టార్గెట్ 400. ఇదే ఇపుడు బిజెపి నినాదం. ఇదే వారి సమరగీతం. 2024 ఎన్నికల్లో 400 లోక్ సభ స్థానాలకు తగ్గకుండా బిజెపిని గెలిపించుకోవడమే టార్గెట్ 400 లక్ష్యం. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బ్లూప్రింట్ రెడీ చేసింది. 2019లో ఓటమిపాలైన 160 లోక్‌సభ స్థానాల్లో ప్రధాని మోదీ మెగా ర్యాలీలు ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేసింది కమలదళం.
2019 సార్వత్రిక ఎన్నికల్లో 303 సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ టార్గెట్ 400 నినాదంతో 2024 జనరల్ ఎలక్షన్స్‌కు
సమాయత్తమవుతోంది. గత ఎన్నికల్లో ఓటమిపాలైన 160 లోక్‌సభ నియోజవర్గాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఈ నియోజకవర్గాల్లో దాదాపు 100 ర్యాలీలు నిర్వహించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలతోపాటు బహిరంగ సభలు ఉంటాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 160 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులపై రిపోర్టులు తెప్పించి పరిశీలించిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తులు పూర్తిచేశారు. 160 స్థానాలను వేరు వేరు క్లస్టర్లుగా విభజించి ప్రధాని ర్యాలీలు ప్లాన్ చేసినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సాల్, వినోద్ తావ్డే, తరుణ్ చుగ్‌లకు ఈ ర్యాలీల సన్నాహాక బాధ్యతలను అప్పగించారు జేపీ నడ్డా.
తొలిదశలో 160 స్థానాల్లో ప్రచారం పూర్తయిన తర్వాత మిగిలిన 383 లోక్‌సభ స్థానాల్లో ప్రచారం ముమ్మరం చేసేలా స్కెచ్ రెడీ చేసింది కమలదళం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 400కుపైగా లోక్‌సభ సీట్లు సాధించాలని టార్గెట్‌గా పెట్టుకుంది బీజేపీ. దక్షిణాది రాష్ట్రాలపైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది. సౌత్‌లోని 5 రాష్ట్రాల్లో మొత్తం 129 లోక్‌సభ స్థానాలు ఉంటే బీజేపీ గెలిచింది కేవలం 29 సీట్లే. అయితే ఈసారి ఎలాగైనా మెజార్టీ సీట్లు కొల్లగొట్టాలని ప్రయత్నాలు చేస్తోంది కమలదళం. ఈ నేపథ్యంలోనే కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది కమలదళం. ఇప్పటికే కన్నడ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు ప్రధాని మోదీ. ఇదే అజెండాతో ఇటీవల తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు బీజేపీ పెద్దలు. ఇక ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపైనా ప్రత్యేక దృష్టి సారించాల్సిందేనని హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశనం చేశారు.
దక్షిణాదిలో కర్నాటక తెలంగాణా రాష్ట్రాల్లో పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ పాగా వేయాల్సిందేనని డిసైడ్ అయ్యారు. ఈ ఎన్నికలన్నింటినీ గెలుచుకుంటూ పోయి అంతిమంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని కమలనాథులు పట్టుదలగా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్నాటకలో బిజెపికి కాస్త ఎదురుగాలి వీస్తోన్న నేపథ్యంలో మరో దక్షిణాది రాష్ట్రం అయిన తెలంగాణాలో పాగా వేయాలని పంతంగా ఉన్నారు. తెలంగాణాలో బి.ఆర్.ఎస్.కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటోన్న బిజెపి నేతలు కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్నారు. బి.ఆర్.ఎస్. ను డిఫెన్స్ లోకి నెట్టి తామే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని వ్యూహరచన చేస్తున్నారు. మధ్య ప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే కాంగ్రెస్ అగ్రనేతల అనాలోచిత విధానాల కారణంగా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలి బిజెపి అధికారంలోకి వచ్చింది. ఈ సారి దానికి ప్రతీకారం తీర్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ వ్యవహార శైలితో కాంగ్రెస్ ఇమేజ్ దెబ్బతిందని అంటున్నారు రాజకీయ పండితులు.