ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సై అంటే సై అనుకుంటున్న పార్టీలు ఎన్నికలెప్పుడు వచ్చినా కదనరంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. వైసీపీ అధినేత సీఎం జగన్ కూడా ఇప్పుడు ఎన్నికల గురించే ఆలోచిస్తున్నారు. అధికార పార్టీ పట్ల జనంలో పూర్తి వ్యతిరేకత ఏర్పడే లోపే ఎన్నికలకు వెళ్లిపోతే విజయం సాధించి నింపాదిగా సీట్లో కూర్చోవచ్చని జగన్ అంచనా వేసుకుంటున్నారు. దానితో తక్షణమే అన్ని వర్గాలను దగ్గరకు చేర్చుకునే ప్రక్రియకు మళ్లీ శ్రీకారం చుడుతున్నారు.
మంత్రివర్గ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేయడంతో జగన్ అంతరంగం క్రమంగా అర్థమవుతోంది. కొందరు మంత్రుల పనితీరు బాగోలేదని ఇద్దరు ముగ్గురిని మార్చేస్తానని జగన్ చెప్పడంతో అందరిలోనూ గుబులు మొదలైంది. ఇతరుల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడం తమ నియోజకవర్గంపై దృష్టి పెట్టకపోవడం లాంటి చర్యలతో ఆయా నాయకులు పార్టీని విసిగిస్తున్నారని జగన్ ఆగ్రహం చెందారు. ఎమ్మెల్సే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ మాత్రం తేడా వచ్చినా కొందరు మంత్రులకు ఉద్వాసన ఖాయమని జగన్ చెప్పేశారు. కాకపోతే ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా కొందరిని మార్చెయ్యడం ఖాయంగా కనిపిస్తోంది.
రోడ్లు భవనాల శాఖా మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా సీబీ సంక్షేమంతో పాటు సినిమాటోగ్రఫీ శాఖలను నిర్వహిస్తున్న చెల్లుబోయిన వేణుగోపాల్ ను సాగనంపుతారని చెబుతున్నారు. వారి స్థానంలో తోట త్రిమూర్తులు కవురు శ్రీనివాస్ కు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న సమాచారంగా చెబుతున్నప్పటికీ ఉద్వాసనకు గురయ్యే వారిలో మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
అందరికీ మించి మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తారని టాక్ నడుస్తోంది. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత బలమైన కమ్మ సామాజిక వర్గం వారు ఎవ్వరూ మంత్రివర్గంలో లేరు. తిరిగి కొడాలి నానినే చేర్చుకోవాలని భావించినప్పటికీ ప్రత్యర్థులపై తిట్ల దండకం అందుకునే మంత్రిగా ఆయనకు చాలా చెడ్డ పేరు ఉంది. పైగా గడప గడపకు కార్యక్రమంలో ఆయన అసలు పాల్గొనడం లేదని ఐ ప్యాక్ నివేదిక చెబుతోంది. వసంత కృష్ణప్రసాద్ కు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ఆయన జోగి రమేష్ తో గొడవ పడి పార్టీని బజారుకీడ్చారు. ఆయన కూడా గడప గడపకు కార్యక్రమంలో సరిగ్గా పాల్గొనడం లేదు. దానితో మర్రి రాజశేఖర్ ను సీఎం జగన్ లైనులో పెడుతున్నట్లు సమాచారం. రాజకీయాలకు కొంచెం దూరం జరిగి ఇంటి దగ్గర కూర్చున్న మర్రి రాజశేఖర్ ను ప్రత్యేకంగా పిలిచి మరీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్ ఇచ్చారు. మంత్రిపదవి ఇస్తానని జగన్ ఎన్నికల ముందే రాజశేఖర్ కు హామీ ఇచ్చి తర్వాత నేరవేర్చలేదు.
కమ్మ సామాజికవర్గం తనపై తీవ్ర ఆగ్రహంతో ఉందని జగన్ కు తెలుసు. దాన్ని కొంతైనా మేనేజ్ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. అనివార్య కారణాలతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలను దూరం పెట్టాల్సి రావడంతో వారికి తగిన ప్రాధాన్యం ఇస్తే డ్యామేజ్ కంట్రోల్ చేసినట్లవుతుందని జగన్ విశ్వాసం కాకపోతే మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తే వైద్యారోగ్య శాఖామంత్రి విడదల రజనీకి ఉద్వాసన తప్పదన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఇద్దరు నేతలు మంత్రులుగా ఉండటం ఎక్కడా జరగదు. అలా చేస్తే రాజకీయ సమతౌల్యం లోపిస్తుందని జగన్ కు తెలుసు. పైగా చిలకలూరిపేటలో టీడీపీకి చెందిన మాజీ మంత్రి టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు దూసుకొస్తున్నారు. దానితో రజనీ విజయం కష్టమేనంటున్నారు.
అన్నింటికీ మించి స్పెక్యులేషన్ కు అందని మరో విషయం ఒకటి ఉంది. అదే నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజాను తొలగిస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. ఆమె పట్ల నియోజకవర్గంలో వ్యతిరేకత పెరగుుతోందని వరుసగా మూడో సారి గెలుపు కష్టమేనని అన్ని సర్వేలు నిగ్గు తేల్చాయి. అక్కడ టీడీపీ అభ్యర్థిగా గాలి భానుప్రకాష్ ను నారా లోకేష్ ప్రకటించేశారు. గాలి భానుప్రకాష్ కొంచెం పైచేయిగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. పైగా నగరిలో రోజా వ్యతిరేకులు బాగా బలపడ్డారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా స్ట్రాంగ్ మేన్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం కూడా రోజాను దూరం పెడుతోంది. జగన్ పై పెద్దిరెడ్డి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా కొందరు నేతలు మంత్రి పదవులు కోల్పోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. అది జగన్ నోట వచ్చిన మాటే మరి.