న‌మ్మ‌కం లేకే పొత్తులా ప‌వ‌న్ లాజిక్ అదేనా

By KTV Telugu On 15 March, 2023
image

కాస్త తిక్కుంద‌నేది సిన్మా డైలాగ్‌. కానీ ఒరిజ‌న‌ల్‌గా ట‌న్నులు ట‌న్నులు ఉంద‌ని క‌నిపిస్తూనే ఉంది. జ‌న‌సేన ఈసారి బ‌లిప‌శువు కాబోదంటున్నారు ప‌వ‌న్‌క‌ళ్యాణ్. గెలుపుపై వంద‌శాతం న‌మ్మ‌కం ఉంటేనే ఒంట‌రిపోరుకు వెళ్తామంటున్నారు. వైసీపీ నాయ‌కులు దెప్పిపొడుస్తున్న‌ట్లు ఒంట‌రిగా 175 స్థానాల్లో పోటీచేసేంత ద‌మ్ము లేద‌ని చెప్పుకోవ‌చ్చుగా. మీరెవురు అన్ని సీట్ల‌నుంచి పోటీచేయ‌మ‌న‌డానికి అంటూ వైసీపీని ప్ర‌శ్నిస్తున్నారు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. ప్రైవేట్ జీవితంలో మ‌న ఇష్టం. ప‌బ్లిక్‌లోకొస్తే ఎవ‌రు ఏమైనా అంటారని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌లాంటి ప‌బ్లిక్ ఫిగ‌ర్‌కి తెలియ‌క‌పోతే ఎలా. వారాహితో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రోడ్డెక్క‌టంతో ఈసారి ఆయ‌న క్లారిటీగా చెప్పేస్తార‌నే అంతా అనుకున్నారు. కానీ మీరు గెలిపిస్తాన‌ని మాటిస్తేనే ఒంట‌రిపోరుకు సాహసిస్తాం అన్న‌ట్లే ఉన్నాయ్ ప‌వ‌ర్‌స్టార్ డైలాగ్స్. అంటే రాష్ట్రంలోని జ‌న‌సేన మ‌ద్ద‌తుదారులు కాపు ఓట‌ర్లు ఓటు మీకేన‌ని స్టాంప్ పేప‌ర్ల‌మీద రాసిచ్చేస్తారా అది జ‌రిగేప‌నేనా. ముందు మ‌న‌మీద మ‌న‌కు న‌మ్మ‌కం ఉండాలి. మ‌న సిద్ధాంతాల్ని మ‌న ఆలోచ‌న‌ల‌ను ప్ర‌జ‌లు ఆమోదిస్తార‌నే విశ్వాసం ఉండాలి. అంతేగానీ లోప‌ల పిరికిత‌నం పెట్టుకుని పైకి మాత్రం ఒక్క‌ర్ని కాదు వంద‌మందిని పంపించ‌మ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికేలా ఉండ‌కూడ‌దు.

రాష్ట్రం కులాల‌కాష్టంనుంచి బ‌య‌టికి రావాలంటారు. త‌న విజ‌యంలో కాపులు పెద్ద‌న్న పాత్ర పోషించాలంటారు. అదెలా కుదురుతుంది. కులంవ‌ద్ద‌నుకుంటే అది ముందు త‌న‌తోనే మొద‌ల‌వ్వాలి క‌దా అన్ని కులాల‌కు అధికారం ద‌క్కాలంటే జ‌న‌సేన రావాల‌న్న‌ది మ‌రో పంచింగ్ డైలాగ్‌. బీజేపీ క‌లిసొస్తే మ‌న‌కు టీడీపీ అవ‌స‌రం లేనంతంగా ఎదిగేవాళ్ల‌మంటున్నారు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. క‌లిసి రావ‌డ‌మంటే ఏమిటో ఆయ‌నే చెప్పాలి. ఆయ‌నెప్పుడూ స్థిరంగా లేర‌నే బీజేపీ కూడా ఆశ‌లొదిలేసుకుంటోంది. టీడీపీతో పొత్తు వ‌ద్ద‌న్న‌దే బీజేపీ ఫిలాస‌ఫీ. కానీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కేమో అవ్వాకావాలి బువ్వా కావాలి అవేమో కుదిరిచావ‌డం లేదు. జ‌న‌సేన పార్టీ పెట్టి ప‌దేళ్ల‌య్యింది. ఏడాదిలో ఎన్నిక‌లున్నాయి. పార్టీ పదో ఆవిర్భావ సభలోనైనా జ‌న‌సైనికుల అనుమానాల‌న్నీ ప‌టాపంచ‌ల‌య్యేలా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ప‌ష్ట‌త ఇచ్చి ఉండాల్సింది. టీడీపీతోనే పొత్తు ఉంటుందంటే అదే విష‌యం కుండ‌బ‌ద్ద‌లు కొట్టాలి. బీజేపీతో తెగ‌దెంపులు చేసుకోవాలంటే ఇక‌నుంచి ఆ పార్టీతో సంబంధం లేద‌న్న విష‌యం బాహాటంగా చెప్పేయాలి. క్షేత్ర‌స్థాయిలో ఆ పార్టీలతో ఎలా వ్య‌వ‌హ‌రించాలో ఎంత‌వ‌ర‌కు క‌లిసి క‌దలాలో జ‌న‌సైనికుల‌కు కాస్త క్లారిటీ అన్నా వ‌చ్చేది. కానీ చెప్పీ చెప్ప‌న‌ట్లు అర్ధ‌మై అర్ధంకాన‌ట్లు ఆయ‌న నోట మ‌ళ్లీ అవే డైలాగులు. ఓటును వృథా కానివ్వ‌నంటారు ఏం జరిగితే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారో అదే జరుగుతుంద‌ని న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానిస్తారు.

క్షేత్ర‌స్థాయిలో న‌మ్మకం కుదిరితే ఒంట‌రిపోరుకు వెనుకాడేది లేద‌ని త‌ప్ప‌ద‌న్న‌ట్లు చెప్పారు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. టీడీపీతో ఆయ‌న పొత్తు అనివార్య‌మైతే దానికి కార‌ణం బీజేపీనేన‌ట‌ ఇదేం లాజిక్కో. లాంగ్‌మార్చ్ పెడ‌దామంటే ఢిల్లీలో ఒప్పుకున్న బీజేపీ తర్వాత వ‌ద్ద‌న్న‌ద‌ని ఇప్పుడు చెబుతున్నారు. నారా లోకేష్ తిరుగుతుంటేనే ఎవ‌రూ అడ్డంప‌డ‌టం లేదు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌నుకుంటే ఎవ‌రు ఆపుతారు ఆయ‌న మ‌న‌సు టీడీపీ వైపు లాగుతోంది. ఆ పార్టీమీద ప్ర‌త్యేక‌మైన ప్రేమేమీ లేదంటూనే చంద్ర‌బాబంటే గౌర‌వం ఉందంటారు. ఆయ‌న స‌మ‌ర్థుడ‌ని పొగిడేస్తారు. ఫైనల్‌గా శ్రీమాన్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చెప్పొచ్చేది ఏమిటంటే తాను ప్యాకేజ్ స్టార్‌ని కాద‌ని. రోజుకు రెండుకోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకునే త‌న‌కు డ‌బ్బుతో ప‌న్లేద‌ని. ఆ మాట‌కొస్తే ఆయ‌న‌కు రాజ‌కీయాల‌తో కూడా ప‌న్లేదేమో.