మొన్ననే ఈడీ అరెస్ట్ చేస్తుందనుకున్నారు. కానీ బర్త్‌డే బయటే జరుపుకోవాలని రాసిపెట్టినట్లుంది. ఏడెనిమిదిగంటల ఎంక్వయిరీ తర్వాత బయటికొచ్చారు. వారం తిరిగేలోపు మళ్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకాబోతున్నారు కేసీఆర్ కూతురు కవిత. ఈసారి కూడా విచారించి పంపిస్తారా లేదంటే మిగిలిన నిందితుల్లాగే అరెస్ట్ చేస్తారా అన్నది చెప్పలేకుండా ఉంది. అరెస్ట్ భయంతోనే సుప్రీంని ఆశ్రయించారు కవిత. ఒక మహిళను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించవచ్చా అనే అంశంపై సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ఈడీ విచారణపై మధ్యంతరం రిలీఫ్ ఇవ్వాలన్న కవిత అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
సుప్రీంకోర్టు ఈ పిటిషన్ విచారణను 24కి వాయిదా వేసింది. దీంతో కవిత 16న విచారణకు హాజరుకాక తప్పటంలేదు. మహిళనైన తనను ఈడీ అధికారులు ఇబ్బందిపెడుతున్నారని ప్రజాప్రతినిధినైన తన ఫోన్‌ని చట్టవిరుద్ధంగా సీజ్ చేశారని కవిత సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. చీకటిపడ్డాక కూడా రాత్రి 8.30 గంటలదాకా విచారించారని ఆవేదన వ్యక్తంచేశారు. భౌతికంగా మానసికంగా తన పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని తన నివాసంలోనే విచారణ జరపాలని లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలన్న కవిత పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.
కవితను ఢిల్లీకి పిలిపించినరోజున జరిగిన హడావుడి ఇప్పుడు ఆమె సుప్రీం తలుపు తట్టటంతో ఈసారి విచారణ మరింత లోతుగా జరిగేలా ఉంది. సౌత్ గ్రూప్ పాత్రపైనా ఈడీ ఎక్కువ ఫోకస్ పెట్టింది. డిజిటల్ ఎవిడెన్సులు డాక్యుమెంట్లు స్క్రీన్ షాట్లు కాల్ డేటా రెడీ చేసుకున్న ఈడీ స్టేట్మెంట్ల రూపంలో సాక్ష్యాలను సేకరిస్తోంది. సౌత్ గ్రూపుతో సంబంధం ఉన్న శరత్‌చంద్రారెడ్డి, ఎంపీ మాగుంట కొడుకు రాఘవను ఇప్పటికే ఈడీ అరెస్టు చేసింది. విడివిడిగా చేస్తున్న ఎంక్వయిరీలో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా దాటవేస్తున్నారన్న ఉద్దేశంతో కలిపి విచారించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. అందులో భాగంగా కవిత బినామీగా అభియోగాలు మోపిన రామచంద్రపిళ్లైతో కలిపి కవితను విచారించే అవకాశం ఉంది. తాజాగా పిళ్లై బుచ్చిబాబులను కలిపి విచారించిన ఈడీ కవితను కూడా మిగిలిన నిందితులతో కలిపి విచారించే ఆలోచనతో ఉంది.