నాయకులు ఎక్కువ కేడర్ చాలా తక్కువ ఉన్న పార్టీ టీబీజేపీ. ఎవరెన్ని ప్రయత్నాలు సాగించినా కేడర్ బలాన్ని పెంచలేకపోతున్నారు. తటస్థులను పార్టీ వైపుకు ఆకర్షించడమో ఇతర పార్టీ కార్యకర్తలను తమవైపుకు లాక్కోవడమో జరగడం లేదు. దశాబ్దం క్రితం పార్టీకి ఎంత కేడర్ ఉందో ఇప్పుడూ అదే పరిస్థితి కొనసాగుతోందని వినికిడి. పైగా బూత్ కమిటీలంటూ చేసిన హడావుడి గొప్పలు చెప్పుకునేందుకే పరిమితమైంది. దానితో ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓబీసీ జాతీయ మోర్ఛా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తెలంగాణ చేరికల కమిటీ నాయకుడు ఈటల రాజేందర్ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు రాజా సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద పేర్లే వినిపిస్తాయి. పార్టీ అభివృద్ధికి మాత్రం ఎవరూ ఒక చెయ్యి వేయడం లేదన్న చర్చ మరింతగా ఊపందుకుంది.
ఇంతకాలం దక్షిణ భారత దేశంలో తెలంగాణ శాఖను ప్రత్యేకంగా పరిగణిస్తూ తెగ పొగిడేసిన ఢిల్లీ పెద్దలు ఇప్పుడు మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు కనిపించిన ప్రతీ నేతకు తలంటుతున్నట్లు తెలుస్తోంది. మోదీ మద్దతు ఉందని రొమ్ము విరుచుకున్న నేతలకు సైతం కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్లాస్ తీసుకుంటున్నారు. రాష్ట్రంలో పార్టీని నడపాల్సిన తీరు ఇదేనా అని నిలదీస్తున్నారట. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టి లబ్ధిపొందాల్సింది పోయి అంతర్గత కుమ్ములాటతో టైమ్ పాస్ చేశారని అమిత్ షా ఆగ్రహం చెందారట. లిక్కర్ స్కాంలో కవితకు సమన్లు వచ్చి ఆమె ఈడీ ముందు హాజరువుతున్న తరుణంలో ఆ అంశాన్ని సమర్థంగా జనంలోకి తీసుకెళ్లి కవితకు వ్యతిరేకంగా ప్రజావాణిని కూడగట్టడంలో స్థానిక నేతలు విఫలమయ్యారని అమిత్ షా నడ్డా నిలదీసినట్లు సమాచారం.
బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టాల్సిన తరుణంలో బండి సంజయ్ తొందరపాటు వ్యాఖ్యలతో బీజేపీని డిఫెన్స్ లో పడేశారని అధిష్టానం సీరియస్ గా ఉంది. ఇంతకాలం బండి సంజయ్ పార్టీ అధిష్టానానికి ఇష్టమైన నేతగా ఉన్నారు. ఆయన ఒంటెత్తు పోకడను ప్రశ్నించేందుకు రాష్ట్ర శాఖలో అందరూ భయపడేవారు. ఇప్పుడు కవిత వ్యవహారంలో చేసిన కామెంట్స్ తో సీన్ మారిపోయింది. రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడంతో పాటు మహిళా సంఘాలు ఆగ్రహం చెందడంతో పార్టీలో ఆయన ప్రత్యర్థులు రెచ్చిపోతున్నారు. సంజయ్ పై పార్టీ వారే ఆరోపణలు చేయడంతో అధిష్టానానికి దిక్కు తోచడం లేదు. సంజయ్ ను అరవింద్ నిలదీసిన తీరుతో పార్టీకి కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. ఆ కోణంలో పార్టీని ఎలా గట్టెక్కించాలో మీరే నిర్ణయించుకోవాలని రాష్ట్ర శాఖను అధిష్టానం ఆదేశించింది.
బీజేపీని అధికారానికి తీసుకొచ్చే దిశగా పార్టీలో చేరిన ఈటల రాజేందర్ విషయంలోనూ అమిత్ షా నడ్డా అసంతృప్తిగా ఉన్నారట. బీఆర్ఎస్ నుంచి అందరినీ పట్టుకొస్తారనుకుని చేరికల కమిటీ బాధ్యతలు అప్పగిస్తే ఒక్కరిని కూడా తీసుకురాలేకపోయారని పార్టీ పెద్దలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఒక దశలో చేరకల కమిటీ బాధ్యతల నుంచి ఈటల తప్పుకున్నారని వార్తలు రాగా తర్వాత అది నిజం కాదని తేలిపోయింది. ఈటలను ఢిల్లీ పిలిపించుకుని అధిష్టానం వివరణ అడిగింది. వచ్చిన వారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇవ్వలేకపోతున్నామని అందుకే ఎవరూ రావడం లేదని ఈటల సమాధానంతో అధిష్టానం సంతృప్తి చెందలేదు. తెలంగాణ బీజేపీలో ఎమ్మెల్యే టికెట్లకు కొదవలేదని అలా కుదరకపోతే మరో విధంగా పార్టీ పదవులు ఇచ్చే అవకాశాలున్నాయని తెలిసి కూడా ఈటల ఎందుకలా మాట్లాడుతున్నారని అధిష్టానం నిలదీసిందట.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టలో చేరతారని ప్రచారం జరుగుతోంది. దానికి ఆయన వైపు నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో మౌనమే అంగీకారమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పెస్పెన్షన్ కూడా ఎత్తివేయలేదు. అధిష్టానంపై ఆయన ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా ఇతర విషయాల్లో రాజాసింగ్ దూకుడు తగ్గలేదు. ఈ అంశాలపై ఈటల నుంచి సమాచారం రాబట్టేందుకు అధిష్టానం ప్రయత్నించగా ఆయన మాట దాటవేసినట్లు సమాచారం. ఢిల్లీలో జరిగిందేమిటో ఈటల హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాతే తెలుస్తుంది. తెలంగాణలో పరిస్థితులను చక్కబెట్టడానికి త్వరలోనే జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సునీల్ బన్సల్ రాష్ట్రంలో పర్యటిస్తారని తెలియవచ్చింది. అక్కడ ఏం చేయాలో అమిత్ షాతో చర్చించి దిశానిర్దేశం పొందిన తర్వాతే వాళ్లు బయలుదేరతారు. ఒకటి మాత్రం నిజం జాతీయ నాయకత్వం దృష్టి పెడితే తప్ప పరిస్థితులు చక్కబడే అవకాశం లేదు.