కాంగ్రెస్ నుంచే బీజేపీ పుట్టిందని మీకు తెలుసా

By KTV Telugu On 16 March, 2023
image

భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడు ఓ వట వృక్షం దేశం మొత్తం పాతుకుపోయింది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వస్తోంది. దక్షిణాదిన ఇంకా పోరాడుతోంది కానీ బలమైన ముద్ర వేస్తూనే ఉంది. అలాంటి బీజేపీకి వారసత్వం లేదు. వివాదాస్పదమైనా బలమైన సిద్ధాంతం మీదనే పునాదులు వేసుకుని ఎదిగింది. 1984లో బీజేపీకి వచ్చింది కేవలం రెండు అంటే రెండు సీట్లు అందులో తెలంగాణ నుంచి ఒకటి. ఇప్పుడు ఆ పార్టీకి లోక్ సభలో సొంతంగా మెజార్టీ ఉంది. 303 మంది సభ్యులున్నారు. రాజ్యాంగ సవరణ చేయాలంటే మిత్రపక్షాలతో చాలా సులువుగా వన్ బై ధర్డ్ మెజార్టీ సాధించగలదు. ఇంతలా బీజేపీ ఎలా ఎదిగింది. అసాధ్యంగా కనిపిస్తున్న ఈ ఎదుగుదల వెనుక ఏం వ్యూహం ఉంది ప్రజల్నిఎలా మెస్మరైజ్ చేశారు అసలు బీజేపీ పుట్టుక మూలాలు కాంగ్రెస్‌లో ఉన్నాయని మీకు తెలుసా.

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. బీజేపీ తమ కార్యాలయలకు ఈయన పేరు పెడుతుంది. దీనికి కారణం బీజేపీ పుట్టుక వెనక ఉంది ఈయనే. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీ నేత. బెంగాల్ కు చెందిన శ్యాం ప్రసాద్ ముఖర్జీ తొలుత భారత జాతీయ కాంగ్రెసు తరఫున బెంగాల్ శాసనమండలికి ఎన్నికయ్యాడు. మరుసటి సంవత్సరంలోనే బెంగాల్ శాసనసభను బహిష్కరించాలని భారతీయ జాతీయ కాంగ్రెసు నిర్ణయించడంతో ఆ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందాడు. 1941-42 లో బెంగాల్ ప్రావిన్సు మొదటి ఆర్థికమంత్రిగా పదవిని చేపట్టారు. జవహర్ లాల్ నెహ్రూ తన తాత్కాలిక ప్రభుత్వంలో ముఖర్జీకి చోటు కల్పించి పరిశ్రమల మంత్రిత్వశాఖను కేటాయించారు. సర్దార్ వల్లభభాయి పటేల్ భారత జాతీయ కాంగ్రెసు ఇతర నాయకులు ముఖర్జీకి మంచి గౌరవం ఇచ్చేవారు. అయితే కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ ఎక్కువగా హిందూవాదాన్ని ముఖర్జీ వినిపించేవారు. 1949లో నెహ్రూ పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీఖాన్‌తో జరిపిన ఢిల్లీ ఒప్పందం అనంతరం ఏప్రిల్ 6 1950న ముఖర్జీ కేంద్రమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీలపై జరిగిన దారుణాలపై భారతదేశం మౌనంగా ఉండటాన్ని నిరసిస్తూ ముఖర్జీ రాజీనామా చేశారు. ప్రారంభంలో భారత విభజనకు వ్యతిరేకంగా ఉన్న ముఖర్జీ 1946-47 మతకలహాల అనంతరం బెంగాల్ విభజనకు సైతం అంగీకరించాడు. ముస్లిం ఆధిక్యత కల ప్రాంతాలలో ముస్లింలీగ్ పాలిత ప్రాంతాలలో హిందువులు ఉండరాదని తన గళం వినిపించారు. కాంగ్రెస్ లో ఇక ఇమడలేమని నిర్ధారించుకుని కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అనంతరం 1951 అక్టోబర్ 21 న భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు.

1977 లో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ముగించి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్నప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమై జయప్రకాష్ నారాయణ్ పిలుపు మేరకు ‘జనతా పార్టీ’ ని ఏర్పాటు చేశాయి. 1977 మే 1 న భారతీయ జనసంఘ్‌ జనతా పార్టీలో విలీనమైంది. జనతా పార్టీ ప్రయోగం ఎక్కువ కాలం కొనసాగలేదు. పరస్పర పోటీ కూడా పెరుగడం.. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందినవారు పార్టీలో ఉండొద్దని చెప్పడంతో 1980 ఏప్రిల్ 6 న భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. అటల్ బిహారీ వాజ్‌పేయి మొదటి అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ ఆ పార్టీకి 1984 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలు మాత్రమే వచ్చాయి.

బీజేపీ ప్రారంభం కావడానికి మూల కారణం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అయితే ఇప్పుడు ఈ స్థితిలో ఉండటానికి కారణం వాజ్ పేయి అద్వానీ. 1989 లో రామ్ జన్మభూమి ఉద్యమానికి బీజేపీ పార్టీ మద్దతు ఇవ్వడం బీజేపీ ప్రస్థానంలో కీలక పాత్ర. ఆ ఉద్యమాన్ని చేతుల్లోకి తీసుకుని అద్వానీ సోమనాథ్ నుంచి రామ్ రథ్‌ యాత్రను ప్రారంభించడంతో దేశంలో హిందుత్వ వాదం పెరగడం ప్రారంభమయింది. ఈ ఉద్యమం కారణంగా 1993 నాటికి ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీజేపీకి ఓట్లు పెరిగాయి. 1995 లో ఆంధ్ర, కర్ణాటక, బిహార్, ఒడిశా, గోవా, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ గుర్తింపు తెచ్చుకుంది.

చాలా రాష్ట్రాల్లో ఉనికి చాటుకున్నపటికీ సొంతంగా అధికారం సాధించలేకపోయింది బీజేపీ. 1996 లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 161 సీట్లు గెలుచుకుని లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాని అయ్యారు. కానీ మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వం 13 రోజుల్లో పడిపోయింది. 1998 మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ మిత్ర పార్టీలతో కలిసి ఎన్డీఏను ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చింది. 1999 లో అన్నాడీఎంకే తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో మరోసారి ప్రభుత్వం పడిపోయింది. 1999 లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ 303 సీట్లను గెలుచుకుని స్పష్టమైన మెజారిటీని సంపాదించుకున్నది. 183 సీట్లు గెలుచుకుని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ 2009 లో 116 సీట్లకు పడిపోయింది. అంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అది సొంత ప్రభుత్వం కాదు మిత్రపక్షాల ప్రభుత్వమే.

పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న తర్వాత 2014 ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్థిని మార్చాలని బీజేపీ నిర్ణయించుకుంది. వాజ్ పేయి అప్పటికే అనారోగ్యంతో బయటకు రాలేని పరిస్థితి. అద్వానీ వయసు కూడా పెరిగిపోయింది. అలాంటి సమయంలో గుజరాత్ మోడల్‌తో దేశంలో విస్తృత ప్రచారం పొందిన సీఎంగా ఉన్న మోదీని ప్రధాని అభ్యర్థిగా ఖరారు చేశారు. సీనియర్లు కూడా అభ్యంతరం చెప్పలేదు. మోదీకి వచ్చిన క్రేజ్ తో 2014 లో 282 సీట్లలో గెలిచేలా చేయగలిగారు. తిరిగి 2019 ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఇప్పుడు బీజేపీ తిరగులేని శక్తి నాలుగు దశాబ్దాల కాలంలో లోక్‌సభలో 2 సీట్ల నుంచి 303 సీట్లకు పార్టీ ఎదిగింది. అయితే బీజేపీ విజయాల వెనుక ఉన్నది ఆరెస్సెస్. ఎప్పుడూ తెర ముందుకు రాదు. బీజేపీ విజయం వెనుక ఆరెస్సెస్ ఎలా ఉందో మరో కథనంలో తెలుసుకుందాం.