ఆటల్లో లీగ్ స్థాయి నుంచి గెలుచుకుంటూ వచ్చి చివరికి ఇద్దరు ప్రత్యర్థులు అవుతారు. కానీ రాజకీయాలో మాత్రం నేరుగా ఎవరైనా ఫైనల్‌లో తలపడవచ్చు. ఆ ఫైట్ ఇద్దరు లేదా ముగ్గురు మధ్య ఉండవచ్చు. రాజకీయ ఆటలో ఉండే అడ్వాంటేజ్ ఏమిటంటే అధికార పార్టీ తన ప్రత్యర్థిని ఎంపిక చేసుకునే అవకాశం ఉండటం. అధికార పార్టీ తాను ఎవరితో పోటీ పడాలనుకుంటుందో వారికి హైప్ ఇస్తే ఆటోమేటిక్‌గా వారే ప్రత్యర్థి అవుతారు. తెలంగాణలో కేసీఆర్ చేస్తున్నది చేసింది కేంద్రంలో ప్రధానమంంత్రి నరేంద్రమోడీ చేస్తోంది కూడా అదే. ఎలా అంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రత్యర్థిగా రాహుల్ గాంధీనే ఎంపిక చేసుకుంటున్నారు. గత తొమ్మిదేళ్లుగా ఆయననే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత కాడు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కారు. అయినా ప్రధానమంత్రి టార్గెట్ రాహుల్ గాంధీనే. ఎందుకిలా అంటే ఆయన తన ప్రత్యర్థిగా రాహుల్ నే ఎంచుకుంటున్నారు. ఎందుకంటే ఆయనపై అయితే గెలుపు సులువు అవుతుందని ఇదే అసలు రాజకీయం.
రాజకీయాల్లో అధికార పార్టీకి ప్రత్యర్థిని ఎంచుకునే వ్యూహం చాలా కాలంగా రాజకీయ పార్టీలు గుప్తంగా అనుసరిస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్‌కు తన ప్రత్యర్థి ఎవరనే ఎంపిక చేసుకునే అవకాశం వచ్చింది. కేసీఆర్ చాలా పకడ్బందీ రాజకీయం చేశారు. బీజేపీకి ఇవ్వాల్సినంత హైప్ ఇచ్చారు. ఎప్పుడు ఆపేయాలో అప్పుడు ఆపేశారు. ఫలితంగా బీజేపీ ఎదుగదల కేసీఆర్ హైప్ చేసినంత కాలమే ఉంది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకీ చాన్సిస్తున్నారు. ఆ పార్టీ యథేచ్చగా ప్రజల్లోకి వెళ్తోంది పాదయాత్రలు చేసుకుంటోంది కేసీఆర్‌కు కూడా ఇదే కావాలి. వారిద్దరూ బలంగా ఉండాలి. అలా అయితేనా ఓట్ల చీలిక జరుగుతుంది. బీఆర్ఎస్‌కు విజయం సులువు అవుతుంది. అయితే ఇలాంటి ప్లాన్ ను కేసీఆర్ కంటే ముందే మోదీ అమలు చేస్తూ వస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్‌కు ఉన్నంత రాజకీయ అడ్వాంటేజ్ కేంద్రంలో మోదీకి కూడా ఉంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనేది సోనియా గాంధీ ఆకాంక్ష. అందులో సందేహం లేదు గాంధీల వారసుడిగా ఆయన లక్ష్యం కూడా అదే కావొచ్చు కానీ ఆయన ఇమేజ్ మొదటి నుంచి సాఫ్ట్ గా ఉంది. అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తట్టుకునేంత లేదు. ఎంత లెగసీ కలసి వచ్చినా మోదీకి ధీటుగా రాహుల్ నిలబడలేకపోయారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరవాత మోదీ ఇమేజ్ అమాంతం పెంచేసుకున్నారు. కానీ రాహుల్ గాందీ మాత్రం ఎక్కడి వారక్కడే ఉండిపోయారు.
ఇప్పుడు కాదు అప్పట్నుంచి మోదీ టార్గెట్ రాహుల్ గాంధీనే. ఆయననే టార్గెట్ చేసుకుని రాజకీయ ప్రసంగాలు చేస్తూంటారు. జాతీయ రాజకీయాలు అంటే రాహుల్ వర్సెస్ మోదీ అన్నట్లుగా ఆయన రాజకీయం చేస్తూ ఉంటారు. అదే సమయంలో రాహుల్ కు పోటీగా మరికొంత మంది ప్రాంతీయ నేతలు తెరపైకి వస్తారు. వారిని నాయకులుగా ప్రొజెక్ట్ చేసినా మోదీ వారి వారి రాష్ట్రాల్లో మాత్రమే వారి ప్రస్తావన తీసుకు వస్తారు. వారికి జాతీయ స్థాయి ప్రాధాన్యం ఎప్పుడూ ఇవ్వరు. అంటే వారిని నాయకులుగా గుర్తిస్తారు కానీ జాతీయస్థాయిలో కాదు. కానీ రాహుల్ గాంధీని మాత్రం తన ప్రత్యర్థిగా గుర్తిస్తారు. ఇక్కడే అసలు రాజకీయం ఇమిడిఉంది. ఎవరైనా రాజకీయ నాయకుడు మూడునాలుగుసార్లు ముఖ్యమంత్రిగా గెలిస్తే వారికి దేశ వ్యాప్తంగా క్రేజ్ వస్తుంది. గుజరాత్‌లో నరేంద్రమోడీ వరుసగా మూడు సార్లు గెలిచిన తర్వాత ఆయనకు వచ్చిన క్రేజ్ వల్ల అద్వానీ లాంటి వారిని కాదని కూడా ప్రధానమంత్రి అభ్యర్థిత్వం బీజేపీ నుంచి దక్కింది. వారిది జాతీయ పార్టీ కాబట్టి అది సాధ్యమయిందని అనుకోవచ్చు. కానీ ప్రాంతీయ పార్టీల నుంచి కూడా ఇలా మూడు సార్లు గెలిచిన మమతా బెనర్జీ కి కూడా అలాంటి హైప్ రాలేదు. దీనికి కారణం. బెనర్జీని బెంగాల్‌కు పరిమితం చేసేలా మోదీ రాజకీయం చేయడమే. కారణం ఏదైనా మమతా బెనర్జీ బెంగాల్ దాటి బయటకు రావడం లేదు.
ఇక వరుసగా గెలుస్తూ వస్తున్న నవీన్ పట్నాయక్ గురించి అసలు పొరుగు రాష్ట్రాల్లోనూ పెద్దగా తెలియదు. బిజేడీ ఎంపీలు కూడా వీలైనంత మౌనం పాటిస్తూ ఉంటారు. జాతీయ రాజకీయల జోలికి వెళ్లరు కాబట్టి మోదీ కూడా ఆయనను లక్ష్యంగా చేసుకోరు. ఇంకా చెప్పాలంటే ఓడిషాలో బీజేపీకి మంచి అవకాశాలున్నా దృష్టి పెట్టరు. ఎందుకంటే అక్కడ నవీన్ పట్నాయక్ ఎన్ని సార్లు గెలిచినా తర్వాత బీజేపీకి చాన్సని వారికీ తెలుసు. కేసీఆర్ లాంటి నేతలు జాతీయ పార్టీలు పెట్టినా పెద్దగా స్పందించరు అనవసరంగా హైప్ ఇవ్వరు. ముఖ్యంగా దక్షిణాది నేతలకు ఆయన అసలు హైప్ ఇవ్వరు. వీలైనంత వరకు సామంతులుగా ఉంచుకుని చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తారు. కానీ రాహుల్ గాందీని మాత్రం గత తొమ్మిదేళ్లుగా ప్రత్యర్థిగా ఎంచుకుంటూనే ఉంటారు. మోదీ రాజకీయంలో అదే కీలకం అని అనుకోవచ్చు.
రాహుల్ గాంధీని అయితే మోదీ ఓడిపోరా అంటే ఇప్పటికైతే కష్టం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధాని అయిన తర్వాత తన ఇమేజ్ ను ఆకాశం అంత ఎత్తుకు పెంచుకోవడంలో మోదీ సక్సెస్ అయ్యారు. కానీ రాహుల్ తనపై సోషల్ మీడియా సౌజన్యంతో వేసిన ఓ రకమైన సాఫ్ట్ ముద్రను చెరిపేసుకోవడానికి తంటాలు పడుతున్నారు. అంత భారీ ఎత్తున పాదయాత్ర చేసినా ఆయనకు రావాల్సినంత హైప్ రాకపోవడానికి ఇదే కారణం. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఇలాగే ఉంటాయని లేదు. తనదైన రోజు వస్తే ప్రజల్లో మార్పు కావాలని అనిపిస్తే రాహుల్ గాంధీనే మోదీకి పెద్ద ధ్రెట్ అవుతారు. ఆయనిచ్చిన ప్రాధాన్యమే కీలకం అవుతుంది. ఆటైం వస్తే సునామీలాగా రాహుల్‌కు మద్దతు ఉప్పొంగుతుంది. అలాంటిది రాకుండా బ్యాలెన్స్ చేయడంలోనూ మోదీ సిద్దహస్తుడే. అందుకే అద్భుతం జరగాలని బీజేపీ వ్యతిరేకులు కోరుకుంటూ ఉంటారు.