది. కొత్తగా వచ్చిన వైఎస్పార్టీపీ నాయకురాలు షర్మిల పాదయాత్రలు, ఆరోపణలతో వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా జనంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతమంది ఉన్నా జనానికి ఏదో వెలితి కనిపిస్తోంది. కొత్త నాయకత్వాన్ని కోరుకుంటోంది. మరి టీడీపీ ఆ సంగతిని అర్థం చేసుకుని రాజకీయ పథక రచన చేసుకుంటే తెలంగాణలో మనుగడకు అవకాశం ఉంటుందనేందుకు సందేహించాల్సిన పనిలేదు.