చైనాలో పెళ్లి చేసుకోవడం అంటే మాటలు కాదు. ప్రత్యేకించి మగాళ్లు పెళ్లి చేసుకోవడం అంటే ఆషా మాషీ కాదు.
ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నా అమ్మాయికి ఇచ్చే కట్నానికి సరిపోదు. కట్నం ఇవ్వందే ఏ అమ్మాయీ పెళ్లికి ఒప్పుకోదు.
అందుకే ఏటా చైనా పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతోంది. వాళ్లు పెళ్లి చేసుకోవాలంటే మల్లీశ్వరి చెలికత్తె అయినా బోలెడు కట్నాలు చదివించుకోవాలి. పైకి చిన్న సమస్యలా కనిపిస్తోన్నా ఇది చైనాను పెను సంక్షోభంలోకి నెట్టేస్తోంది. చైనాలో బ్రహ్మచారులు పెరిగిపోతున్నారు. పెళ్లి చేసుకోకూడదని వాళ్లు ఏ సన్యాసమో తీసుకుని బ్రహ్మచారులుగా ఉండిపోలేదు. పెళ్లిళ్లు కాకపోవడం వల్లనే ఏకాకులుగా ఉండిపోయారు. పెళ్లిళ్లు కాకపోవడానికి అమ్మాయిలకు ఎదురు కట్నం ఇచ్చుకునే స్థోమత లేకపోవడమే కారణం. చైనాలో అబ్బాయిలకు పెళ్లి కావాలంటే అమ్మాయి కుటుంబానికి భారీ మొత్తంలో కట్నకానుకలు చదించుకోవాలి. లేదంటే పెళ్లికి దండం పెట్టి ఒంటరిగా మిగిలిపోవాలి. తాజా గణాంకాల ప్రకారం అరకోటిమందికి పైగా చైనా మగాళ్లు బ్రహ్మచారులుగానే తుది శ్వాస విడిచే అవకాశాలున్నాయి.
ఇపుడీ సమస్యపైనే చైనా ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. చైనాలో ఒక కోటి 20 లక్షల మందికి పైగా అబ్బాయిలు పెళ్లీ పెటాకులు లేకుండా ఒంటికాయ శొంఠికొమ్ములా ఉండిపోయారు. వీళ్లంతా కూడా 30 నుండి 39 ఏళ్ల వయసు ఉన్నవారు.
పెళ్లిళ్లు కాని అబ్బాయిల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. వయసు మీద పడ్డ కొద్దీ ఇక పెళ్లి కావడం అన్నది గగనమే.
దీనికి కారణం చైనాలో అమ్మాయిల కన్నా అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉండడమే. చైనాలో ప్రతీ వంద మంది మగాళ్లకి కేవలం 63 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అమ్మాయిలు అబ్బాయిల మధ్య నెలకొన్న ఈ లెక్కల తేడానే చైనా లెక్కను తల్లకిందులు చేసింది. దీంతో అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిలకు కట్నం ఇచ్చుకోవలసిన పరిస్థితి. నిజానికి చైనాలో కన్యాశుల్కం అన్నది తరతరాలుగా వస్తోన్న ఆచారమే. కాకపోతే కొన్నేళ్లుగా ఇది శృతిమించుతోంది. అబ్బాయిలు భరించలేనంతగా కన్యాశుల్కం పెరిగిపోయింది. దీన్నే అక్కడ కైలీ అని కూడా అంటున్నారు. అయితే ఇటీవల ఓ అబ్బాయి పెళ్లి కోసం ఏకంగా కోటి రూపాయల మేరకు కట్నం చెల్లించుకోవలసి వచ్చింది. దాంతోనే ఇదొక వివాదం అయ్యింది. చైనా పత్రికలు దీనిపై కథనాలు ప్రచురించడంతో ఇది వార్తల్లోకి వచ్చింది. దాంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాల్సి వచ్చింది.
పెళ్లిళ్లు కావలసిన అబ్బాయిల కోసం చైనాలో వెడ్డింగ్ మార్కెట్స్ ఉంటాయి. అక్కడికి పోయి తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. అబ్బాయిల అర్హతలు వారి ఉద్యోగాలేంటి జీతాలెంత వస్తాయి ఆస్తులు ఏమన్నా ఉన్నాయా లేవా సొంత ఇల్లు ఉందా వంటి వివరాలన్నింటినీ దరఖాస్తులో నింపి సమర్పించాలి. ఆ తర్వాత ఈ అర్హతలకు సరిపడ అమ్మాయిలకు ఈ వివరాలు చూపిస్తారు. ఆమెకు నచ్చితే ఇద్దిరి మధ్య ఇంటర్వ్యూ లాంటిది జరుగుతుంది అక్కడ అమ్మాయికి నచ్చితే ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రులతో పెళ్లి చూపులకు సిద్ధం అవుతారు. అమ్మాయి తరపు వారు అడిగిన కట్నకానుకలు చెల్లించిన తర్వాత మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తారు. అమ్మాయికి 28 ఏళ్ల వయసు దాటినా పెళ్లి కాకపోతే వారిని లెఫ్ట్ ఓవర్స్ గా పరిగణిస్తారు. అదే విధంగా పెళ్లిళ్లు కాని అబ్బాయిలనూ లెఫ్ట్ ఓవర్స్ అంటారు. అంటే పెళ్లికాని ప్రసాదులన్నమాట. మన దేశంలో అమ్మాయిల తల్లిదండ్రులు మా అమ్మాయికి పెళ్లెప్పుడవుతుందో అని బెంగ పెట్టుకుంటారు. చైనాలో మాత్రం అబ్బాయిల తల్లిదండ్రులు కొంత వయసు వచ్చినా అబ్బాయికి సరిపడ అమ్మాయి దొరక్కపోతే చాలా బెంగ పెట్టేసుకుంటారు.
ప్రత్యేకించిన గ్రామీణ చైనాలో ఇలా అమ్మాయిలు దొరక్క దొరికిన అమ్మాయిలకు అడిగిన కట్నం ఇచ్చుకోలేక బ్రహ్మచారులుగా మిగిలిపోయిన అబ్బాయిలను చూసి తల్లి దండ్రులు మానసిక క్షోభనే అనుభవిస్తారు. పెళ్లికాని ప్రసాదుల వల్ల చైనా జనాభా పెరగడం లేదు. పై పెచ్చు తగ్గుతోంది. అందుకే చైనా ప్రభుత్వం ఈ కన్యాశుల్కంపై ఆంక్షలు విధించింది. ఎవ్వరూ కూడా కన్యాశుల్కం వసూలు చేయడానికి వీల్లేదంటోంది. అయితే ఆంక్షలు విధించినంత మాత్రాన దశాబ్ధాలుగా సాగుతోన్న ఆచారం ఆగిపోతుందా అని సీనియర్ సిటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం దశాబ్ధాల క్రితం తెచ్చిన వన్ చైల్డ్ పాలసీయే ఇపుడా దేశాన్ని సంక్షోభం ముందు నిలబెట్టింది. ఒక్కరిని మించి పిల్లల్ని కనడానికి వీల్లేదని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ కనే ఒక్కరూ అబ్బాయి అయితేనే బెటరని తల్లిదండ్రులు అనుకున్నారు. ఈ రెండు రకాల దుర్మార్గాల వల్ల చైనాలో అబ్బాయిలతో పోలీస్తే అమ్మాయిల సంఖ్య దారుణంగా పడిపోయింది. అందుకే అబ్బాయిలకు సరిపడ అమ్మాయిలు లేక అమ్మాయిలకు డిమాండ్ పెరిగింది. మార్కెట్ సూత్రాన్ని అనుసరించి అమ్మాయిలకు అధిక ధర పలుకుతోంది. అదే చైనా లో అబ్బాయికు సమస్యగా మారింది.
ఇవన్నీ కూడా చైనా ప్రభుత్వానికి పెను సమస్యలే. అమ్మాయిలు అబ్బాయిల మధ్య సమతుల్యత దెబ్బతినడానికి దశాబ్ధాల క్రితం చైనా పాలకులు తెచ్చిన ఓ విధానమే కారణం. 1978లో చైనా పాలకులు దేశ జనాభాను చూసి ఒక్కసారిగా కంగారు పడ్డారు. జనాభాను నియంత్రించుకోకపోతే మును ముందు ఆహార భద్రత దెబ్బతినే ప్రమాదముందనుకున్నారు. అంతే వెంటనే ఓ విధానాన్ని తెచ్చారు. ఎవ్వరూ కూడా ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనకూడదని ఆంక్ష విధించారు. ఒక్కరినే కంటే మంచిదని చెప్పుకొచ్చారు. అయితే ఆ మరుసటి ఏడాది వచ్చే సరికి ఒక్క జంట ఒక్కరినే కనాలని ఆదేశించారు. ఆ మరుసటి ఏడాది అంటే 1980లో అది అధికారికంగా ఉత్తర్వుల రూపంలో వచ్చిది. అదే వన్ చైల్డ్ పాలసీ. ఈ విధానం అమల్లోకి వచ్చాక తల్లి దండ్రులు తమకు పుట్టబోయే బిడ్డ ఆడా మగా అన్నది తెలుసుకోవడం మొదలు పెట్టారు. ప్రతీ ఒక్కరూ కూడా మగబిడ్డనే కోరుకునేవారు. దాంతో ఆడ బిడ్డ పుట్టబోతోందని తెలిస్తే వెంటనే అబార్షన్ చేయించుకునేవారు. అబ్బాయి అయితేనే కనేవారు. దశాబ్ధాల పాటు ఈ దుర్మార్గం కొనసాగడంతో చైనాలో అమ్మాయిల సంఖ్య దారుణంగా పడిపోయింది. అబ్బాయిల సంఖ్యకూ అమ్మాయిల సంఖ్యకూ పొంతనే లేకుండా పోయింది అదే పెను సమస్యకు దారి తీసింది.
ఇది ఎంత తీవ్రంగా ఉందంటే 2055 నాటికి అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు 30 శాతానికి పైగా ఎక్కువమంది ఉంటారని ఓ అంచనా. ఇపుడే అమ్మాయిలు దొరక్క పెళ్లిళ్లు కాకుండా బ్రహ్మచారులుగా మిగిలిపోతోన్న అబ్బాయిల సంఖ్య పెరుగుతోందనుకుంటే 2055 నాటికి ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాలుస్తుందని అంటున్నారు. దీని కారణంగా జననాల రేటు తగ్గిపోతోంది. మరణాల రేటు పెరుగుతోంది. దాంతో జనాభా సంఖ్య మొదటి సారి తగ్గింది చైనాలో. ఉన్న జనంలోనూ ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారు. అంటే శ్రమైక జీవుల సంఖ్య తగ్గిపోతోంది. అది చైనా ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అంతిమంగా అది చైనా ఆర్ధిక వ్యవస్థను తల్లకిందులు చేసే అవకాశాలున్నాయి. ఇదే ఇపుడు చైనా పాలకులకు నిద్రలేకుండా చేస్తోంది. అందుకే ఇపుడు కొత్త నినాదం అందుకుంది చైనా. బాబ్బాబు పిల్లల్ని కనండి ప్లీజ్ అంటూ అధికారులు యువతీ యువకులను బతిమాలుకుంటున్నారు. అధికారులు చెప్పారు కదా అని పిల్లల్ని కనేసి కూర్చుంటే వారి చదువులు వైద్యాలకు ఎవరు డబ్బులిస్తారు అని ప్రజలు నిలదీస్తున్నారు. ఎందుకంటే చైనాల స్కూలింగ్ హాస్పిటలైజేషన్ ఖర్చులు చాలా ఎక్కువ వాటిని భరించడం మామూలు జనానికి సాధ్యం కాదు.
అందుకే ప్రభుత్వం ఇపుడు పిల్లల్ని కనడాన్ని ప్రోత్సహించడానికి రాయితీల స్కీములు తెస్తోంది. నిజానికి వన్ చైల్డ్ పాలసీని 2015తోనే ఆపేశారు. అయితే జనం మాత్రం పెళ్లిళ్లు చేసుకోలేకపోతున్నారు. ఖర్చులకు భయపడి ఎక్కువ మంది పిల్లల్నీ కనలేకపోతున్నారు. పెళ్లి చేసుకోవాలంటే ఏ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఏం ఆలోచిస్తారు చేసుకోబోయే జోడీ చూడ్డానికి అందంగా ఉండాలని కోరుకుంటారు. అందంగా ఉన్నాక డబ్బున్న వాళ్లయితే బాగుండును అనుకుంటారు. డబ్బుకూడా ఉంటే ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటే బాగుంటుందని అనుకుంటారు. ఇలా కోరికలు పెరుగుతూనే ఉంటాయి వాటికి అంతుండదు. కానీ చైనాలో ఇపుడు అబ్బాయిలు ఇన్ని ఆలోచించే పరిస్థితే లేదు. అసలు అమ్మాయి దొరకడమే గగనం అనుకుంటే దొరికిన అమ్మాయి నచ్చి తీరాలని అని మంకుపట్టు పట్టే అవకాశం ఎక్కడ ఉంటుంది అలాంటి ఆశలు పెట్టుకుంటే పెళ్లి కాకుండా ఉండిపోవలసి వస్తుంది. చైనాలో ఇపుడు జరుగుతోంది కూడా ఇదే. దీనికి ఫుల్ స్టాప్ పెట్టడం ఎలాగో పాలకులకు అర్ధంకావడం లేదు. కాకపోతే చరమగీతం పాడకపోతే సమస్య మరింత తీవ్రం అవుతుందని మాత్రం వాళ్లకి అర్ధం అవుతోంది.