కాంగ్రెస్‌గా మారిపోయిన తెలంగాణ బీజేపీ – ఇక ఆశలు గల్లంతే

By KTV Telugu On 14 March, 2023
image

కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ బీజేపీ దత్తత తీసుకుంది. నేతలంతా అధికారం కోసం పోరాడటం మానేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ప్రారంభించారు. బండి సంజయ్‌పై మరో ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలతో ఇది మరింత బహిరంగమయింది. ఒకరిపై ఒకరు మీడియా ముఖంగా ఆరోపణలు చేసుకోవడం ప్రారంభించారు. చివరికి అది సోషల్ మీడియాకు ఎక్కింది. ఓ నేతకు మద్దతుగా ఓ గ్రూప్ మరో నేతకు మద్దతుగా మరో గ్రూప్ పోస్టులు పెట్టడం ప్రారంభించాయి. ఈ పరిస్థితి మరింత విస్తృతమవుతోంది. నిజానికి ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యం అసలు రాకుండా చూసుకోవాలి అది అంటూ వస్తే ఎవరూ ఆపలేరు హైకమాండ్ కూడా ఆపలేదు. క్షీణతను అలా చూస్తూ ఉంండాల్సిందే. కాంగ్రెస్ తరహాలో ఇప్పుడు తెలంగాణ బీజేపీ ఆ స్థితికి వచ్చేస్తోంది.

కవిత విషయంలో బండి సంజయ్ ఓ కామెంట్ చేశారు. లిక్కర్ స్కాం చేసిన కవితను దర్యాప్తు సంస్థలు జైల్లో పెట్టకుండా ముద్దు పెట్టుకుంటాయా అని కామెంట్ చేశారు. ఇది అందరూ చేసే ఓ పద ప్రయోగం కానీ విచక్షణతో వాడాల్సిన మాట. అవతల మహిళా నేత గురించి కామెంట్ చేస్తున్నారు. అదీ కూడా సీఎం కేసీఆర్ కుమార్తె గురించి కామెంట్ చేస్తున్నారు. మాటలపై అదుపులేని బండి సంజయ్ ఆ మాట ఇష్టారీతిన వాడేశారు. మొదట బీఆర్ఎస్ కూడా సీరియస్‌గా తీసుకోలేదు. కానీ కవిత ఈడీ విచారణకు వెళ్లే రోజున తెరపైకి తీసుకువచ్చారు ఆందోళనలు ప్రారంభించారు. విషయం కేసుల వరకూ వెళ్లింది. బండి సంజయ్ పై కోపం ఉన్న బీజేపీ నేతలు రంగంలోకి దిగిపోయారు. అర్వింద్ బయటపడిపోయారు. బండి సంజయ్ వెనక్కి తీసుకోవాలన్నారు. ఆయన మాటలు అదుపులో పెట్టుకోవాలన్నట్లుగా మాట్లాడారు. అంతే కాదు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి అంటే పవర్ సెంటర్ కాదని కోఆర్డినేటర్ అన్నట్లుగా మాట్లాడారు. అంటే అందర్నీ సమన్వయం చేసుకోవాలన్న సూచనలు అందులో ఉన్నాయి.

ఈ వివాదం కేంద్రంగా ఎంత రచ్చ చేయాలో బీజేపీ నేతలు చేసుకుంటున్నారు. రాజాసింగ్ తక్షణం అర్వింద్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. విజయశాంతి కూడా స్పందించారు. బండి సంజయ్ కు మద్దతుగా మాట్లాడారు. అయితే తాను పార్టీ అంతర్గత సమావేశాల్లోనే మాట్లాడుతానని కూడా చెప్పుకొచ్చారు. అందరూ ఏదో విధంగా స్పందించాల్సిన పరిస్థితి. దీంతో బీజేపీలో పరిస్థితి గందరగోళంగా మారింది. బీజేపీలో కొత్తగా చేరిన ఈటల రాజేందర్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి వీరితో పాటు ఆ పార్టీలో చేరిన వారు అనుచరులు ఏనుగు రవీందర్ రెడ్డి వంటి వారికి ఇప్పుడు బీజేపీలో ప్రాధాన్యం లేదు. అందుకే వారి అసంతృప్తి గురించి తరచూ చర్చలకు వస్తూ ఉంటుంది. తమకు ప్రాధాన్యం లబించడం లేదని బీజేపీలో చేరి తమ రాజకీయ భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నామని వీరంతా హైకమాండ్‌కు మొర పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వారి జాబితాలో ధర్మపురి అర్వింద్ కూడా చేశారు.

తెలంగాణ బీజేపీలో వలస నేతల రాజకీయ భవిష్యత్ అంధకారంగా మారడంతో వారంతా పక్క చూపులు చూస్తున్నారు. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయినప్పటి నుండి ఆయన మాత్రమే ఫోకస్ అవుతున్నారు. ఈటల గెలిచినా కేసీఆర్ ను టార్గెట్ చేసుకునేందుకు స్కోప్ ఉన్నా పడనీయలేదు. తాను కేసీఆర్ పై పోటీ చేస్తానంటే దాన్నీ తప్పు పట్టారు. ఇక ఫైర్ బ్రాండ్ డీకే్ అరుణ జితేందర్ రెడ్డి లాంటి వాళ్లు ఉపఎన్నికలు వస్తే ఆ సమయంలోనే కనిపిస్తారు. వీరంతా ఇప్పుడు తమ సంగతేమిటో తేల్చాలని హైకమాండ్ వద్ద పంచాయతీ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో త్వరలో కేంద్ర మంత్రివర్గవిస్తరణ జరిపి బండి సంజయ్ ను కూడా ఢిల్లీకి తీసుకెళ్తామని వలస నేతకే బీజేపీ పగ్గాలిస్తామని ఆ తర్వాత చేరికల జోరు పెరుగుతుందని సంకేతాలు ఇచ్చారు కానీ ఇప్పుడు మాట మార్చారు. బండి సంజయ్ నే కొనసాగిస్తామని చెబుతున్నారు. ఆయనను వ్యతిరేకించే వారిని బయటపడేలా చేస్తోంది. ఇప్పుడు బండి సంజయ్ ను ఎన్నికల వరకూ కొనసాగిస్తున్నట్లుగా ప్రకటిస్తే విభేదాలు మరింతగా రోడ్డున పడే అవకాశం ఉంది.

ఈ పరిస్థితిని బీజేపీ హైకమాండ్ కూడా పట్టించుకోవడం లేదు. కలసి పని చేయాలనే మాటలు చెప్పి సరిపెడుతోంది. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా అందరూ కలిసి పని చేయాలని చెప్పారు. కానీ పరిస్థితుల్ని మార్చాలని అనుకోలేదు. తెలంగాణ వ్యవహారాలను చూస్తున్న వారు అంతగా చొరవచూపలేకపోతున్నారు. బండి సంజయ్ కోసమే బీజేపీ ఉందన్న పరిస్థితి మారిపోయింది. మొత్తంగా కొత్తగా చేరిన నేతలకు అందలం ఇస్తే కాంగ్రెస్. అసలు కొత్తగా చేరే నేతలను అక్కడి వరకూ చేరుకుండా ముందే లొల్లి పెట్టుకోవడంలో బీజేపీ రాజకీయాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాయి. కాంగ్రెస్ రోడ్డు మీద పడింది. బీజేపీ కూడా రోడ్డు మీద పడుతోంది. త్వరలో మరింత విస్తృతంగా బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం పెరిగితే ఇక ఆ పార్టీ రేసులో ఉంటుందన్న అభిప్రాయాన్ని మార్చేసుకోవచ్చు.