పాకిస్థాన్ ప్రజలు భారత్ పాట పాడుతున్నారు. అఖండ భారత్ లోనే పాకిస్థాన్ ఉండి ఉంటే తమ జీవితాలు అద్భుతంగా ఉండేవని వారు అభిప్రాయ పడుతున్నారు. నరేంద్ర మోదీ వంటి ప్రధాని ఉంటే కానీ పాకిస్థాన్ బాగుపడదని వారు చెప్పుకొస్తున్నారు. ప్రపంచ పటంలో అభివృద్దిలో భారత్ వేగంగా పరుగులు పెడుతూ ఉంటే పాకిస్థాన్ రోజు రోజుకీ పాతాళం దిశగా జారిపోతోందని వారు ఆక్రోశిస్తున్నారు. భారత్ అడుగు జాడల్లో నడవాలని వారు సూచిస్తున్నారు. మాకు ఇమ్రాన్ ఖాన్ లు నవాజ్ షరీఫ్ లు భుట్టోలు వద్దే వద్దంటున్నారు పాక్ ప్రజలు. నరేంద్ర మోదీ ఒక్కరు చాలని వారంటున్నారు. పీకల్లోతు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్న పాకిస్థాన్ లో ప్రజల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారు దాయాది దేశమైన భారత్ లో పరిస్థితులను పోల్చి చూసుకుంటున్నారు. దేశ విభజన జరిగి ఉండకపోతే బాగుండేదని తాము కూడా భారతీయులుగా ఉంటూ దేనికీ లోటు లేకుండా జీవించేవాళ్లమని పాక్ జాతీయులు భావిస్తున్నారు.
పాకిస్థాన్ లో ప్రజలు నరకయాతన పడుతున్నారు. 60ఏళ్లలో ఎన్నడూ లేనంతటి ద్రవ్యోల్బణం పాకిస్థాన్ ను దివాళా అంచున నిలబెట్టింది. పాలకులైతే ఇప్పటికే దివాళా తీసినట్లు ప్రకటించుకున్నారు కూడా. విదేశీ మారక నిల్వలు నిండుకోవడంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మధ్యతరగతి ప్రజలు కూడా రెండు పూటలా కడుపు నింపుకునే పరిస్థితి లేదక్కడ. ఆసుపత్రుల్లో ప్రాణాంతక ఔషధాలే కాదు సాధారణ మందులు కూడా లేవు. వాటిని దిగుమతి చేసుకోడానికి చేతిలో డబ్బులు లేవు. ఏం చేయాలో పాలుపోక పాక్ పాలకులు ఆర్ధిక సాయం కోసం టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల చుట్టూ తిరుగుతున్నారు. పాలకుల అనాలోచిత విధానాలు దుర్మార్గ నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కిలో చికెన్ ఖరీదు ఏడువందల రూపాయలకు పైనే. గ్యాస్ అందుబాటులో లేదు. గోధుమ పిండి లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆకలి కేకలు తప్ప ఇంకేమీ లేవు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ జాతీయుడైన సానా అంజాద్ అనే పౌరుడు పాక్ పరిస్థితికి అద్దం పట్టేలా చేసిన వ్యాఖ్యలు ప్రపచం వ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
పాక్ ను పాలించిన ప్రధానుల పేర్లను ఉటంకిస్తూ మాకు వాళ్లెవరూ వద్దు నరేంద్ర మోదీ లాంటి ఒక్కరు మాకు ప్రధానిగా ఉంటే చాలు మా పరిస్థితి మారిపోతుందని అని సానా అంజాద్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. పాకిస్థాన్ భారత్ లో భాగం అయితే బాగుండేదని కూడా సానా అన్నారు. అయితే పాకిస్థాన్ భారత్ లో విలీనం అయితే భారత పౌరులుగా ఉండడానికి మీరు ఒప్పుకుంటారా అని ప్రశ్నించగా ఎందుకు ఒప్పుకోము సంతోషంగా ఒప్పుకుంటాము. అప్పుడు భారత ముస్లింలతో సమానంగా అన్ని సదుపాయాలూ మాకూ వస్తాయి కదా అని సానా అంజాద్ అన్నారు. పాకిస్థాన్ పాలకులపైనా అక్కడి ప్రభుత్వంపైనా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. తమ పాలకుల వైఫల్యాల కారణంగానే తాము నరకయాతన పడాల్సి వస్తోందన్న ఉక్రోషం కూడా ఉంది. ప్రజల ఆకలి తీర్చే నిత్యావసర సరుకులు దిగుమతి చేసుకోడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు కానీ అమెరికా నుండి ఎఫ్.-16 యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోడానికి మాత్రం డబ్బులుంటాయని పాక్ మేథావులు మండి పడుతున్నారు.
పాక్ పౌరులే కాదు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా భారత ప్రభుత్వ ముందు చూపును భారత విదేశీ విధానాలనూ ఆకాశానికెత్తేశారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన వెంటనే అమెరికా రష్యాపై ఆంక్షలు విధించింది. రష్యా నుండి ఎలాంటి సరుకులూ దిగుమతి చేసుకోవద్దని ఆదేశించింది. అయితే భారత్ మాత్రం రష్యా నుండి చౌకగా వచ్చే చమురు వంటనూనెలు దిగుమతి చేసుకోవడం ద్వారా ఆర్దికంగా లబ్ధి పొందింది. ఈ విధానమే ఇమ్రాన్ ఖాన్ కు తెగ నచ్చేసింది. భారత్ అమెరికాలు క్వాడ్ లో భాగస్వాములు అయినప్పటికీ అమెరికా ఆదేశాలను భారత్ పక్కన పెట్టిందని పొగిడిన ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ మాత్రం తలా తోకా లేకుండా అమెరికాకు వంత పాడి ప్రజల నెత్తిన భారం పడేసిందని దుయ్యబట్టారు. భారత దేశంలో సైన్యం కూడా ఎంతో క్రమశిక్షణతో ఉంటుందని అవినీతికి తావు లేకుండా ఉంటుందని కొనియాడారు. పాకిస్థాన్ లో మాదిరిగా సైన్యం ప్రభుత్వ నిర్ణయాల్లో కానీ వ్యవహారాల్లో కానీ భారత ఆర్మీ తలదూర్చదని ఇమ్రాన్ ఖాన్ అభినందించారు. భారత పాలకుల్లా స్వతంత్రంగా ఆలోచించగల అవకాశం పాక్ లో లేదని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ పాక్ పౌరుడు సానా అంజాద్ నుండి దేశ ప్రధానిగా వ్యవహరించిన ఇమ్రాన్ ఖాన్ వరకు భారత్ పై ఉన్న ఈ సానుకూల దృక్పథం నిజంగా ప్రతీ భారతీయుణ్నీ గర్వంతో ఉప్పెంగాలా చేస్తుందంటున్నారు మేథావులు.
పాకిస్థాన్ పౌరులే కాదు పాక్ ఆక్రమిత కశ్మీరు లోని ప్రజలు కూడా పాకిస్థాన్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. అదే సమయంలో వారు పీఓకేని తక్షణమే భారత్ లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు వారు వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. మరో వైపు పాకిస్థాన్ నుండి విముక్తి కోరుకుంటోన్న బలూచిస్థాన్ లోనూ ఉద్యమ కారులు పాక్ పై భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ కు మద్దతు ఇవ్వడమే కాదు బలూచిస్థాన్ ను పాక్ కబంధ హస్తాల నుండి విడిపించేందుకు మెరుపు దాడి చేయాలని భారత్ ను కోరుతున్నారు. పాకిస్థాన్ లో అరాచకం ఆవరించుకుని ఉంది. పాలకుల వైఫల్యాలే ప్రజలకు శాపాలుగా మారాయి. దేశ ప్రజలు రకరకాల సమస్యలతో సతమతమవుతూ పాలకులను తిట్టుకుంటున్నారు. పాక్ లోనే పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే ఇంతకన్నా దుర్భరమైన పరిస్థితులు పాక్ ఆక్రమిత కశ్మీరు లో ఉన్నాయి. పాక్ ను మించిన అధ్వాన్న పరిస్థితులు పాక్ ఆక్రమిత కశ్మీరులో ఉన్నారు. ఈ ప్రాంతంలో ప్రతీ నగరంలోనూ జనం పాలకులకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. పీఓకే లో రోజులకు 18 గంటలకు పైగా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. పాక్ లో అరకొరగా ఉండే గోధుమ పిండి సరఫరా పీవోకే లో అసలు లేనే లేదు. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు పాక్ కబంధ హస్తాల నుండి బయట పడాలనుకుంటున్నారు.
భారత ప్రభుత్వం పీవోకేని భారత్ లో విలీనం చేసుకోవాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. బారత పాలనలో తమ జీవితాలు బాగు పడతాయని వారు ఆశిస్తున్నారు. దశాబ్ధాలుగా స్వతంత్ర దేశంగా అవతరించాలని ఆందోళనలు చేస్తోన్న బలూచిస్థాన్ పౌరులు కూడా భారత్ వైపు ఆశగా చూస్తున్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదులతో చేస్తోన్న దుర్మార్గాలను తిప్పికొట్టడానికి భారత ఆర్మీ చూపుతోన్న చొరవను వారు మెచ్చుకుంటున్నారు. పాకిస్థాన్ పై భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ను తాము సమర్ధిస్తున్నామని బలూచ్ ఉద్యమకారులు అంటున్నారు. అదే విధంగా తమని పాక్ నుండి విముక్తి చేయడానికి భారత ఆర్మీ మరోసారి మెరుపు దాడి చేయాలని వారు ప్రాధేయపడుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదు. పాక్ మేథావులు ప్రజలు ఇపుడిపుడే తమ దేశంలో జరుగుతోన్న తప్పేంటో గుర్తించారు. అదే సమయంలో భారత్ ప్రపంచంలో ఆర్ధిక శక్తిగా ఎలా ఎదిగిందో కూడా గమనించారు. తమ కాళ్లపై తాము నిలబడాలంటే చేయాల్సింది చాలా ఉందని పాక్ మేథావులకు తెలుసు. పాలకులకూ తెలుసు. కాకపోతే దాన్ని ఎలా కార్యాచరణలో పెట్టాలో మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదు.