జులై కల్లా విశాఖ నుంచే పాలన

By KTV Telugu On 16 March, 2023
image

ఏపీ కేబినెట్ లో మంత్రులకు  క్లారిటీ ఇచ్చిన జగన్  ఏపీ కార్యనిర్వాహక రాజధాని విశాఖేనా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్కడి నుండే పాలన చేయనున్నారా ఈ విషయంలో విపక్షాలకున్న కొద్ది పాటి అనుమానాలను కూడా పటా పంచలు చేస్తూ  తాజాగా ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి  మంత్రులకు క్లారిటీ ఇచ్చేశారు. జులై కల్లా విశాఖ షిఫ్ట్ అయిపోతున్నాం అని జగన్ మోహన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక్క విషయంలో మాత్రం తిరుగులేని క్లారిటీతో ఉన్నారు. త్వరలో విశాఖ నుండే తాను పరిపాలన చేయబోతున్నానని ఆయన పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇదే విషయాన్ని తాజాగా మంత్రివర్గ సమావేశంలో మరోసారి పునరుద్ఘాటించారు జగన్ మోహన్ రెడ్డి. వచ్చే జులై కల్లా మనం విశాఖ తరలిపోతున్నాం అని మంత్రులకు స్పష్టత ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి. అదే సమయంలో వివిధ కేటగిరీల కింద జరుగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అన్ని స్థానాల్లోనూ విజయాలు సాధించాలని అలా చూడాల్సిన బాధ్యత మంత్రులపైనా ఉందని సూచించారు.

మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేస్తూనే ఉంటామన్న ముఖ్యమంత్రి పనితీరు మెరుగు పరుచుకోని వారిని మార్చడానికి కూడా వెనుకడమన్న సంకేతం ఇచ్చినట్లు సమాచారం. ఇక విశాఖ విషయానికి వస్తే  జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి అధికార వికేంద్రీకరణ అవసరమని  గుర్తించారు. తమ మేనిఫెస్టోలోనూ పరిపాలన, అధికార వికేంద్రీకరణలకు పెద్ద పీట వేసిన సంగతిని గుర్తు చేస్తూనే ఆయన మూడు రాజధానుల ఆలోచనకు శ్రీకారం చుట్టారు. దీనిపై అధ్యయనానికి ఓ కమిటీని నియమించారు కూడా. కమిటీ నివేదిక ఆధారంగా ఆంధ్ర ప్రదేశ్ కు మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే విశాఖను కార్యనిర్వాహక రాజధానిగానూ కర్నూలును న్యాయరాజధానిగానూ  ఏర్పాటు చేయాలని  కమిటీ సూచించింది. దానికి అనుగునంగానే అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు  ఆమోదించారు. అయితే అమరావతిలోనే రాజధాని ఉండాలని ఇతర ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేయకూడదని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులతో పాటు కొందరు టిడిపి నేతలు కోర్టును ఆశ్రయించారు.

ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. రాజధానిని ఎక్కడ పెట్టుకోవాలనే అధికారం కానీ శాసనం చేసి హక్కుకానీ ఈ ప్రభుత్వానికి లేదంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. శాసనం చేసే అధికారం అసెంబ్లీకి లేకపోవడం ఏంటని నివ్వెర పోయిన ప్రభుత్వం దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతోంది. ఇప్పటికే  కొన్ని అంశాల్లో హైకోర్టును తీవ్రంగా తప్పు బట్టింది సుప్రీం కోర్టు. ప్రత్యేకించి హైకోర్టు ఆదేశాల్లో కొన్ని అంశాలు మరీ గీత దాటినట్లున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. అమరావతిలో నిర్దిష్ట గడువు లోపు నిర్మాణాలన్నీ పూర్తి చేయాలంటూ రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడాన్ని సుప్రీం తప్పు బట్టింది. నిర్మాణాలు ఎంత కాలంలో పూర్తి చేయాలని చెప్పడానికి మనమేమన్నా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వాళ్లమా అది ప్రభుత్వాలు చూసుకునే పని కదా అందులో మనం జోక్యం చేసుకోవడం ఏంటని సుప్రీం అక్షింతలు వేసింది. త్వరలోనే  మూడు రాజధానుల పిటిషన్ పై సుప్రీం కోర్టు తన తీర్పును వెలవరించనుంది. రాజధాని ఎక్కడ ఉండాలన్న విషయంలో  నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో స్పష్టం చేసింది. అందులో తమ ప్రమేయం ఉండబోదని తేల్చి చెప్పింది.

ముఖ్యమంత్రి  ఎక్కడి నుంచి పాలించాలనేది ఆయన ఇష్టమని రాజ్యాంగం చెబుతోంది. ఆయన తనకు నచ్చిన చోటు నుంచే పాలన చేసే అధికారం రాజ్యాంగమే కల్పించింది. దాన్ని ఎవరూ కూడా కాదనలేరని న్యాయరంగ నిపుణులు అంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన పారిశ్రామిక పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే మేం విశాఖ తరలిపోతున్నాం. విశాఖ ఏపీకి ఒకానొక రాజధాని కాబోతోంది మీరంతా తర్వాతి గ్లోబల్ సమ్మిట్ కు విశాఖకు రావాలి అని ఆహ్వానించారు. ఆ తర్వాత ఈ నెల 3,4 తేదీల్లో విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ సమ్మిట్ కు ప్రపంచ దేశాల నుండే కాక దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలంతా తరలి వచ్చి సమ్మిట్ ను విజయవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ సదస్సులోనూ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే విశాఖ కార్యనిర్వాహక రాజధాని కాబోతోందని తాను కూడా విశాఖకు తరలి రాబోతున్నానని  ప్రకటించారు. ఇపుడు తాజాగా కేబినెట్ లోనూ అదే విషయాన్ని మరో సారి స్పష్టం చేశారు. జులై కల్లా మనం విశాఖ వెళ్లిపోతున్నాం. ఇక అక్కడి నుండే పాలన అని మంత్రులకు క్లారిటీ ఇచ్చారు సిఎం.

విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేయడాన్ని మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఒక్క అమరావతినే రాజధానిగా అభివృద్ది చేయాలన్నది టిడిపి డిమాండ్. అందుకోసం లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అయితే విభజిత కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఒకే ఒక్క ప్రాంతంపై లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి మిగతా ప్రాంతాలను అన్యాయం చేయడం సరికాదని ప్రభుత్వం అంటోంది. రాష్ట్రంలోని మూడు ప్రధాన ప్రాంతాలనూ  సమానంగా అభివృద్ధి చేయాలన్నది జగన్ మోహన్ రెడ్డి వాదన. దీనికి అనుగుణంగానే మూడు రాజధానుల డిమాండ్ తో రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాలకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచింది. చంద్రబాబు నాయుడితో పాటు అమరావతే రాజధానిగా ఉండాలని ఏపీ బిజెపితో పాటు అక్కడి కాంగ్రెస్ పార్టీ కూడా అంటోంది. కమ్యూనిస్టు పార్టీలు ఎలాగూ టిడిపి లైన్ లోనే పని చేస్తున్నాయి.

ప్రత్యేకించి సిపిఐ అగ్రనేత నారాయణ ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ లు చంద్రబాబు నాయుడి వాయిస్సే వినిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. టిడిపితో పొత్తుకు సై అన్న జనసేన కూడా ఇపుడు అమరావతే రాజధాని అంటోంది. అయితే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మాత్రం మూడు రాజధానులే తమ నినాదం అంటోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజున కూడా అదే విషయాన్ని మరోసారి చాటి చెప్పింది. మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పూర్తి క్లారిటీతో ఉన్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పదే పదే జగన్ మోహన్ రెడ్డి విశాఖకు తరలిపోతున్నాం అంటూ వ్యాఖ్యానించడంతో విపక్షాలు మండి పడుతున్నాయి. రాజధానుల అంశం పై సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వకుండా ముఖ్యమంత్రి ఎలా వ్యాఖ్యలు చేస్తారంటూ విపక్షాలు నిలదీస్తున్నాయి. అయితే జగన్ మోహన్ రెడ్డి మాత్రం పదే పదే విశాఖ ప్రస్తావన చేస్తూనే ఉన్నారు.