పెట్రోల్ డీజిల్ ధరలు ప్రజలకు సెగ పుట్టిస్తున్నాయి ఎన్నికల ఏడాదిలో ఈ ధరలు కేంద్రానికీ ఇబ్బందే. అందుకే అప్పుడప్పుడు పెట్రోల్ డిజిల్ ధరలను జీఎస్టీలోకి చేర్చే కసరత్తు జరుగుతోందని ప్రకటనలు చేస్తూ బిస్కెట్లు వేస్తూంటారు కేంద్రమమంత్రులు. పెట్రోల్ డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి చేరిస్తే కనీసం 30 రూపాయలు లీటర్‌కు తగ్గుతుందని అంచనా. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నేతలు ఇచ్చిన హామీల్లో పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి చేర్చడం కూడా ఒకటి కానీ దాన్ని అమలు చేయడం లేదు. రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని కారణాలు చెబుతున్నారు. కేంద్రం తాము జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తుల్ని తేవాలనుకున్నా రాష్ట్రాలే అడ్డుకున్నాయని వాదిస్తోంది.
నిత్యావసర వస్తువుల జాబితాలో మొదటి స్థానాన్ని ఆక్రమించిన ఈ రెండింటినీ జీఎస్టీ పరిధిలోకి తేవాలని చాలా కాలంగా కోరుతున్నా కేంద్రం స్పం దించడం లేదని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం మీద రాష్ట్రాలూ రాష్ట్రాల మీద కేంద్రమూ నెపాన్ని నెట్టుకుంటూ పెట్రోలియం ఉత్పత్తుల ధరలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతున్నాయి. చమురు ఉత్పత్తి దేశాల్లో ముడిచమురు ధర బాగా పడిపోయినా మన దేశంలో ఈ రెండింటి ధరలు వినియోగదారులకు అందకుండా పోతున్నాయి. అంతర్జాతీయంగా పెట్రో రేట్లు తగ్గినా ప్రజలకు ఆ భారం తగ్గించడంలేదు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత ముడి చమురు ధర బాగా పెరగవచ్చనుకున్నారు. కానీ రష్యా నుంచి తక్కువకు చములు కొనడం ప్రారంభించారు. గతంలో మన దేశానికి రష్యా చమురు దిగుమతుల వాటా కేవలం 1 శాతంగా మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఇది 35 శాతానికి చేరింది. ఉక్రెయిన్ పై దాడితో అమెరికా దాని మిత్ర దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా రాయితీ ధరలకే చమురును సరఫరా చేస్తోంది. మన దేశానికి భారీగా వస్తున్న చౌక చమురు మూలంగా దేశ ప్రజలకు పెద్దగా ప్రయోజనం కలగడంలేదు. చౌక ధరకు ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నప్పటికీ రిటైల్ ధరలు మాత్రం తగ్గడంలేదు. చమురు కంపెనీలు నష్టాలకు గురి అవుతున్నాయంటూ ఎప్పటికప్పుడు చమురు డీజిల్ ధరలను పెంచుతూనే ఉన్నారు.
ఓ వైపు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుతున్నా ప్రజలకు లాభం ఉండదు. రష్యా చమురు దిగుమతి చేసుకున్నా ప్రయోజనం ఉండదు. మరి జీఎస్టీలో అయినా చేర్చితో ప్రజలకు లాభమే కదా. ఇక్కడ కేంద్ర రాష్ట్రాలు దొంగాట ఆడుతున్నాయి. జీఎస్టీని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని భరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ను కూడా జీఎస్టీలోకి చేరిస్తే ఆ నష్టాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది. అందుకే కేంద్రం పట్టించుకోవడంలేదు. రాష్ట్రాలు కూడా జీఎస్టీ పరిహారం ఇస్తే తాము ఎందుకు వద్దంటామని అంటున్నాయి. పెట్రొల్ డీజిల్ ధరలు తగ్గకపోతే ఆ బాధ్యత కేంద్ర రాష్ట్రాలదే. ఈ రెండింటినీ జీఎస్టీ పరిధిలో చేర్చేందుకు రా ష్ట్రాలు అంగీకరిస్తే జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం రాష్ట్రాలకు సక్రమంగా పంపిణీ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది ప్రజలు లాభపడతారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించడం లేదు.