జగన్‌ మరోసారి క్లారిటీ ఇచ్చేశారు.. ఎనీ డౌట్స్‌

By KTV Telugu On 15 March, 2023
image

మూడ్నెల్ల తర్వాత తాడేపల్లిలో చడీచప్పుడు ఉండదు. అమరావతి చుట్టుపక్కల సందడి కనిపించదు. ఎందుకంటే ఏపీ పాలన విశాఖకు తరలబోతోంది. కాకపోతే ఉగాదికి అనుకున్నది జూలైకి జరగబోతోంది. విశాఖే పాలనాకేంద్రం అని ఇదివరకే ఏపీ సీఎం స్పష్టత ఇచ్చేశారు. ఏప్రిల్‌ నుంచి విశాఖపట్టణం కేంద్రంగా ప్రభుత్వ పాలన సాగుతుందని చెప్పేశారు. అయితే ఇప్పుడు అది మరికొన్నాళ్లు వాయిదాపడ్డా విశాఖ షిఫ్టింగ్‌మీద డౌట్స్‌ పెట్టుకోవద్దని చెప్పేశారు.
జులైలో విశాఖకు వెళ్తున్నా బీ రెడీ అని కేబినెట్‌ మీటింగ్‌లో మంత్రులకు చెప్పారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. ఇన్వెస్టర్స్ గ్లోబల్‌ సమ్మిట్‌లోనే విశాఖకు పాలన మారుతోందన్న విషయాన్ని జగన్‌ చెప్పారు. కాకపోతే అది వచ్చే నెల కాకుండా జూలైలో కావడంతో మరో మూడునెలల్లో అనుకున్నది జరగబోతోంది. క్యాపిటల్‌పై క్లారిటీ ఇస్తూనే ఎమ్మెల్సీ సీట్లపైనా మంత్రులకు గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చారు ముఖ్యమంత్రి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలన్నీ గెలవాలని ఎక్కడ తేడావచ్చినా ఊరుకునేది లేదన్నారు. కేబినెట్‌లో మార్పులు తప్పవని జగన్ హెచ్చరించటంతో మంత్రులు అప్రమత్తం అయ్యారు. కేబినెట్‌ భేటీలో కొందరు మంత్రులపై సీఎం జగన్మోహన్‌రెడ్డి అసహనం వ్యక్తంచేశారు.

ఎమ్మెల్యే కోటాలో ఏడు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నా ఓ సీటుకు టీడీపీ అభ్యర్థిని నిలబెట్టింది. వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు గైర్హాజరైతేనే టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మాజీ మంత్రి చినరాజప్పలాంటి నేతలు సంకేతాలిస్తున్నారు. దీంతో ఈవిషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు ఏపీ సీఎం. మంత్రులకు ముందస్తుగానే హెచ్చరికలు చేశారు. మంత్రులు సమన్వయం చేసుకుని ఆయా జిల్లాల ఎమ్మెల్యేలంతా హాజరై ఓటేసేలా చూడాలని ఆదేశించారు. విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడం తమ డ్యూటీల కాదన్నట్లు ఉంటున్నారు కొందరు మంత్రులు. కేబినెట్‌ మీటింగ్‌లో దీనిపై కూడా ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. కొందరు మంత్రులే కౌంటర్లు ఇస్తున్నారని మిగిలిన వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారని సీఎం ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో విపక్షాల ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. పార్టీ వైపు నుంచి గొంతెత్తే విషయంలో ఏమాత్రం తేడా ఉన్నా కేబినెట్‌లో మార్పులు తప్పవని సీఎం హెచ్చరించినట్లు చెబుతున్నారు.