హిట్ కోసం కొత్త దారులు

By KTV Telugu On 23 August, 2022
image

సినిమా సక్సెస్ కోసం షారుఖ్ ఖాన్ కొత్త ట్రెండ్ ఎంచుకున్నారా.. లాల్ సింగ్ చద్దా బాయ్ కాట్ ఆధారంగా గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారా.. నిషేధం, బహిష్కరణ పేరుతోనే పఠాన్ సక్సెస్ అవుతుందా… పబ్లిసిటీలో ఇదో సక్సెస్ ఫుల్ ఫార్ములాగా మారుతుందా…ఇండస్ట్రీలో ఇప్పుడు జరుగుతున్నదేమిటి…

చాలా రోజుల తర్వాత షారుఖ్ ఖాన్ మళ్లీ సినిమా చేస్తున్నాడు. పఠాన్ పేరుతో సినిమా రాబోతోంది. 250 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమా మరో రెండు నెలల్లో ధియేటర్లలో రానుంది. అయితే ఇప్పుడే దానిపై ఒక వివాదం చెలరేగింది. పఠాన్ మూవీని బాయ్ కాట్ చేయాలంటూ ట్విటర్ ఇతర సామాజిక మాధ్యమాల్లో కొందరు నెటిజెన్స్ పిలుపునిచ్చారు. సినిమా పోస్టర్ పై బాయ్ కాట్ అన్న ముద్ర వేసిన ఫోటో ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది. దేశంలో అసహనం పెరిగిపోతోందని గతంలో షారుఖ్ చేసిన కామెంట్స్ ను మళ్లీ పోస్టు చేస్తూ… అలాంటి వ్యక్తి సినిమా సక్సెస్ కాకూడదని కొందరు నెటిజెన్స్ వాదిస్తున్నారు. ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డాను కూడా ఇదే తరహాలో బాయ్ కాట్ చేశారు. ఆ కారణంగానో లేక సినిమా బాగోలేకపోవడం వల్లనో లాల్ సింగ్ చడ్డా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇప్పుడు పఠాన్ కూడా అదే బాటలో నడవాలని షారుఖ్ వ్యతిరేకులు కోరుకుంటున్నట్లుగా చర్చ జరుగుతోంది….

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు బాయ్ కాట్ ట్రెండ్ అమలవుతున్నట్లుగా కనిపిస్తోంది. లాల్ సింగ్ చడ్డాను అందరూ చూడాలి అని పిలుపునిచ్చినందుకు హృతిక్ రోషన్ రాబోయే సినిమా విక్రమ్ వేధాను బాయ్ కాట్ చేయాలని కొందరు కోరుతున్నారు. అయితే బాయ్ కాట్ పిలుపు కూడా ఒక పబ్లిసిటీ ట్రెండ్ అని సినీ పరిశ్రమ వర్గాలు వాదిస్తున్న మాట వాస్తవం. లాల్ సింగ్ చడ్డా తర్వాత షారుఖ్ ఖాన్ వ్యూహం మార్చి… బాయ్ కాట్ పబ్లిసిటీని అమలు చేస్తున్నారని ఇండస్ట్రీలోనే కొందరంటున్నారు. సినిమా రిలీజ్ డేట్ నాటికి బాయ్ కాట్ చర్చ తారా స్థాయికి చేరుకుని.. అసలు అందులో ఏమున్నదన్న ఉత్కంఠ పెరుగుతుంది. జనం థియేటర్లకు పరుగులు తీస్తే…. నిర్మాతకు కాసుల పంట పండుతుందన్నది వారి వ్యూహంగా చెప్పుకోవాలి….

బాలీవుడ్ పరిశ్రమ ఇప్పుడు తీవ్ర వత్తిడిలో ఉంది. బాహుబలి, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలు ఉత్తరాదిని షేక్ చేసెయ్యడం… ముంబై ఆర్టిస్టులతో తీసిన సినిమాలు అట్టర్ ప్లాప్ కావడంతో బాలీవుడ్ పెద్దలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దానితో పబ్లిసిటీ కోసం కొత్త మార్గాలు వెదుక్కోవాల్సి వస్తోంది. ఒక వర్గం వారు వ్యతిరేకించినంత మాత్రాన సినిమా ప్లాప్ అవుతుందనుకోవడం కూడా పొరపాటేనని వాళ్లు గుర్తించాలి. సినిమా బాగుందన్న మౌత్ టాక్ తోనే వందల కోట్లు వచ్చిపడతాయని అర్థం చేసుకోవాలి. ఏదేమైనా.. షారుఖ్ ఖాన్ మూవీ ప్రమోషన్ కోసం పాటిస్తున్న ట్రెండ్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి…